breaking news
Theej
-
భావి తరాలకూ తీజ్ వారసత్వం
సంస్కృతిని చాటడం అభినందనీయం ఖానాపూన్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఘనంగా ముగిసిన తీజ్ ఉత్సవాలు ఉట్నూర్‌లో హాజరైన ఎమ్మెల్యే, పీవో ఉట్నూర్ రూరల్ : ఆనవాయితీగా వస్తున్న తీజ్ పండుగ వారసత్వాన్ని భావి తరాలకు అందించేలా, మన సంస్కృతిని చాటి చెప్పేలా ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గోర్ బంజారా తీజ్ మేళా ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో పాటు ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటానికి పూజలు నిర్వహించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నత్యాలు, పాటలతో అంగరంగ వైభవంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. పాడిపంట, గొడ్డూగోద, ఇంటిల్లిపాది.. ఇలా గ్రామం మొత్తం బాగుండాలని ఆ దేవుణ్ని కోరుకుంటూ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండువగా సాగాయని తెలిపారు. అందరూ వారి సంప్రదాయ వస్త్రాలను ధరించి భావి తరాలకు వాటి విశిష్టత తెలియజేయాలని కోరారు. అంతకుముందు చేసిన నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే సైతం తీజ్ బుట్టలను తలపై పెట్టుకొని నృత్యం చేశారు. అనంతరం బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఆయా తండాల్లోనూ... మండలంతో పాటు లక్కారం, ఎక్స్‌రోడ్డు, హస్నాపూర్, శ్యాంపూర్‌తో పాటు వివిధ లంబాడి తండాల్లో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. అందరూ ఒకే చోట చేరి ప్రత్యేక పూజల అనంతరం ఊరి పొలిమేరల్లో తీజ్‌లను నిమ్మజ్జనం చేశారు. ఎంపీపీ విమల, జెడ్పీటీసీ జగ్జీవన్, సర్పంచ్ బొంత ఆశారెడ్డి, తహసీల్దార్ రమేశ్ రాథోడ్, గజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, బంజారా సేవా సంఘం ఉపాధ్యక్షుడు గోవింద్‌నాయక్, శ్రీరాంనాయక్, జనార్దన్ రాథోడ్, జాదవ్ కష్ణ, బానోత్ రామారావు, గడ్డం ప్రకాశ్, భరత్ చౌహాన్, ప్రేంసింగ్, రమణానాయక్, వెంకటేశ్, గంగారాంనాయక్, జాలంసింగ్, వెంకట్రావు, వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొన్నారు. -
తీజ్ జోష్
తీజ్.. అంటే యువతీయువకులకు భలే జోష్.. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. లంబాడా గిరిజన యువత ఆడిపాడారు. ఆటపాటలతో అలరించారు. లంబాడాల సంప్రదాయ తీజ్ పండుగలో గిరిజన అధ్యాపకులు, విద్యార్థులు, విశ్రాంత అధికారులు ఉత్సాహంగా.. ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి యువత సంప్రదాయ నృత్యాలతో హుస్సేన్ సాగర్ వరకు వెళ్లారు. సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు గోధుమ మొక్కలను తరలించారు. తీజ్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని కోరారు. ఇదీ తీజ్ పండుగ గోధుమ గింజలను మట్టి నింపిన పాత్రలో పోసి రోజూ నీరు పెడితే అవి మొలకెత్తి నారుగా మారతాయి. నారును 9 రోజుల తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులూ యువత సంబరాల్లో మునిగి తేలుతారు. - ఉపేందర్