breaking news
Star TV
-
కోడెల తనయుడి మరో నిర్వాకం
సాక్షి, నరసరావుపేట టౌన్: సాంకేతిక ఫైరసీకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ బండారం మరోమారు బట్టబయలైంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత కొన్నేళ్లుగా కోడెల శివరాం గౌతం కమ్యూనికేషన్ పేరిట కే చానల్ నిర్వహిస్తూ అక్రమ ఫైరసీకి పాల్పడుతున్నాడు. స్టార్ టీవీ ప్రసారాలకు సంబంధించి డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడి ప్రతి నెలా లక్షల రూపాయలు అక్రమార్జన చేస్తున్నాడు. దీనిపై స్టార్ టీవీ ప్రతినిధులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం అడ్వొకేట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సభ్యుల బృందం ఈ ఏడాది ఏప్రియల్ 18న రాజాగారి కోటలోని మాజీ స్పీకర్ కోడెల నివాస గృహంలో నిర్వహిస్తున్న కే చానల్ సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అక్కడ సాంకేతిక పరంగా ప్రసారాలు చౌర్యం చేస్తున్నట్లు గుర్తించి డీకోడర్, ఎన్‌కోడర్‌లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. న్యాయస్థానం కోడెల శివరాంకు సమన్లు జారీ చేసినా స్పందించలేదు. దీంతో కమిషన్ న్యాయవాది లక్ష్యవీర్ ముని మంగళవారం కే చానల్ కార్యాలయానికి వెళ్లి సమన్లు తీసుకోవాల్సిందిగా కోరగా సిబ్బంది నిరాకరించారు. కోర్టు ధిక్కారణ కింద న్యాయస్థానానికి నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు. శివరామ్‌పై చర్యలు తీసుకోవాలని స్టార్ ప్రతినిధులు సీఐని కోరారు. (చదవండి: కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!) -
ప్రతిష్ఠాత్మకంగా సినిమా అవార్డుల పండుగ
ప్రముఖ ఉపగ్రహ టీవీ ఛానల్ నెట్వర్క్ ‘మా’ టీవీ మరోసారి ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా తెలుగు సినిమాలోని వివిధ శాఖల వారిని అవార్డులతో సత్కరించనుంది. ఈ ‘సిని‘మా’ అవార్డ్స్ -2016’ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ వేదికగా ఆహూతుల సమక్షంలో జరగనుంది. ‘మా’ నెట్వర్క్ కొన్ని నెలల క్రితం ‘స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ (స్టార్ టీవీ)లో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ‘స్టార్ టీవీ’ యాజమాన్యం కిందకు వచ్చాక, ‘మా’ టీవీ నిర్వహిస్తున్న తొలి సినిమా అవార్డ్స్ వేడుక ఇది. దాంతో, మునుపటి కన్నా భారీగా ఈ వేడుక జరపడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా, ప్రతిభ ఒక్కటే కొలమానంగా, ఉన్నత ప్రమాణాలతో ఈ ‘సిని‘మా’ అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సినిమా అవార్డుల పండుగను ఈసారి మరింత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నాం. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రధాన హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు’’ అని ‘మా’ టీవీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. తెలుగు సినీ రంగంలోని పలువురు హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు అవార్డులు అందుకోవడంతో పాటు తమ వినూత్న ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని అలరించనుండడం ఈసారి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అయిదు గంటల పైగా సాగే ఈ భారీ వేడుకలో ఎవరూ ఊహించని రీతిలో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు, ప్రదర్శనలు ఉన్నట్లు సమాచారం. ప్రతి అవార్డుల వేడుకలో ‘స్పూఫ్’లతో వినోదం పండించే ‘మా’ టీవీ ఈసారి కూడా అందుకు తగ్గట్లే గమ్మత్తై వ్యంగ్య వినోద ప్రదర్శనలతో సిద్ధమవుతోంది. దాదాపు 170 సినిమాలు విడుదలైన 2015వ సంవత్సరంలో ఎన్ని సినిమాలు, ఎవరెవరు నటీనటులు అవార్డులు సాధించారు? ప్రత్యేక న్యాయనిర్ణేతల సంఘం ఎవరిని విజేతలుగా ఎంపిక చేస్తుందో తెలియాలంటే, జూన్ 12వ తేదీ జరిగే సందడిని చూడాల్సిందే!