breaking news
sugarcane Bills
-
బిల్లు అందదు.. చింత తీరదు
క్రషింగ్ ముగిసినా అందని చెరకు బిల్లులు - మూడు నెలలుగా పేరుకుపోయిన బకాయిలు - ట్రైడెంట్, ఎన్డీఎస్ఎల్ తీరుపై రైతుల ఆందోళన చెరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు మొదలు పెట్టిన నాటి నుంచి దిగుబడులను ఫ్యాక్టరీకి తోలే వరకే కాదు... బిల్లులు వచ్చేంతవరకు వారిని సమస్యలు వీడడం లేదు. గిట్టుబాటు ధర రాక.. యాజమాన్యం ప్రకటించిన ధర మొత్తం ఒకేసారి అందక సతమతమవుతున్నారు. ఏటా యాజమాన్యం కొంత మొత్తాన్ని పెండింగ్‌లో పెట్టడం కూడా వీరిని ఇబ్బందుల పాల్జేస్తోంది. మెదక్‌లోని ఎన్డీఎస్ఎల్ను ఎత్తేస్తారనే ప్రచారం సాగుతోండడంతో అక్కడి రైతులు బిల్లుల కోసం ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఎస్ఎల్.. రూ.27 కోట్లకుగాను రూ.7 కోట్లే చెల్లించింది. ఇక ట్రైడెంట్ రూ.53.63 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ. 53 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. జహీరాబాద్: స్థానికంగా గల ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులు చెరకు బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారు. గురువారం రాత్రితో క్రషింగ్ ముగిసినా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జనవరి 22 వరకు మాత్రమే బిల్లులు చెల్లించిందని రైతులు పేర్కొంటున్నారు. జనవరి 31వరకు చెరకు బిల్లులను బ్యాంకులకు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. చెరకును సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నా యాజమాన్యం తుంగలో తొక్కి ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు పేర్కొంటున్నారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ట్రైడెంట్ కర్మాగారం రూ.53.63 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ. 53 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్లో 5.54 లక్షల టన్నుల క్రషింగ్... ఈ సీజన్లో కర్మాగారం 5.54 లక్షల టన్నుల చెరకును గానుగాడించింది. ఈ లెక్కన పూర్తి స్థాయి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా ఆ మేరకు జరగలేదు. పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని చూస్తే యాజమాన్యం ప్రకటించిన ధర ఏ మాత్రం గిట్టుబాటుగా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అది కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెరకు కోత, రవాణా ఖర్చుల కింద టన్నుకు రూ.1,000 వరకు ఖర్చు చేసుకోవాల్సి వచ్చిందని, ఇందుకోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చిందని వారంటున్నారు. ఇచ్చే బిల్లుల్లో సైతం కోత.. రైతులకు యాజమాన్యం చెల్లిస్తున్న చెరకు బిల్లుల్లో కూడా కోత విధిస్తోంది. టన్నుకు రూ.2,600 ధర చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం రైతులకు టన్నుకు రూ.2,340 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి బిల్లులు చెల్లిస్తే సౌలభ్యంగా ఉండేదని రైతులంటున్నారు. కోత విధించిన మిగతా మొత్తం (టన్నుకు రూ.260 చొప్పున) ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. గత ఏడాది సైతం టన్నుకు రూ.200 చొప్పున బకాయి పడిన మొత్తాన్ని క్రషింగ్ ఆరంభంలో చెల్లించినట్టు వారు తెలిపారు.ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలంటున్నారు. పంట దిగుబడులు పడిపోయాయని, పెట్టుబడుల వ్యయం కూడా పెరిగిందన్నారు. క్రషింగ్ ముగిసినందున పూర్తి బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు పన్నూ యాజమాన్యం ఖాతాలోనే... చెరకు కొనుగోలు పన్నును ప్రభుత్వం యాజ మాన్యాలకే చెల్లిస్తుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.60 కొనుగోలు పన్ను చెల్లిస్తోంది. యాజ మాన్యం మాత్రం ప్రభుత్వం ఇచ్చే ఈ పన్నును కలుపుకొని ధర నిర్ణయిస్తోంది. ఈ రకంగా కూడా తాము నష్టపోతున్నామని రైతులంటున్నారు. కొనుగోలు పన్నును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు. -
ఈ శ్రమకు ఫలితమేది!
బోధన్, న్యూస్‌లైన్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వ అధీనంలో ఉండగా చెరుకు పంటకు గిట్టుబాటు ధర లభించేది. రైతులకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందేవి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఈ చక్కెర కర్మాగారాన్ని 2002లో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో(జాయింట్ వెంచర్) ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతో వ్యవహరిస్తూ రైతులను కడగండ్ల పాలు చేస్తోంది. ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. సమాచారం లేకుండానే.. ఈ సీజన్లో క్రషింగ్‌ను 2013 నవంబర్ ఆఖరి వారంలో ప్రారంభిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు రైతులు చెరుకు నరికి ఫ్యాక్టరీకి తరలించారు. అయితే ఫ్యాక్టరీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే క్రషింగ్‌ను నిలిపివేసింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. క్రషింగ్ ప్రారంభించాలంటూ ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్వర్యంలో బంద్ కూడా పాటించారు. దిగివచ్చిన యాజమాన్యం డిసెంబర్ ఏడో తేదీనుంచి క్రషింగ్ ప్రారంభించింది. క్రషింగ్ కొనసాగుతోంది. చెల్లింపుల్లో జాప్యం ఎన్డీఎస్ఎల్ పరిధిలో 2013 -14 సీజన్‌కుగాను సుమారు 5 వేల ఎకరాల్లో చెరుకు పంటను సాగు చేశారు. ఇప్పటి వరకు సుమారు లక్షా 60 వేల టన్నుల వరకు చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. ఫ్యాక్టరీ ప్రకటించిన ధర ప్రకారం రైతులకు సుమారు రూ. 42 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలి. అయితే గడువు దాటినా బిల్లులు చెల్లించకపోవడంతో ఫ్యాక్టరీ యాజమాన్యంపై రైతులు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో తొలి విడతలో రూ. 7 కోట్లు చెల్లించారు. క్రషింగ్ ప్రారంభానికి 20 రోజుల ముందు హార్వెస్టింగ్ అడ్వాన్స్‌ల కింద ఎకరానికి రూ. 3 వేల చొప్పున ఫ్యాక్టరీ చెల్లించింది. తొలి విడత బిల్లులోనే ఈ అడ్వాన్స్‌తోపాటు ఎరువులకోసం ఇచ్చిన రుణాన్ని మినహాయించుకొంది. మిగిలిన బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. సమస్య సబ్‌కలెక్టర్ దృష్టికి.. బిల్లులు చెల్లించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రైతులు గురువారం బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. బిల్లుల చెల్లింపులో ప్రతి ఏటా గడువులు విధిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. స్పందించిన సబ్‌కలెక్టర్.. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జానకీ మనోహర్‌తో మాట్లాడారు. ఆదివారం బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈ హామీని రైతులు నమ్మడం లేదు. మూడేళ్లుగా ఫ్యాక్టరీ గడువులు విధిస్తూ ఉల్లంఘిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.