అమిత్‌షా తమిళనాడు పర్యటన రద్దు
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తమిళనాడు పర్యటన వాయిదా పడింది. రేపటి నుంచి మూడురోజుల పాటు ఆయన తమిళనాడులో పర్యటించాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉన్నాయన్న ప్రచారంతో ఆయన పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజులు అత్యంత ముఖ్యమైనవని, అందువల్ల ఆయన ఢిల్లీలోనే ఉండాల్సిన అవసరం ఉందని, అందువల్లే తమిళనాడు పర్యటన వాయిదా వేసుకున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఢిల్లీలో సోమవారం పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల సమావేశంతోపాటు మరికొన్ని సమావేశాలకు ఆయన హాజరవ్వాల్సిన అవసరం ఉన్నందున తమిళనాడు పర్యటన వాయిదా పడిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు సౌందర్‌రాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.
దీని ప్రభావంతో 95 రోజుల దేశవ్యాప్త పర్యటన కూడా వాయిదా పడిందన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. షా దక్షిణాది రాష్ట్ర పర్యటన రద్దవడం ఇది రెండోసారి. మే నెలలో తమిళనాడులో పర్యటించాల్సి ఉండగా మొదటిసారి రద్దయింది. 2019లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీని అట్టడుగుస్థాయి నుంచి పటిష్ట పరిచే మార్గాలను అన్వేషించేందుకు అమిత్‌షా దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు.