breaking news
steel flyover
-
ట్రాఫిక్ ఫ్రీ టార్గెట్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, టీవీ9 జంక్షన్ల వద్ద రూ.368 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం తెలిపింది. గతంలో ఈ జంక్షన్ల వద్ద రూ.210 కోట్ల పనులకు ఇచ్చిన అనుమతులు సవరించి, ట్రాఫిక్ అవసరాలకనుగుణంగా కొత్త ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీఓ జారీ చేశారు.హెచ్ఎండీఏ నిర్వహించిన సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం మేరకు, నగరంలో గత దశాబ్ద కాలంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతో బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి ఆల్వీన్ క్రాస్ రోడ్స్ వరకు అంతరాయం లేని ట్రాఫిక్ కారిడార్ అభివృద్ధి కోసం,సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించి సవరించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.మారిన ప్రణాళిక..సవరించిన ప్రణాళిక ప్రకారం.. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.147 కోట్లతో నిర్మించనున్నారు. టీవీ9 జంక్షన్ వద్ద ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.62 కోట్లతో, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌ను రూ.159 కోట్లతో నిర్మించనున్నారు. ఈ మూడు పనుల వ్యయం రూ.368 కోట్లకు చేరింది.గతంలో మంజూరైన ప్లాన్‌లో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ఒక ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద ఒక అండర్‌పాస్ మాత్రమే ఉండగా, తాజా ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఫ్లైఓవర్‌ను చేర్చడం, అండర్‌పాస్ దిశను మార్చడం వంటి మార్పులు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.158 కోట్ల మేర పెరిగింది. ఈ అదనపు వ్యయాన్ని భరించేందుకు హెచ్–సిటీ ప్యాకేజీ–2లో ప్రతిపాదించిన విప్రో జంక్షన్ మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు కేటాయించిన రూ.158 కోట్లను బంజారాహిల్స్ కారిడార్ పనులకు మళ్లిస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్–సిటీకి మంజూరైన రూ.5,942 కోట్ల మొత్తంనిధుల్లో పెంపుదల లేకుండా చేసింది. స్టీల్ ఫ్లైఓవర్లుపనులను సంప్రదాయ కాంక్రీట్ నిర్మాణాల బదులుగా స్ట్రక్చరల్ స్టీల్‌తో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీనివల్ల నిర్మాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కూడా పరిమితమయ్యే అవకాశం ఉంది.ఇక బంజారాహిల్స్ కారిడార్‌గా...ఇప్పటివరకు ఈ పనులను ’జూబ్లీహిల్స్’ పేరుతో పేర్కొనగా, వాస్తవ ప్రాంతానికి అనుగుణంగా ఇకపై ’బంజారాహిల్స్’గా పేర్కొనాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్లో హెచ్–సిటీ కార్యక్రమం కింద జీహెచ్ఎంసీకి కేటాయించే నిధుల నుంచే ఈ వ్యయం భరించనున్నారు. -
నిరసనలకు తలొగ్గిన సర్కారు.. ప్రాజెక్టు రద్దు
ప్రజలు గట్టిగా పోరాడితే ప్రభుత్వాలు తల వంచాల్సిందే. ఆ విషయం మరోసారి కర్ణాటకలో రుజువైంది. బెంగళూరు నగరంలో రూ. 1761 కోట్ల వ్యయ అంచనాతో నిర్మించాలని తలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 800కు పైగా చెట్లను నరికేస్తారని, దానివల్ల నగరంలో పర్యావరణానికి హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు, సామాన్య ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేయక తప్పలేదు. నగరంలో స్టీల్ ఫ్లై ఓవర్‌ను నిర్మించబోవడం లేదని బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జి ప్రకటించారు. ఈ ప్రణాళికను పూర్తిగా రద్దు చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు 6.72 కిలోమీటర్ల మేర స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించాలని బెంగళూరు అభివృద్ధి మండలి (బీడీఏ) తలపెట్టింది. దీనికి పర్యావరణవేత్తలు, ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టును 2016 అక్టోబర్ నెలలో ఎల్అండ్టీ కంపెనీకి ఇచ్చారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పోవాలంటే ఈ ఫ్లైఓవర్ తప్పనిసరిగా రావాల్సిందేనని సీఎం సిద్దరామయ్య, మంత్రి కేజే జార్జ్ ఇంతకుముందు అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల నిరసనలకు తలొగ్గి ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకున్నారు. -
మరో పోరాటానికి బెంగళూరు సిద్ధం
బెంగళూరు: నగర ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. నగరం నడి కూడలి నుంచి విమానాశ్రయానికి వేగంగా వెళ్లేందుకు నిర్మించాలనుకుంటున్న స్టీల్ ఫ్లైఓవర్‌ను అడ్డుకొని అపార వృక్ష సంపదనను రక్షించేందుకు నడుంకడుతున్నారు. వేలాది మంది ప్రజల సంతకాలను సేకరించి నగర మున్సిపల్ కార్పొరేషన్ (బహత్ బెంగళూరు మహానగర పాలిక)కు పిటిషన్ల మీద పిటిషన్లు పంపుతున్నారు. ప్రజా పిటిషన్లను పట్టించుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయానికి 6.7 కిలోమీటర్ల స్టీల్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నగర మున్సిపాలిటీ నిర్ణయించింది. 55వేల టన్నుల స్టీలు పట్టే ఈ వంతెన నిర్మాణానానికి 1,791 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీని నిర్మాణం కోసం 45 జాతులకు చెందిన 812 నుంచి 1668 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని మున్సిపాలిటీ అంచనా వేసింది. అయితే ఆజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో 71 జాతులకు చెందిన 2, 244 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని తేలింది. దీనిపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాదనలు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జయ మహల్‌లోని 112 చెట్లను కొట్టివేయాలని మున్సిపాలిటీ నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పిటిషన్ల ఉద్యమాన్ని చేపట్టారు. ప్రస్తుతం నగరం సెంటర్ నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోందని, 6.7 కిలోమీటర్ల ప్లైఓవర్‌ను నిర్మించడం వల్ల ఓ పది, పదిహేను నిమిషాలు ప్రయాణ సమయం కలిస్తొందని, దానికోసం అపార వృక్ష సంపదను కోల్పోవడం అర్థరహితమని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. ఇప్పటికే నగర ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని, కొన్ని దశాబ్దాల చెట్లను కొట్టివేయడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. చెట్ల వల్ల ప్రజలందరికి తెల్సిన ప్రయోజనాలతోపాటు కొన్ని తెలియని ప్రయోజనాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోజనాలు 1. చెట్లు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయన్న విషయం తెల్సిందే. 2. కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకోవడంతోపాటు ధూళిని, శబ్దకాలుష్యాన్ని తగ్గిస్తాయి. 3. భూ క్షారాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలను పెంచుతాయి. 4. పచ్చని చెట్ల వాతావరణంలో రోగులు త్వరగా కోలుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది. 5. పదివేల డాలర్ల వార్షికాదాయం కలిగిన చెట్లులేని ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకన్నా అంతే వయస్సులో, అంతే ఆదాయం కలిగినవారు చెట్లు ఎక్కువగా ఉన్న కాలనీలో నివసిస్తే వారి ఆరోగ్యం ఏడేళ్లు తక్కువగా ఉన్నట్లు ఉంటుందని టొరాంటోలో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. 6. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో హింసాత్మక ధోరణి బాగా తక్కువగా ఉంటుందని కాలిఫోర్నియాలో జరిపిన మరో అధ్యయనంలో తేలింది. 7. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ సమస్యలు ఉత్పన్నం కావు. 8. చెట్లున్న ప్రాంతంలో చదువుకునే పిల్లలకు ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాకుండా వారిలో జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. 9. బెంగళూరులాంటి ఓ నగరంలో చెట్ల వల్ల 30 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. 10. చెట్ల వల్ల పక్షులు, ఇతర క్రిమికీటకాదులు చేరి పర్యావరణ సమతౌల్యత సాధ్యమవుతుంది.


