breaking news
vijayawada east constituency
-
సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అంతా సమష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కి డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 88 శాతం కుటుంబాలకు మంచి చేశామని.. విద్య, వ్యవసాయ, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని.. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. దాంతో ప్రజల్లో మార్పు ప్రస్ఫుటంగా కన్పిస్తోందన్నారు. గడప గడపకూ వెళ్లి.. ప్రజలతో మమేకమై.. చేస్తున్న మంచిని చెప్పి.. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరాలని ఉద్బోధించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకురావాలని మార్గనిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఏమన్నారంటే.. ప్రజలతో మమేకమవ్వండి ► నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండటానికి ప్రధాన కారణం.. ఒకటి కార్యకర్తలను కలుసుకోవడం, రెండు మరో 14–15 నెలల్లో జరగనున్న ఎన్నికలకు సమాయత్తం చేయడం. సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 – 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్దాం. గృహ సారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. ► గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవ్వండి. మూడున్నరేళ్లుగా చేస్తున్న మంచిని అక్కాచెల్లెమ్మలకు వివరించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్ అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి. అర్హులెవ్వరూ మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం. గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు. ఏడాదిలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం. ప్రస్ఫుటంగా రాజకీయ మార్పు ► రాష్ట్రంలో 88% ఇళ్లకు మంచి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది. కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్ని ఎన్నికల్లో 80%కి పైగా క్లీన్ స్వీప్ చేయగలిగాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా 21 డివిజన్లలో 14 చోట్ల గెలిచాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. టార్గెట్ 152 కాదు.. 175 ► వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 175 కు 175 సీట్లు మనం గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఏ వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా.. ప్రతి ఇంట్లో కూడా సంతోషం కనిపిస్తోంది. ► మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి.. చదువులు మారుతున్నాయి.. ఆస్పత్రులు మారుతున్నాయి. ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది. ఇంత మార్పు అన్నది ఎప్పుడూ జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులన్నీ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసికట్టుగా పని చేయాలి. ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టాలి. ► వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందాం. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 152 కాదు.. 175 స్థానాల్లో గెలవడమే మన టార్గెట్. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. ► నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వేయని వారి ఇళ్లకు కూడా మనం వెళ్లాలి. చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి. అందరి ఆశీర్వాదాలు కోరాలి. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి. ► విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'సీట్ల కేటాయింపులో వారికి పెద్దపీట వేశాం'
సాక్షి, విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్లో బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ప్రవల్లిక, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి 2, 3, 5, 6, 7 డివిజన్ల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రచారంలో అన్ని డివిజన్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుల్లో యువకులకు, విద్యావంతులకు పెద్ద పీఠవేశామని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే వాయిదాకు కుట్ర పన్నారని విమర్శించారు. కరోనాను సాకుగా చూపి ఎన్నికల కమిషన్‌ను మేనేజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. బాబు ఎన్ని కుట్రలు పన్నినా విజయవాడ మేయర్ సీటును కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 21 కార్పొరేషన్ స్థానాలు వైసీపీనే కైవసం చేసుకోనుందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రూ. 135 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పేదలకు త్వరలోనే 25 వేల ఇళ్లపట్టాలను ఇవ్వనున్నామని, అమ్మ ఒడి పథకం ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
‘మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం’
సాక్షి, విజయవాడ: తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓడినా బొప్పన భవకుమార్ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి.. అనంతరం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ అభివృద్ది కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో నిధుల కేటాయింపులే లేవని మంత్రి ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉందని.. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ప్రశంసించారు. విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తామని, టీడీపీలా తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని స్పష్టం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన సీఎం జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ ఇంచార్జి బొప్పన భవకుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
'అవమానాలు తట్టుకోలేకే పార్టీ మారుతున్నా'
విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచలి రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు తట్టుకోలేకే టీడీపీలో చేరుతున్నట్టు అంతకుముందు యలమంచలి రవి తెలిపారు. చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలని అనుకున్నా, కొందరి స్వార్థ రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌ను వీడవలసి వస్తోందని ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలే తప్ప సముచిత గౌరవం కూడా దక్కలేదన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో జరిగిన అన్యాయంతో మనస్తాపం చెంది టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన పార్టీలో చేరాలనుకున్నా, కార్యకర్తల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని చిరంజీవి, బొత్సతో మాట్లాడినా పట్టించుకోలేదన్నారు.