breaking news
vizenlens
-
హరిబాబు జోరు..అశోక్ బేజారు
విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ ఆయన. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి, అధికారుల పనితీరు పర్యవేక్షణపై ఆయన ఆధ్వర్యంలోనే సమీక్ష ఆసాంతం జరగాల్సి ఉంది. అయితే జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పక్కజిల్లా ఎంపీ హవా ప్రదర్శించేసరికి సాక్షాత్తు కమిటీ చైర్మన్ ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు విస్తుపోయారు. 'ఎంపీ రివ్యూ చేస్తున్నారు...కేంద్రమంత్రి చూస్తున్నారు' అంటూ గుసగుసలాడుకున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి, అధికారుల పనితీరు, పర్యవేక్షణపై నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు దూకుడు చూపించారు. కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కమిటీకి చైర్మన్ అయినప్పటికీ హరిబాబు దాదాపు ఓవర్ టేక్ చేశారు. హరిబాబు సమావేశానికి రాక ముందు వరకే అశోక్ సమీక్ష కన్పించగా, ఆ తర్వాత హరిబాబు హవాయే కన్పించింది. దీంతో అశోక్ దాదాపు ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక డీఆర్డీఎ సమావేశం హాల్లో ఉదయం 11.30గంటలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రారంభమైంది. కమిటీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు రాష్ర్టమంత్రి కిమిడి మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, కె.ఎ.నాయుడు, కలెక్టర్ ఎం.ఎం.నాయక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎజెండాలో పేర్కొన్న ప్రకారం అశోక్ సమీక్ష మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందే పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఒకటి రెండు సందర్భాల్లో అధికారులిచ్చే వివరణపై అశోక్ అసంతృప్తి చెందుతూ గత ప్రభుత్వ హయాంలో షాడో నేత, బ్రోకర్లను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. ఇంతలో గృహ నిర్మాణ శాఖ చర్చకొచ్చింది. అదే సమయంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. హౌసింగ్ పీడీ శాఖా పరంగా అమలవుతున్న పథకాల్ని వివరిస్తుండగా హరిబాబు జోక్యం చేసుకుని ఐఏవై కింద ఎవరికి ఇళ్లు మంజూరు చేశారని, వాటి జాబితా ఏదని, ఏ ప్రకారం లబ్ధిదారుల్ని ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీనికి హౌసింగ్ పీడీ సూటిగా సమాధానం చెప్పలేదు. లబ్ధిదారుల ఎంపిక తాము చేయలేదని, హౌసింగ్ ఎం.డి. చేశారని, అక్కడి నుంచే మంజూరు జాబితా వచ్చిందని చెప్పడంతో హరిబాబులో ఆగ్రహించారు. ఈ సందర్భంలో రాష్ట్రమంత్రి కిమిడి మృణాళిని జోక్యం చేసుకోగా అధికారుల్ని వెనకేసుకుని రావద్దని సుతిమెత్తగా మంత్రికి సూచిం చారు. అక్కడి నుంచి డ్వామా, డీఆర్డీఎ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐటీడీఎ, ఉద్యానవన శాఖ, ట్రాన్స్‌కో తదితర శాఖలపై దాదాపు హరిబాబే సమీక్ష నిర్వహించారు. ప్రతి అధికారినీ గట్టిగా నిలదీశారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈలపై కూడా విరుచుకుపడ్డారు. మధ్యలో ఒకటి రెండు సందర్భాల్లో అశోక్ మాట్లాడేందుకు ప్రయత్నించినా హరిబాబు స్పీడుకు వెనక్కి తగ్గారు. అసలీ కమిటీకి చైర్మన్ అశోకా, హరిబాబా అని పలువురు లోలోపల చర్చించుకున్నారు. గ్యాప్ ఇవ్వకుండా హరిబాబు సమీక్ష చేయడంతో ఎందుకొచ్చిందనుకున్నారో ఏమో గానీ అశోక్ చూస్తూ ఉండిపోయారు. సమీక్ష సమయం ఎక్కువవడంతో అశోక్ గజపతిరాజుకు ఆవలింతలు కూడా వచ్చేశాయి. అప్పుడైనా హరిబాబు వెనక్కి తగ్గుతారేమోనని పలువురు ప్రజాప్రతినిధులు ఆశించారు. కానీ చివరి వరకు ఫలితం లేకపోయింది. -
బాణసంచా విక్రయాలపై విజి‘లెన్స్’
సాక్షి, కడప : బాణసంచా గోడౌన్లు, షాపులపై విజిలెన్స్ కొరఢా ఝుళిపిస్తోంది. ఆకస్మికంగా దాడులు చేస్తూ స్టాకువారీగా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతోపాటు వీటికి బిల్లులు ఉన్నాయా.. పన్ను చెల్లించారా..లేదా అనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మూడు రోజులుగా విజిలెన్స్ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో ముగ్గురు సీఐలు పుల్లయ్య, ఓబులేసు, శ్రీధర్నాయుడుతోపాటు డీసీటీఓలు సత్యం, తులసీరాం, ఏఓ శశిధర్‌రెడ్డి, ఇంకా సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వీరబల్లి, రాజంపేట, చిన్నమండెం ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి. లక్షల్లో సరుకు.... వీరబల్లిలో రెండు గోడౌన్లలో ఒక గోడౌన్లో రూ. 10 లక్షలు,మరో గోడౌన్లో రూ. 40 లక్షలు, చిన్నమండెంలో కోట్లాది రూపాయల సరుకు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిలో విజిలెన్స్ సిబ్బంది స్టాకువారీ డాక్యుమెంట్లను పరిశీలించి వాటికి పన్ను చెల్లిస్తున్నారా..లేదా...అనే విషయమై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గోడౌన్లకు లెసైన్సులు ఉన్నప్పటికీ సరుకులకు సంబంధించిన బిల్లులు, పన్ను వివరాలు లేనట్లు తెలుస్తోంది. దీంతో కమర్షియల్ ట్యాక్స్ వారు వేసే అపరాధ రుసుము కంటే విజిలెన్స్ శాఖ మూడు రెట్లు అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో అధిక మొత్తంలో సొమ్ము అపరాధ రుసుము రూపంలో ప్రభుత్వ ఖాతాలో జమకానుంది. చిన్నమండెంలో దాడులు చిన్నమండెంలో ఉన్న బాణసంచా గోడౌన్‌పై విజిలెన్స్ బృందం బుధవారం దాడులు నిర్వహించింది. అక్కడ నిల్వ ఉన్న బాణసంచాకు సంబంధించి స్టాక్ వివరాలను రాత్రి పొద్దుపోయే వరకు నమోదు చేశారు. స్టాక్‌వారీ డాక్యుమెంట్లకు పన్ను చెల్లింపుల్లో భారీ తేడాలున్నట్లు తెలుస్తోంది. దాడుల్లో సీఐలు ఓబులేసు, పుల్లయ్య, శ్రీధర్‌నాయుడు, డీసీటీఓ సత్యంతోపాటు ఏఓ శశిధర్ పాల్గొన్నారు.