breaking news
Teachers entrance test
-
చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు!
జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలైన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక ఓ పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే అజ్మీర్‌లోని కిషన్గఢ్లో ఒక అభ్యర్థి బ్లూటూత్ పరికరాన్ని తన చెప్పులలో దాచి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి పట్టుబడగా, ఇటువంటి ఘటనలే రాజస్తాన్ వ్యాప్తంగా ఆదివారం వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సహా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ బ్లూటూత్-అమర్చిన చెప్పులు కొనుగోలుకు రూ. 6 లక్షల వరకు చెల్లించినట్లు నిందితులు తెలిపారు. భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ హైటెక్ మాస్ కాపీ తెర వెనుక ఎవరెవరూ ఉన్నారో తెలుసుకోవడానికి పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన తర్వాత పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న చెప్పులను తొలగించాలని అజ్మీర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి.. -
టీచర్ల ఎంపిక పరీక్షలో హైటెక్ కాపీయింగ్.. ఏకంగా చెప్పులో..
జైపూర్: రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఎంపిక కోసం నిర్వహించిన పోటీ పరీక్షలో హైటెక్ కాపీయింగ్ బట్టబయలయ్యింది. ‘బ్లూటూత్ చెప్పుల’ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాజస్తాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్((రీట్)ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. తొలుత అజ్మీర్‌లోని ఓ కేంద్రంలో పరీక్ష రాసేటప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించిన ఓ అభ్యర్థిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడు ధరించిన చెప్పు లోపల కనిపించకుండా సెల్‌ఫోన్‌ను అమర్చినట్లు గుర్తించారు. అలాగే చెవిలో బయటకు కనిపించని బ్లూటూత్‌తో కూడిన సూక్ష్మమైన రిసీవర్ ఉంది. పరీక్ష కేంద్రం బయట ఉన్న వ్యక్తులు అతడికి సమాధానాలు చేరవేస్తున్నట్లు కనిపెట్టారు. వాటిని సదరు అభ్యర్థి చెప్పులోని సెల్‌కు అనుసంధానించిన బ్లూటూత్ రిసీవర్ ద్వారా వింటున్నట్లు తేల్చారు. దీంతో అధికారులు అన్ని ఎగ్జామ్ సెంటర్లను అప్రమత్తం చేశారు. బికనెర్, సికార్ పట్టణాల్లోనూ ఇలాంటి బాగోతాలే బయటపడ్డాయి. మూడు పట్టణాల్లో మొత్తం ఐదుగురు చీటర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చీటింగ్ చెప్పులను చాలా తెలివిగా తయారు చేశారని, ఇది కుటీర పరిశ్రమను తలపిస్తోందని వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ‘రీట్’ తదుపరి దశ పరీక్షకు అభ్యర్థులెవరూ స్లిప్పర్స్, బూట్లు, సాక్సులు ధరించి రావొద్దని అధికారులు ఆదేశించారు. ఆదివారం రీట్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను 12 గంటలపాటు ఆపారు. రాష్ట్రంలో 31 వేల టీచర్ పోస్టులకు 16 లక్షల మంది పోటీ పడుతున్నారు. (చదవండి: యూపీ బరిలో ఒవైసీ అలజడి) -
అలా ‘బుక్’ అయ్యారు!
* మారిన సిలబస్.. పాత పుస్తకాల కోసం ఉపాధ్యాయ అభ్యర్థుల గాలింపు * 3, 6, 7, 8 తరగతుల పుస్తకాలకు భారీ డిమాండ్.. * మార్కెట్లో దొరకని వైనం * పాఠశాలల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షిణలు ఆ పుస్తకాలు మారిపోయి మూడేళ్లవుతోంది. ఇప్పుడు ఆ పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగానే టీచర్ల నియామక పరీక్ష జరగబోతోంది. పాత పుస్తకాలు మార్కెట్లో కాదుకదా.. కనీసం పాఠశాలల్లో కూడా దొరకడం లేదు. తాజా డీఎడ్, బీఎడ్ చేసిన అభ్యర్థులకు అసలు ఆ పుస్తకాలను రాబట్టుకోవడమే పెద్ద పరీక్షగా మారింది. రాకరాక టీచర్ల భర్తీ నోటిఫికేషన్ వస్తే ఈ ‘సిలబస్’ కష్టాలేంట్రా బాబూ అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వచ్చే మే నెలలో టెట్ కమ్ టీఆర్టీ(టెర్ట్) పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను మూడు నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగానే నిర్వహించనున్నామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా ఒక్కసారిగా పాత పుస్తకాల వేట మొదలెట్టారు. వాస్తవానికి 3, 6, 7, 8వ తరగతులకు 2012 నుంచి, 4, 5, 9వ తరగతులకు 2013 నుంచి పుస్తకాలు మారాయి. ఇక పదో తరగతి పుస్తకాలు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మారాయి. అంటే 3, 6, 7, 8వ తరగతుల పాత పాఠ్యపుస్తకాలను మూడేళ్ల కిందటే పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ పుస్తకాల నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రశ్నలు రానుండడంతో అభ్యర్థులు గందరగోళపడుతున్నారు. కనిపించని పాతపుస్తకాలు సర్కారు బళ్లల్లో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇవే పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పుస్తకాల షాపుల నుంచి కొనుగోలు చేస్తారు. రెండు, మూడేళ్ల కిందటే పుస్తకాలు మారడంతో ప్రస్తుతం అవి దుకాణాల్లో కూడా లభించడం లేదు. దీంతో అభ్యర్థులంతా సర్కారు బళ్లలో పాత స్టాకు ఉంటుందేమోనని ఆ వైపు తొంగిచూస్తున్నారు. అక్కడ మిగిలి ఉన్న ఒకటి, రెండు సెట్లను ఉపాధ్యాయులు తమ సమీప బంధువులకో, స్నేహితులకో ఇచ్చుకోవడంతో పాత పుస్తకాల లభ్యత కష్టతరంగా మారింది. సగం ప్రశ్నలు అందులోంచే.. వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల్లో కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదలచేసిన షెడ్యూల్ ప్రకారం ఎస్జీటీ పరీక్ష 180 మార్కులకు, స్కూలు అసిస్టెంట్, లాగ్వేంజ్ పండిట్ పరీక్ష 200 మార్కులకు నిర్వహించనున్నారు. వీటిలో సగానికి పైగా ప్రశ్నలు 3 నుంచి 10 తరగతుల పాఠ్య పుస్తకాలనుంచే ఉంటాయి. దీన్ని బట్టి తరగతి పుస్తకాల ప్రాముఖ్యత అర్థమవుతోంది. ఇంతటి డిమాండ్ ఉన్న పాత పాఠ్యపుస్తకాలు మార్కెట్లో లభించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా అభ్యర్థులకు అగచాట్లే! కొన్నేళ్లుగా డీఎస్సీ పరీక్షలు రాస్తూ పాత పాఠ్య పుస్తకాలను దాచుకున్న అభ్యర్థుల మాట అటుంచితే ఈ ఏడాదే కొత్తగా డీఎస్సీ పరీక్ష రాయబోతున్న అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2013, 2014 సంవత్సరాల్లో డీఎడ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు తొలిసారిగా 2015లో ఈ పరీక్ష రాయబోతున్నారు. వీరి ఉపాధ్యాయ శిక్షణ కూడా కొత్త పాఠ్య పుస్తకాలపైనే కొనసాగింది. ఇప్పుడు పాత పాఠ్యపుస్తకాలను చదవడం అటుంచితే.. అసలు వాటిని సంపాదించడమే తలనొప్పిగా తయారైంది. ఈ పుస్తకాలు ఎక్కడైనా కనబడితే వాటిని జిరాక్స్ తీయించుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. పాత పుస్తకాలు చదివి.. కొత్త పాఠాలు చెప్పాలి ఇంకోవిషయమేమంటే ప్రస్తుతం కొత్త పాఠ్యపుస్తకాల ద్వారా విద్యాబోధన సాగుతోంది. ఇప్పుడు డీఎస్సీ రాసే అభ్యర్థులు పాత పాఠ్య పుస్తకాలు చదివి రాయాల్సి ఉంది. అంటే పాత పాఠ్యపుస్తకాలు చదివి పరీక్షరాసి.. కొత్త పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను పిల్లలకు చెప్పాలన్నమాట. ఇదేం విచిత్రమో అధికారులకు, పాలకులకే తెలియాలి.