చక్కెర మిల్లులకు చిక్కులు | The implications of the sugar mills | Sakshi
Sakshi News home page

చక్కెర మిల్లులకు చిక్కులు

Sep 11 2014 12:09 AM | Updated on Sep 2 2017 1:10 PM

చక్కెర మిల్లులకు చిక్కులు

చక్కెర మిల్లులకు చిక్కులు

చెరకు రైతులకు మద్దతు ధర చెల్లింపు సహకార చక్కెర మిల్లులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ఉంది. గిట్టుబాటు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తుంటే..

  •    కర్మాగారాలకు భారంగా మద్దతు ధర
  •      ప్రభుత్వ పెంపుదల కంటితుడుపే..
  •      రికవరీ పడిపోయినవాటికి నష్టాల తాకిడి
  •      సహకార రంగానికి గడ్డుకాలం
  •      కమిటీలతో సరిపెట్టేస్తున్న సీఎం
  • అనకాపల్లి: చెరకు రైతులకు మద్దతు ధర చెల్లింపు సహకార చక్కెర మిల్లులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ఉంది. గిట్టుబాటు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తుంటే.. రికవరీ శాతం ప్రామాణికంగా కనీస మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది. ఏడాదికేడాది రికవరీ శాతం పడిపోతున్న కర్మాగారాలకు ఇది ఆశనిపాతమవుతోంది. 2014-15 సీజన్‌కు సంబంధించి సహకార చక్కెర కర్మాగారాలు 9.5 రికవరీ శాతం ప్రామాణికంగా టన్నుకు రూ.2,200 మద్దతు ధర, రూ.60లు కొనుగోలు పన్ను చెల్లించాలి.

    రికవరీ శాతం బాగా ఉన్న కర్మాగారాలే మద్దతు ధరను ఇవ్వలేక కిందా మీద పడుతూంటే 9.5 శాతం కంటే తక్కువ నమోదయ్యే కర్మాగారాల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. ఇందుకు తుమ్మపాల మిల్లు పరిస్థితే తార్కాణం. గతేడాది ఈ మిల్లు7.9 శాతమే రికవరీ సాధించింది. 28 వేల టన్నుల చెరుకు గానుగాడగా, పంచదార దిగుబడి తీసికట్టుగా మారింది. నష్టాల బాటలో ఉన్న ఈ సుగర్స్ గత సీజన్ బకాయిలను ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. కేవలం టన్నుకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చి ఆర్థిక పరపతి కోసం ఎదురు చూస్తోంది.

    ఓవర్‌హాలింగ్ లేకుండా, నిధుల సర్దుబాటు కనిపించకుండా సతమతమవుతున్న ఈ మిల్లు యాజమాన్యం వచ్చే సీజన్‌కు టన్నుకు రూ.2260లు చెల్లించడం పెద్ద గుదిబండే. అలాగని రైతుకు టన్నుకు రూ.2260లు కూడా ఏ మాత్రం గిట్డుబాటు కాదని వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. మిల్లుల్లో రికవరీ మెరుగుపడాలంటే ఆధునికీకరణ ఒక్కటే మార్గం. ఇందుకు నిధులివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిఫుణుల కమిటీ అంటూ ఈ అంశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహకార చక్కెర మిల్లుల ఆర్థిక స్థితిగతులు, భవితవ్యంపై కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికకు రెండు మూడు   నెలలయినా పడుతుంది.

    ఆర్థిక పరిపుష్టి, రికవరీ శాతం ఆశాజనకంగా ఉన్న కర్మాగారాలు కమిటీ నివేదికతో పనిలేకుండానే క్రషింగ్ ప్రారంభించి రైతులకు మద్దతు ధర చెల్లించగలవు. కానీ తుమ్మపాల మిల్లులా అవస్థలు పడుతున్న చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కీలకమవుతుంది. ఇప్పటికే 2014-15 సీజన్ మాదిరి రైతులకు బకాయిలు  చెల్లించకపోవడం, కర్మాగారంలోని ఉద్యోగులకు జీతాలు బకాయిలు వంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తుమ్మపాలకు మద్దతు ధర అంశం కష్టమవుతోంది.

    ఇక జిల్లాలోని ఏటికొప్పాక 10.2శాతం రికవరీతో వచ్చే సీజన్‌కు జిల్లాలోని అన్ని మిల్లుల కంటే అధికంగా రూ. 2380లు చెల్లించనుంది. తాండవ రూ.2350లు  , తుమ్మపాల, గోవాడ కర్మాగారాలు రూ.2260లు చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక, గోవాడ మిల్లులు మద్దతు ధర చెల్లింపు విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేనప్పటికీ తుమ్మపాలను మాత్రం అన్నింటా సమస్యలతో అష్టదిగ్బంధనానికి గురవుతోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement