Telangana state khanijabhivaddhi company
-
లారీకి రూ.10 వేలు
ఇసుక మాఫియా దోపిడీ క్వారీలో టన్నుకు రూ.320 రవాణాతో కలిపి రూ.448 అమ్మేది మాత్రం రూ.800 దోపిడీపై అధికారుల ఉదాసీనత వరంగల్ : నిర్మాణ రంగాన్ని జిల్లాలో ఇసుక మాఫియా శాసిస్తోంది. ఇల్లు కట్టే వారికి జిల్లా కేంద్రంలోని ఇసుక వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ క్వారీల్లో వ్యాపారులు తెచ్చే ఇసుక ధరలకు, వినియోగదారులకు వీరు విక్రయించే ధరలకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం క్వారీల్లో విక్రయించే ఇసుకకు మాత్రమే నిర్ణీత ధర నిర్ణయించింది. వ్యాపారులు వినియోగదారులకు ఇసుకను అమ్మే ధరను ఖరారు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. వ్యాపారుల ఇష్టారాజ్యం భవన నిర్మాణాలు వరంగల్ నగరంలో అధికంగా జరుగుతుంటారుు. రోజు దాదాపు 500 లారీల ఇసుక వస్తోంది. గోదావరి పుష్కరాల కారణంగా జిల్లాలోని ఏటూరు ప్రభుత్వ క్వారీలో ఇసుక తీయడం లేదు. దీంతో కరీంనగర్ జిల్లాలోని మానేరు ఇసుక మాత్రమే వస్తోంది. వర్షాలు లేకపోవడంతో నిర్మాణ రంగం జోరు సాగుతోంది. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలోని నదుల్లో ఇసుక క్వారీలను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఈ క్వారీల బాధ్యతలు చూస్తోంది. నదుల్లో తీసిన ఇసుకను టీఎస్ఎండీసీ టన్నుకు రూ.320(క్యూబిక్ మీటరు రూ.550) చొప్పున వ్యాపారులకు విక్రయిస్తుంది. లారీల్లో లోడింగ్ పరిమాణాన్ని బట్టి ఇసుక క్వారీల్లో ధర రెండు రకాలుగా ఉంది. 13.5 క్యూబిక్ మీటర్ల(21 టన్నులు)కు రూ.7,425... 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775గా నిర్ణయించారు. డిమాండ్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం ఇదే ధరతో వ్యాపారులకు ఇసుకను సరఫరా చేస్తుంది. ప్రభుత్వ ధరకు రవాణా ఖర్చులతో కలిపి వ్యాపారులు దీన్ని వినియోగదారులకు విక్రయించాల్సి ఉంటుంది. ఇసుక రవాణా చేసే లారీలకు సంబంధించి లీటరు డీజిల్‌కు రెండు నుంచి మూడు కిలో మీటర్లు ప్రయాణిస్తాయి. ఇలా డీజిల్, ఇసుక ధర కలిపి వినియోగదారులకు ఇసుకను విక్రయించాల్సిన వ్యాపారులు ఇష్టమొచ్చినట్లుగా ధరలు ఖరారు చేసి దోచుకుంటున్నారు. మానేరు ఇసుక క్వారీ నుంచి జిల్లా కేంద్రానికి 60 కిలో మీటర్లు ఉంటోంది. ఇసుకను జిల్లా కేంద్రానికి తెచ్చేందుకు లారీ రవాణాకు అయ్యే డీజిల్, డ్రైవర్, కూలీల ఖర్చులు కలిపి గరిష్టంగా రూ.1800లకు మించదు. ఇలా 21 టన్నుల ఇసుక ధర, రవాణా ఖర్చులు కలిపి రూ.9,425 అవుతాయి. ఈ మొత్తాన్ని బట్టి చూస్తే వ్యాపారులకు టన్ను ఇసుక కేవలం రూ.448కి మాత్రమే వస్తోంది. వ్యాపారులు మాత్రం ఇదే ఇసుకను టన్నుకు రూ.800 తక్కువగా అమ్మడం లేదు. డిమాండ్‌ను బట్టి కొందరు వ్యాపారులు టన్నుకు రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగిన వారికి డిమాండ్ బాగా ఉందని.. తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు అని గద్దిస్తున్నారు. ఇలా టన్ను ఇసుకను రూ.448 చొప్పున తెస్తూ రూ.800లకు విక్రయించే వ్యాపారులకు ఒక్కో లారీ లోడ్‌కు రూ.7,375 చొప్పున లాభం వస్తోంది. ఇసుక వ్యాపారుల్లో ఎక్కువ మంది, ముఖ్యంగా మానేరు ఇసుక తెస్తున్న వ్యాపారులు.. ప్రభుత్వం ఇచ్చే వేబిల్ కంటే రెట్టింపు స్థాయిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీరు 18 టన్నులకు వేబిల్ డబ్బులు చెల్లించి 30కిపైగా టన్నులు తెస్తున్నారు. వేబిల్ ప్రకారం ఇసుకను తెచ్చే వారికే ఒక్కో లారీ లోడ్‌కు రూ.8 వేల నుంచి 10 వేలకు వరకు ఆదాయం వస్తోంది. వేబిల్ కంటే ఎక్కువ లోడ్ తెచ్చేవారికి ఈ ఆదాయం రెండుమూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఇలా వ్యాపారులకు వచ్చే ఆదాయం అంతా... వినియోగదారులను దోపిడీ చేస్తున్నట్లుగానే ఉంటోంది. ప్రభుత్వానికి తక్కువ డబ్బు ఇస్తూ రెట్టింపు స్థాయిలో లాభం ఆర్జిస్తున్న వ్యాపారుల దోపిడీని అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి -
ఇసుక దొంగలు
జోరుగా ఇసుక దందా ప్రభుత్వ క్వారీ పేరిట అక్రమాలు వేబిల్లులో 18 టన్నులు.. తెచ్చేది 30 టన్నులు.. సర్కారు ఆదాయానికి రూ.కోట్ల నష్టం చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు వరంగల్: జిల్లాలో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ క్వారీల్లో ఇసుకను తెస్తున్నట్లుగా పేర్కొంటూ కొందరు వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించే డబ్బులకు రెట్టింపు పరిమాణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వరంగల్ కేంద్రంగా ఇసుక వ్యాపారం చేస్తున్న కొందరు రోజు వందల లారీల్లో ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుకను ప్రభుత్వ క్వారీల్లోనే తెచ్చినట్లు పేర్కొంటూ వినియోగదారులకు అధిక ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నా రు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) మానేరు నదిపై నిర్వహించే క్వారీ నుంచి వరంగల్‌కు వస్తున్న ఇసుక విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. వేబిల్లులతో అక్రమాలు వరంగల్ నగరంలో వేలాది భవన నిర్మాణాలు ఏడాది పొడవునా జరుగుతున్నారుు. దీంతో ఇసుకకు భారీగా డిమాండ్ ఉంటోంది. ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు వినియోగదారులకు అధిక ధరకు విక్రయించి దోపిడీ చేసేవారు. అన్ని వర్గాల నుంచి నిరసన మొదలవడంతో ప్రభుత్వం మెల్లిగా చర్యలు చేపట్టింది. నిర్మాణాల్లో అతి ముఖ్యమైన ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ప్రభుత్వమే ఇసుక క్వారీలను ప్రారంభించింది. టీఎస్ఎండీసీ ఈ క్వారీలను నిర్వహిస్తోంది. క్వారీల నుంచి కొంత దూరానికి ఇసుకను తెచ్చి ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తోంది. ఇలా టీఎస్ఎండీసీ వ్యాపారులకు విక్రయించే గరిష్ట ధరను ప్రభుత్వం టన్నుకు రూ.320(క్యూబిక్ మీటరు రూ.550)గా నిర్ణయించింది. లారీల్లో లోడింగ్ పరిమాణాన్ని బట్టి ఇసుక క్వారీల్లో ధర రెండు రకాలుగా ఉంది. 13.5 క్యూబిక్ మీటర్ల(21 టన్నులు)కు రూ.7425.. 10.5 క్యూబిక్ మీటర్ల(18 టన్నులు)కు రూ.5,775గా నిర్ణయించారు. అవసరమైన ఇసుక మేరకు డబ్బును టీఎస్ఎండీసీ పేరిట చెక్కు రూపంలో లారీల నిర్వాహకులు క్వారీ నిర్వహణ అధికారులకు ఇస్తారు. చెక్కులో పేర్కొన్న మొత్తం మేరకు లారీల నిర్వాహకులకు అధికారులు టోకెన్ నంబరు, వే బిల్లు ఇస్తారు. లోడింగ్ చేసుకున్న లారీ వేబిల్లుతో వచ్చి వినియోగదారులకు విక్రయిస్తారు. వేబిల్లుల ప్రక్రియలోనే వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు నగరానికి జిల్లాలోని ఏటూరు, కరీంనగర్ జిల్లా మానేరు ప్రభుత్వ క్వారీల నుంచి ఇసుక వస్తోం ది. పుష్కరాల కారణంగా ప్రస్తుతం ఏటూరు క్వారీ మూతపడింది. దీన్ని ఆసరాగా చేసుకుని మానేరు ఇసుకను వరంగల్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్న వ్యాపారులు ఎక్కువగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మానేరు ఇసుకను తెస్తున్న వ్యాపారుల్లో కొందరు టీఎస్ఎండీసీకి 18 టన్ను ల మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారు. వినియోగదారులకు విక్రయించేటప్పుడు మాత్రం వీరి లారీల్లో ఇసుక 30 టన్నులు, 40 టన్నులు, 60 టన్నులు చొప్పున ఉంటోంది. ప్రభుత్వ క్వారీలో లోడింగ్ చేసేటప్పు డే అనధికారికంగా అధిక పరిమాణంలో లోడ్ చేస్తున్నారని తెలుస్తోంది. అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల్లో కొందరు మాత్రం అసలు విషయం చెబుతున్నారు. ప్రభుత్వ క్వారీల్లో వేబిల్‌లో పేర్కొ న్న ప్రకారమే లోడింగ్ చేస్తున్నారు. మధ్యలో మరోచోట అక్రమంగా తవ్వి లారీల్లో నింపుకొస్తున్నారు. ఇలా వరంగల్ జిల్లాకు వచ్చే సరికి ఇసుక పరిమా ణం రెట్టింపు స్థాయిలో ఉంటోంది. దీని వల్ల ఒక్కో లారీ లోడ్‌కు ప్రభుత్వానికి రూ.7 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం జరుగుతోంది. నెలకే ఈ మొత్తం కోట్ల రూపాయల్లో ఉంటోంది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టే ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన అధికారులు ఈ విషయంలో చోద్యం చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.