breaking news
the support price
-
రబీ ‘సాగే'నా?
నెల్లూరు (అగ్రికల్చర్) : రబీ సీజన్ ప్రారంభమైనా సాగు సన్నాహాలు పూర్తిస్థాయిలో కానరావడం లేదు. ఖరీఫ్ పంటకు మద్దతు ధర లేకపోవడం, పెట్టుబడి వ్యయం పెరగడం, నీళ్లు లేక పంటలు ఎండిపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర కష్ట, నష్టాలను చవి చూశారు. ఒక పక్క జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కావడం, మరో పక్క రుణమాఫీ అమలు కాక అప్పుల భారం పెరగడంతో రైతుల్లో వ్యవసాయంపై నిర్లిప్తత నెలకొంది. మెట్టపైర్ల సాగు కూడా ఆశించిన స్థాయిలో ప్రారంభం కావడం లేదు. ఈ ఏడాది రబీ ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,50,247 హెక్టార్లు ఉంటే అనేక కారణలతో 1,46,961 హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగయినట్లు అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ గత నెల నుంచే ప్రారంభమైనప్పటికీ వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంత వరకు సన్నాహాలే ప్రారంభం కాలేదు. డెల్టా ప్రాం తంలో వరి నార్లు పోసుకున్నా, నాన్ డెల్టాలో వర్షం లేకపోవడంతో కనీసం నారుమడులు కూడా ఏర్పాటు చేసుకోలేదు. మినుము, వాణిజ్య పంటల సాగు సైతం సానుకూలంగా సాగడం లేదు. పెసర మాత్రమే సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేస్తున్నారు. రుణమాఫీతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం రోజుకో నిర్ణయంతో కాలం వెళ్లదీస్తోంది. ఖరీఫ్ రుణాల రీషెడ్యూల్కు, పంటల బీమాకు సైతం నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో రబీ పంటలు వేయడానికి రైతుల చేతుల్లో డబ్బులు లేక, అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో అన్నదాతలు సాగుపై ఆశలు వదులుకున్నారు. జిల్లాలో 2,76,425 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి 32,794 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పడిపోతున్న భూగర్భజలాలు జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో తక్కువ శాతం నమోదైంది. సోమశిల ప్రాజెక్టులో 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పటికీ 47.254 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్‌లో 67 టీఎంసీలకు గాను 25.302 టీఎంసీలు, సర్వేపల్లి రిజర్వాయర్‌లో 12 అడుగులకు 7.3 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. కనిగిరి రిజర్వాయర్‌లో 21.45 అడుగులకు 17.5, నెల్లూరు చెరువులో 16.30కు 12.6 అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉంది. నాన్‌డెల్టా ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో క్రమంగా పడిపోతున్న భూగర్భజల మట్టాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, మర్రిపాడు, రాపూరు, తదితర మండలాల్లో భూగర్భజలం 10 మీటర్ల లోతుకు చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో ఖరీఫ్‌లో వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రబీసాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. రబీ సాగు విస్తీర్ణం : పంట సాధారణ విస్తీర్ణం {పస్తుత విస్తీర్ణం హెక్టార్లు 1.వరి 1,98,295 12029 2.జొన్న 961 30 3.సజ్జ 38 0 4.రాగి 81 0 5.మొక్కజొన్న 1056 42 6.కంది 202 56 7.పెసర 3686 4137 8.మినుము 27316 12,189 9.ఉలవ 94 0 10.వేరుశనగ 4910 0 11.నువ్వులు 891 16 12.పొద్దుతిరుగుడు 2257 33 13.పచ్చిశనగ 10070 0 14.అలసంద 106 30 15.పత్తి 1751 35 16.మిరప 1396 502 17.చెరకు 7106 0 18.ఆనియన్ 1 0 19.పొగాకు 11334 3026 20.కూరగాయలు 1921 618 21.ఇతర పంటలు 2953 56 మొత్తం 2,76,425 32,794 -
చక్కెర మిల్లులకు చిక్కులు
కర్మాగారాలకు భారంగా మద్దతు ధర ప్రభుత్వ పెంపుదల కంటితుడుపే.. రికవరీ పడిపోయినవాటికి నష్టాల తాకిడి సహకార రంగానికి గడ్డుకాలం కమిటీలతో సరిపెట్టేస్తున్న సీఎం అనకాపల్లి: చెరకు రైతులకు మద్దతు ధర చెల్లింపు సహకార చక్కెర మిల్లులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ఉంది. గిట్టుబాటు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తుంటే.. రికవరీ శాతం ప్రామాణికంగా కనీస మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది. ఏడాదికేడాది రికవరీ శాతం పడిపోతున్న కర్మాగారాలకు ఇది ఆశనిపాతమవుతోంది. 2014-15 సీజన్‌కు సంబంధించి సహకార చక్కెర కర్మాగారాలు 9.5 రికవరీ శాతం ప్రామాణికంగా టన్నుకు రూ.2,200 మద్దతు ధర, రూ.60లు కొనుగోలు పన్ను చెల్లించాలి. రికవరీ శాతం బాగా ఉన్న కర్మాగారాలే మద్దతు ధరను ఇవ్వలేక కిందా మీద పడుతూంటే 9.5 శాతం కంటే తక్కువ నమోదయ్యే కర్మాగారాల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. ఇందుకు తుమ్మపాల మిల్లు పరిస్థితే తార్కాణం. గతేడాది ఈ మిల్లు7.9 శాతమే రికవరీ సాధించింది. 28 వేల టన్నుల చెరుకు గానుగాడగా, పంచదార దిగుబడి తీసికట్టుగా మారింది. నష్టాల బాటలో ఉన్న ఈ సుగర్స్ గత సీజన్ బకాయిలను ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. కేవలం టన్నుకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చి ఆర్థిక పరపతి కోసం ఎదురు చూస్తోంది. ఓవర్‌హాలింగ్ లేకుండా, నిధుల సర్దుబాటు కనిపించకుండా సతమతమవుతున్న ఈ మిల్లు యాజమాన్యం వచ్చే సీజన్‌కు టన్నుకు రూ.2260లు చెల్లించడం పెద్ద గుదిబండే. అలాగని రైతుకు టన్నుకు రూ.2260లు కూడా ఏ మాత్రం గిట్డుబాటు కాదని వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మిల్లుల్లో రికవరీ మెరుగుపడాలంటే ఆధునికీకరణ ఒక్కటే మార్గం. ఇందుకు నిధులివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిఫుణుల కమిటీ అంటూ ఈ అంశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహకార చక్కెర మిల్లుల ఆర్థిక స్థితిగతులు, భవితవ్యంపై కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికకు రెండు మూడు నెలలయినా పడుతుంది. ఆర్థిక పరిపుష్టి, రికవరీ శాతం ఆశాజనకంగా ఉన్న కర్మాగారాలు కమిటీ నివేదికతో పనిలేకుండానే క్రషింగ్ ప్రారంభించి రైతులకు మద్దతు ధర చెల్లించగలవు. కానీ తుమ్మపాల మిల్లులా అవస్థలు పడుతున్న చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమవుతుంది. ఇప్పటికే 2014-15 సీజన్ మాదిరి రైతులకు బకాయిలు చెల్లించకపోవడం, కర్మాగారంలోని ఉద్యోగులకు జీతాలు బకాయిలు వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తుమ్మపాలకు మద్దతు ధర అంశం కష్టమవుతోంది. ఇక జిల్లాలోని ఏటికొప్పాక 10.2శాతం రికవరీతో వచ్చే సీజన్‌కు జిల్లాలోని అన్ని మిల్లుల కంటే అధికంగా రూ. 2380లు చెల్లించనుంది. తాండవ రూ.2350లు , తుమ్మపాల, గోవాడ కర్మాగారాలు రూ.2260లు చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక, గోవాడ మిల్లులు మద్దతు ధర చెల్లింపు విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేనప్పటికీ తుమ్మపాలను మాత్రం అన్నింటా సమస్యలతో అష్టదిగ్బంధనానికి గురవుతోంది.