breaking news
The two farmers committed suicide
-
ఇద్దరు రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో ఇంకొకరు.. విద్యుదాఘాతంతో మరొకరు మృతి కరెంటు కోసం రైతుల ఆందోళన వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ శనివారం వరంగల్ జిల్లా కురవిలోని మానుకోట- ఖమ్మం రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న రైతులు రామడుగు/వర్ని: పంటనష్టం.. అప్పుల బాధతో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన ఊకంటి మధుసూదన్‌రెడ్డి(44) రెండేళ్లుగా తనకున్న రెండెకరాల భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతేడాది అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతినగా, ఈసారి వర్షాభావంతో పంట ఎండిపోరుుంది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. ఇద్దరు కుమారుల పై చదువులకు సైతం అప్పు చేశాడు. ఈ క్రమంలో మొత్తం అప్పులు రూ.3.50 లక్షలయ్యాయి. వీటిని తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెంది శనివారం వేకువజామున వ్యవసాయ భూమి వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే, నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన ఖైరొద్దీన్ (35) తనకున్న 20 గుంటల పొలంతోపాటు మూడెకరాలు పొలం కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు.పెట్టుబడులకు, ఇతర ఖర్చులకు రూ. రెండు లక్షల వరకు అప్పుచేశానని, రబీలో పంట రాలి పోయిందని, ఖరీప్‌లో పంట ఎండిపోతోందని చెబుతూ బాధపడే వాడు. ఈ క్రమంలో ఈనెల 9న నిజాంసాగర్‌లో దూకగా, శనివారం చందూర్ గ్రామ శివారులో మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య , కుమారుడు పాషా , కూతురు జరీనా ఉన్నారు. గుండెపగిలి రైతు మృతి నల్లగొండ : అప్పులబాధ తాళలేక గుండెపోటుతో ఓ రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన మాదు నారాయణ(55) గ్రామంలో రైతుల వద్ద భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కుటుంబ అవసరాలు, వ్యవసాయ సాగు అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. పంటల దిగుబడి ఆశాజనకంగా లేదు. మరో వైపు అప్పుల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురవడంతో శనివారం తెల్లవారుజామున నారాయణకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ గ్రామానికి చెందిన డాంగె శ్రీనివాస్ (40) అనే రైతు శుక్రవారం అర్ధరాత్రి తన పంట పొలంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కరెంట్ ట్రిప్పు కావడంతో బోరు వేసేందుకు చీకట్లో తన పొలానికి వెళ్లాడు. బోరు ఆన్‌చేసే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇంటికి రాకపోయేసరికి ఉదయం కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఆదిలాబాద్/ మరిపెడ: ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేరడిగొండ మండలం రోడ్ లఖంపూర్‌కు చెందిన మహిళా రైతు రేంగె అనసూయ (45) తమకున్న ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయాబీన్ వేశారు. కానీ, దిగుబడి ఆశించినరీతిలో వచ్చే సూచనలు కనిపించకపోవడంతో కలత చెందిన అనసూయ శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లగా పరిస్థితి విషమించి రాత్రి మృతిచెందింది. ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన నౌతేగేడం ప్రభాకర్(50) నాలుగెకరాల్లో పత్తి విత్తాడు. కానీ, పంట ఎదుగుదల ఆశాజనకంగా లేదు. దీనికితోడు సాగు కోసం చేసిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. దీంతో ఆందోళన చెందిన ప్రభాకర్ శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించగా, శనివారం ప్రభాకర్ మృతిచెందాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి మరిపెడ: విద్యుదాఘాతంతో వరంగల్ జిల్లా మరిపెడ మండలం మల్లమ్మకుంట తండాకు చెందిన మూగరైతు మృత్యువాత పడ్డాడు. ధర్మ(50) తన పొలంలో విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయడానికి వెళ్లాడు. అతడు వెళ్లే మార్గంలో 11 కేవీ విద్యుత్‌లైన్ తెగిపడింది. చూడకుండా దానిపై అడుగు వేయడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.