31 జిల్లాల తెలంగాణకు తోడు నీడగా ‘సాక్షి’..
వరుసగా మూడు తరాల యువకులు విడిచిన రక్త తర్పణలతో తడిచి ఎర్రబడిన నేల తెలంగాణ. నైజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, రజాకార్ల అరాచకాలు, నైజాం పతనం తర్వాత కూడా కమ్యూనిస్టులు కొనసాగించిన సాయుధ ఘర్షణల్లో నాలుగు వేల మందికి పైగా నాటి తెలంగాణ యువకులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా సాహసులు, ప్రతిభావంతులు. నాటి సమాజానికి తలలో నాలుకలా నిలిచి నాయకత్వం వహించవలసినవారు. వారి ఆత్మబలిదానాలతో ఒక తరం నాయకత్వాన్ని తెలంగాణ కోల్పోయింది. అరవయ్యేడు నుంచి డెబ్బయ్యేడు వరకు మరో బాధాకర దశాబ్దం. తుపాకీ తూటాల చప్పుళ్లతో తెలంగాణ తనువంతా గాయపడిన రోజులవి.
తేజోవంతమైన వేలాది మంది యువకుల నాయకత్వాన్ని ఈ ప్రాంతం కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సల్ పోరాటాలు నాటి సమాజాన్ని అతలాకుతలం చేశాయి. మూడోతరం బలిదానాలు కొంత భిన్నమైనవి. తొంబయ్యో దశకంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అమలు చేసిన విధ్వంసకర విధానాల ఫలితంగా పంట పొలాల్లో చెలరేగిన పెనుమంటలవి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవిగా తయారైన వ్యవసాయ రంగంలో వేలాది మంది యువ రైతులు బలవన్మరణాల పాలైన విషాద ఘట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాజానికి నాయకత్వం వహించవలసిన మెరికల్లాంటి యువకులు ప్రతి తరంలోనూ వేల సంఖ్యలో ప్రాణత్యాగాల బాట పడుతున్న ఆనవాయితీకి చరమగీతం పాడవలసి ఉన్నది.
నవతరాల యవ్వన తేజస్సుతో తెలంగాణ సమాజం వికసించవలసి ఉన్నది. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోవడం వలన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ అవినీతిరహితంగా సమర్థవంతంగా అమలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నది. అలా జరిగిన నాడు మన పల్లెలు మళ్లీ కళకళలాడుతాయి. కొత్త జిల్లా కేంద్రాల చుట్టూ పట్టణీకరణ జరిగి ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రాణాలు బలి పెట్టుకోవలసిన పరిస్థితులూ పోతాయి. ఇప్పటికే మండల స్థాయిలలో నాయకత్వం వహించగలుగుతున్న వెనుకబడిన సమూహాల నుంచి జిల్లా స్థాయి నాయకత్వం ఎదిగిరాగల అవకాశాలు పెరుగుతాయి. ఈ లక్ష్యాల సాధనకు జిల్లాల పెంపు కార్యక్రమం బాటలు వేయాలని ఆశిద్దాం.
తెలంగాణ ప్రజల ప్రస్థానంలో గత ఎనిమిదిన్నర ఏళ్లుగా భాగస్వామిగా ఉన్న ‘సాక్షి’ పత్రిక ఈ అధికార వికేంద్రీకరణ క్రతువులో తనవంతు భారాన్ని మోయడానికి సర్వ సన్నద్ధమై ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ 10 జిల్లా అనుబంధాలను అందిస్తున్న సాక్షి నేటి నుంచి 31 జిల్లా అనుబంధాలను ఇస్తున్నది. ఇది భారమే అయినప్పటికీ.. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లవేళలా తోడు నీడగా ఉండాలన్న సంకల్పంతో ‘సాక్షి’ ఈ బాధ్యతను భుజాలకెత్తుకున్నది. ఎప్పటిలాగానే ఆదరించాలని పాఠక దేవుళ్లకు విజ్ఞప్తి.
– వర్ధెల్లి మురళి, ఎడిటర్