breaking news
Traditional wedding celebration
-
సంప్రదాయానికి పెద్ద పీట.. కొబ్బరికాయలకు పసిడి వన్నెలద్దీ..!
సాక్షి, అమలాపురం: ‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’ అన్నట్టు కొబ్బరాకు.. కొబ్బరి కాయలు.. ధాన్యం కుచ్చులు.. చెరకు గెడలు.. అరటి చెట్లు.. అరటి ఆకులు.. పోక చెట్లు... ఆర్కిడ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే పెళ్లి మండపం... పెళ్లి స్వాగత ద్వారం ముస్తాబు చేయడానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తి అయినా కాదేదీ అనర్హం అంటున్నారు మండపాల తయారీదారులు. కొబ్బరాకులతో పెళ్లి మండపాల ముస్తాబు గోదావరి జిల్లాల్లో పెద్ద విషయం కాదు. అదిప్పుడు గోదావరి జిల్లాలు దాటుతోంది. ఇప్పుడు కొబ్బరాకుల ముస్తాబు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక హంగులు అద్దుకుంటోంది. పెళ్లిళ్ల డెకరేషన్లో పెరుగుతున్న హంగూ ఆర్భాటాల్లో సంప్రదాయానికి సైతం పెద్దపీట వేస్తున్నారు.కొబ్బరాకులతో పెళ్లి పందిళ్లు వేయడం.. పందిళ్లకు వేసే రాటలను కొబ్బరాకులతో ముస్తాబు చేయడం గతం నుంచీ ఉన్నదే. పెళ్లిళ్లే కాదు.. గ్రామాల్లో జరిగే ఇతర శుభ కార్యక్రమాల్లోను, ఆలయాల వద్ద జరిగే కల్యాణాలు, యాగాలు వంటి వాటిల్లోను కొబ్బరాకు ముస్తాబు సర్వసాధారణమైంది. ఇప్పుడు అదే కొబ్బరాకుతో కొత్త కొత్త కళాకృతులు తయారు చేయడం ట్రెండ్‌గా మారింది. పెద్ద పెద్ద పెళ్లి మండపాల్లో కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి మండపాలు ఒక్కటే కాకుండా పెళ్లింటి వద్ద, కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సైతం ఈ ఆకులతో అందంగా తయారు చేస్తున్నారు. అంబాజీపేట పెద్ద వీధిలో కొబ్బరి ఆకులతో తయారు చేసిన కళాకృతులు, కొబ్బరి కాయలు, చెరకు గెడలు, ధాన్యం కుచ్చులతో ముస్తాబు చేసిన పెళ్లి ఇంటి వద్ద స్వాగత ద్వారం ఇప్పుడు వీటికి అదనంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జోడిస్తున్నారు. కొబ్బరి ఆకుల స్వాగత స్తంభాలను నెలకొల్పడంతో పాటు వాటికి చిన్న అరటి చెట్లను తగిలిస్తున్నారు. వీటికి అదనంగా కొబ్బరి కాయలు వేలాడదీస్తున్నారు. అక్కడకక్కడ ధాన్యం కుచ్చులూ ఏర్పాటు చేస్తున్నారు. చెరకు గెడలతో ముస్తాబు చేయడమూ పెరిగింది. ఆర్కిడ్లు, చిలుక పువ్వులతో కొత్త అందాలు తీసుకువస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలో ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొబ్బరి కాయలకు అందమైన రంగులద్ది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి డెకరేషన్లు పెళ్లికి కొత్త జోష్ తీసుకు వస్తున్నాయి. చివరకు వధూవరులను అలంకరించే చోట కూడా వీటితోనే చిన్న చిన్న వేదికలు తయారు చేస్తూండటం విశేషం. కొబ్బరితో పాటు అరటి ఆకులతో సైతం వీటిని ముస్తాబు చేస్తున్నారు.ఇతర ప్రాంతాలకు సైతం..కొబ్బరి అధికంగా సాగయ్యే గోదావరి జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లకు కొబ్బరాకు స్వాగత ద్వారాలకు, పెళ్లి మండపాల ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, ఆత్రేయపురం, అంబాజీపేట, రావులపాలెం, రాజమహేంద్రవరం, కడియం, కడియపులంక, పెరవలి, కాకరపర్రు వంటి ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతో ప్రత్యేక ఆకృతులు తయారు చేసేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇక్కడ వీటిని తయారు చేయించి నగరాలలో జరిగే పెళ్లిళ్లకు తీసుకు వెళుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్ల డెకరేషన్లో వినియోగించే ఆర్కిడ్లు, చిలకపువ్వు, డయనల్ గ్రాస్, చిన్నచిన్న అరటి మొక్కలను రైతులు స్థానికంగానే పండిస్తున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, చాగల్లు, కడియం వంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లలో వస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇటు రైతులకు.. అటు డెకరేషన్ చేసేవారికి ఆదాయ వనరుగా మారుతోంది.అరటి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును చేసే వేదికలు అభిరుచి మారుతోందిపెళ్లిళ్లు చేసేవారి అభిరుచి మారుతోంది. బాహుబలి వంటి సెట్టింగ్‌లే కాదు.. ఒకప్పటి సంప్రదాయాన్ని తలపించేలా కొబ్బరి, అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సెట్టింగ్‌లు కావాలంటున్నారు. పెళ్లిళ్లలో అచ్చమైన పల్లె వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనువుగా కొబ్బరి, అరటి వంటి ఆకులతో సైతం కొత్తకొత్త మోడల్స్‌లో డెకరేషన్లు చేస్తున్నాం.– బృందావనం నూకరాజు, ర్యాలి, ఆత్రేయపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకంగా డెకరేషన్ కొబ్బరాకులతో తయారు చేసే కల్యాణ వేదికలు, స్వాగత ద్వారాలు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి కూడా కావాలని కోరుతున్నారు. షాపింగ్ మాల్స్ వంటి ప్రారం¿ోత్సవాల్లో వీటితో ప్రత్యేకంగా డెకరేషన్ చేయించుకుంటున్నారు. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసే చిన్న వేదికల వద్ద కూడా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. – మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లాకొబ్బరి కాయలకు పసిడి వన్నెలద్ది, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి వేదిక -
‘చివరి’ పెళ్లికూతురు
వర్ణం ఫొటోలో ఉన్న ‘నవవధువు’ పేరు ఆర్లెటా సాహితి. ఈమె కొసావో దేశంలోని బోస్నియన్ యువతి. రాజధాని నగరం ప్రిస్టినాలోని ‘ఎత్నలాజికల్ మ్యూజియం’లో జరిగిన ‘సంప్రదాయ వివాహ వేడుక’ ప్రదర్శనలో ఆమెను ఇలా ముస్తాబు చేశారు. వేల ఏళ్లనాటి ఈ తరహా అలంకరణలో ముఖం మీద పొరలు పొరలుగా రకరకాల వర్ణాలు వేస్తారు. బంగారు వృత్తాలు జీవితచక్రాన్ని సూచిస్తే, గీతలేమో వాటిని చేరుకోవడానికి మనిషి నడవాల్సిన దారులు. ఎరుపు వృత్తం గర్భధారణను సూచిస్తే, నీలి, ఎరుపు చుక్కలు సంతానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అయితే, ఈ రకం చిత్రణ పాతకాలపు ముసలమ్మలు మాత్రమే చేయగలుగుతున్నారు. అందువల్ల ఇది కూడా అంతరించే ప్రమాదంలో పడింది. దాన్ని ప్రతిబింబించేలాగా శీర్షికలో చివరి పెళ్లికూతురు అన్నాం.