breaking news
vana devatalu
-
భక్తులను మెచ్చి.. దీవెనలిచ్చి..
సాక్షి ప్రతినిధి, వరంగల్: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. లక్షలాది మంది భక్తుల పూజలందుకున్న వనదేవతల వనప్రవేశం శనివారం ఆదివాసీ గిరిజన సంప్రదాయాల మధ్యన జరిగింది. వనదేవత.. మన దేవత.. జనదేవత అంటూ అపారవిశ్వాసంతో భక్తుల హృదయాలను ఏకం చేసిన సమ్మక్క–సారలమ్మ మళ్లీ వస్తా మంటూ వనానికేగారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం నుంచి మొక్కులు స్వీకరించిన తల్లులు వారిని మెచ్చి దీవెనలిచ్చి అశేష జనం వీడ్కోలుతో వనప్రవేశం చేశారు. దీంతో పసుపు–కుంకుమలే వజ్రాభరణాలుగా, బెల్లమే నిలువెత్తు బంగారంగా, ఒడిబియ్యమే పరమాన్నంగా, చీర ముక్క–రైక బట్టలే సారెలు గా తల్లులకు సమర్పించే అపూర్వ ఆధ్యాత్మిక మహోత్సవం ముగిసింది. ఫిబ్రవరి 4న బుధవారం తిరుగువారం పండుగతో రెండేళ్లకోసారి జరిగే మహాజాతర ప్రక్రియ పరిసమాప్తం అవుతుంది. ఆదివాసీ సంప్రదాయలతో... పూజారులు ఆదివాసీ సంప్రదాయలతో వన దేవతలను శనివారం సాయంత్రం వనంలోకి తీసుకెళ్లారు. మేడారం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్నంగా సాగింది. ఆ దృశ్యం చూసేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవతల వనప్రవేశం కార్యక్రమం శనివారం సాయంత్రం పూజలతో మొదలైంది. ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెపైకి చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీరసారె, బంగారం, పసుపు కుంకుమను మేడారం ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు, గిరిజనేతర భక్తులు తీసుకున్నారు. ప్రసాదాన్ని (బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం అంతా భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం మొదలైంది. దేవతల వనప్రవేశం ఇలా.. శనివారం సాయంత్రం 5 గంటలకు దేవతల వనప్రవేశం ప్రక్రియ మొదలైంది. మొదట గోవిందరాజులును దబ్బగట్ల గోవర్ధన్, పెనక వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల నుంచి సరిగ్గా రాత్రి 7.35 గంటలకు తరలించింది. ఏటూరునాగారం మండలం కొండాయికి అర్ధరాత్రి చేరుకున్నారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును 7.37 గంటలకు పెనక బుచ్చిరాములు నేతృత్యంలో పూజారుల బృందం మేడారం నుంచి మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల వైపు తీసుకెళ్లింది. మధ్యలో నిద్రచేసి ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిíÙ్ఠంచిన మెంటె (వెదురుబుట్ట)ను 7.48 గంటలకు తీసుకుని జంపన్న వాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. అనంతరం 7.58 గంటలకు సమ్మక్కను గద్దె నుంచి పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దె వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలుకలగుట్టకు చేర్చారు. మహా జాతర సందర్భంగా 1.50 కోట్ల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు మేడారం–తాడ్వాయి, మేడారం–గోవిందరావుపేట వయా నార్లాపూర్ రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వేల సంఖ్యలో వాహనాలు సుమారు 14 గంటలపాటు నిలిచిపోయాయి. దీంతో వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం సాయంత్రం వాహనాల్లో బయలుదేరిన భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఆలస్యంగా చేరుకున్న వారు దేవతల వనప్రవేశం తర్వాత సైతం మొక్కులు చెల్లించుకున్నారు. -
అడవులనే వన దేవతలుగా.......
సాక్షి, న్యూఢిల్లీ : ముక్కోటి దేవతలకు ముందు మన పూర్వికులు ప్రకృతిని దైవంగా ఆరాధించేవారు. సూర్యుడు, గాలి, వర్షం, నీరు, వృక్షాలు, అడవులు, జంతువులను దైవ చిహ్నాలుగా గుర్తంచి ప్రార్థించేవారు. అందుకే భారత్‌లోనైనా, యూరప్‌లోనైనా జానపథ కథలు, గంధర్వ కథలు అడవులతో పెనవేసుకొనే ఉంటాయి. భూమిపైన మానవ జాతి నాగరికథ పరిఢవిల్లడంలో అడవులు అద్భుత పాత్రను పోషించాయి. గ్రీకు నాగరికత విలసిల్లడంలో ఆలీవ్ వృక్షం కీలక పాత్ర పోషించిందట. అందుకే ఎవరితోనైనా ‘శాంతి ప్రతిపాదన’కోసం ‘టు ఆఫర్ యాన్ ఆలివ్ బ్రాంచ్’ అని ఆంగ్లంలో వ్యవహరిస్తారు. గ్రీక్, రోమన్ దేవతలతోపాటు అక్కడి చక్రవర్తులు కిరీటాల్లో పుష్పాలను ధరించేవారు. దేవతలను అలంకరించాలన్నా, విజయోత్సవాల సందర్భంగా చక్రవర్తులను సన్మానించాలన్నా గడ్డితో చేసిన కిరీటాలకు గోరింట, సిందూర, బిర్యానీ ఆకులను అలంకించేవారు. పుష్పాలను, చెట్లను రోమన్లు ఆడ దేవతులుగా ఆరాధించేవారు. జపాన్‌లోని ‘షింటో’ ఆరాధకులు ‘క్రిప్టోమేరియా’ చెట్లకు ఆలయాలు నిర్మించారు. దక్షిణ చైనాలోని సనీ ప్రజలు అడవులను ‘మిజీ’ దేవతగా ఆరాధిస్తారు. ఆఫ్రికాలోని అనేక అడవులను ఇప్పటికీ పవిత్రమైనవిగా భావిస్తారు. భారత దేశంలో కూడా భారత దేశంలో కూడా 15000 పవిత్రమైన అడవులు ఉండేవి. వాటిని తపోవన్, మహావన్గా, శ్రీవన్లుగా మన పూర్వికులు విభజించారు. భారత్‌లోని ఆలయాలకు, అడువులకు కూడా విడిదీయరాని అనుబంధం ఉంది. అడవుల్లో వెలసిన ఈ ఆలయాల్లో ఒక్కొదాట్లో ఒక్కో జాతికి చెందిన ప్రత్యేక వృక్షం ఉండేది. వాటిని ‘స్థల వృక్షా’ అని పిలిచేవారు. ఆ ఆలయాల్లోని దేవతలందరికి మొక్కలు, వృక్షాలు, పుష్పాలు, పండ్లతో ప్రత్యేక అనుబంధం ఉండేది. వేప చెట్టును శక్తి, చింత చెట్టును దుర్గ, చెరకును (ఇక్షువన) వినాయకుడు, దేవదారు వృక్షాలను శివుడు, తులసి పొదల(బృందావనం)ను కృష్ణుడిని ప్రతీకలుగా భావించి పూజించే వారు. కన్నడలో వన దుర్గ, బెంగాలీలో బోంబీబీ పేరతో అడవులను దేవతలుగా ఆరాధించేవారు. బీహార్‌లో అర్రాహ్‌లో ‘అరణ్య దేవి టెంపుల్’ ఇప్పటికీ ఉంది. అడవులను వన దేవతలుగా భావించి రక్షించుకోక పోవడం వల్లనే నేడు ‘ఎకాలోజికల్ ఎమర్జెన్సీ’ పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని ‘వన దేవతల’ గురించి, వాటి చుట్టూ ఉన్న కథల గురించి ఇంతకన్నా సంపూర్ణంగా తెలుసుకోవడానికి సుధా జీ తిలక్ రాసిన ‘టెంపుల్స్ టేల్స్’ చదవాల్సి ఉంటుంది. (వారం క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ పుస్తకం ‘అమెజాన్’లో 239 రూపాయలకు లభిస్తుంది) -
నేడు వనంలోకి వనదేవతలు
సాక్షి, మేడారం: మూడు రోజులుగా తీరొక్క మొక్కులు అందుకున్న వన దేవతలు శనివారం వనప్రవేశం చేయనున్నారు. జాతరలో చివరి అంకమైన ఈ ఘట్టం శని వారం సాయంత్రం జరగనుండగా, గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజారులు జరిపిస్తారు. నలుగురు దేవతల పూజారులు గద్దెల వద్ద పూజలు చేస్తారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం సమీపంలోని చిలకలగుట్టపైకి తీసుకువెళతారు. ఈ సమయంలో గద్దెల వద్ద ఉన్న భక్తులకే వనప్రవేశాన్ని చూసే వీలుంటుంది. ఆలయం దాటిన తర్వాత బయట వారినెవరినీ రానివ్వరు. అందుకే ఈలోగానే అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని భక్తులు భారీగా వస్తున్నారు. 19న తిరుగువారం: సమ్మక్క-సారలమ్మ తిరుగువారం పండగను ఫిబ్రవరి 19న గిరిజన పూజారులు ఘనంగా నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా దేవతలను దుమ్ముకాళ్లతో తీసుకువచ్చినందుకు, పూజల్లో తప్పిదాలు జరిగితే మన్నించాలని వేడుకుంటూ ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. తిరుగువారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గుళ్లను, గద్దెలను శుభ్రం చేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో మేడారం మహా వన జాతర ముగుస్తుంది.


