ఇది ఎవరి సొత్తూ కాదు!
‘‘సృజనాత్మకత ఏ ఒక్కరి సొత్తూ కాదు. సినిమా రంగంలో కొన్ని కుటుంబాలే ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. తెలంగాణవారి అభ్యున్నతే మాకు ముఖ్యం’’ అని పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సినిమా దర్శకుల సంఘం గుర్తింపు కార్డుల ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన కవిత ఇంకా మాట్లాడుతూ తెలంగాణలో సినిమాను అభివృద్ది చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ ఫిలింసిటీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు.
చిన్నదేశమైన స్విట్జర్లాండ్ షూటింగ్‌లకు సబ్సిడీ ఇచ్చిన తర్వాత.. మన దేశ టూరిజం నుంచి 70 శాతం ఆదాయం స్విట్జర్లాండ్‌కి వెళ్తోందనీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా షూటింగులకు సబ్సిడీ ఇస్తే.. సినీ కళాకారులకు, ముఖ్యంగా తెలంగాణ కళాకారులకు చేయూతనందించినట్లవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేసీఆర్‌కి చెప్పడం జరిగిందని ఆమె చెప్పారు. దర్శకుల సంఘం సృజనాత్మకతో కూడుకున్నదనీ, దానికి ఎప్పటికీ తమ సహకారం ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బి.నరసింగరావు, అల్లాణి శ్రీధర్, పాత్రికేయుడు కట్టా శేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.