ప్రతిష్ఠాత్మకంగా సినిమా అవార్డుల పండుగ | Maa Television Entertainment Awards 2016 | Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠాత్మకంగా సినిమా అవార్డుల పండుగ

Jun 6 2016 11:20 PM | Updated on Sep 4 2017 1:50 AM

ప్రతిష్ఠాత్మకంగా సినిమా అవార్డుల పండుగ

ప్రతిష్ఠాత్మకంగా సినిమా అవార్డుల పండుగ

ప్రముఖ ఉపగ్రహ టీవీ ఛానల్ నెట్‌వర్క్ ‘మా’ టీవీ మరోసారి ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది.

 ప్రముఖ ఉపగ్రహ టీవీ ఛానల్ నెట్‌వర్క్ ‘మా’ టీవీ మరోసారి ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల కార్యక్రమానికి సన్నద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం లానే ఈసారి కూడా తెలుగు సినిమాలోని వివిధ శాఖల వారిని అవార్డులతో సత్కరించనుంది. ఈ ‘సిని‘మా’ అవార్డ్స్ -2016’ కార్యక్రమం ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ వేదికగా ఆహూతుల సమక్షంలో జరగనుంది. ‘మా’ నెట్‌వర్క్ కొన్ని నెలల క్రితం ‘స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ (స్టార్ టీవీ)లో భాగమైన సంగతి తెలిసిందే.

ఇలా ‘స్టార్ టీవీ’ యాజమాన్యం కిందకు వచ్చాక, ‘మా’ టీవీ నిర్వహిస్తున్న తొలి సినిమా అవార్డ్స్ వేడుక ఇది. దాంతో, మునుపటి కన్నా భారీగా ఈ వేడుక జరపడానికి సన్నాహాలు సాగుతున్నాయి. ‘‘ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా, ప్రతిభ ఒక్కటే కొలమానంగా, ఉన్నత ప్రమాణాలతో ఈ ‘సిని‘మా’ అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సినిమా అవార్డుల పండుగను ఈసారి మరింత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నాం. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రధాన హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు’’ అని ‘మా’ టీవీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

 తెలుగు సినీ రంగంలోని పలువురు హీరోలు, హీరోయిన్లు, కమెడియన్లు అవార్డులు అందుకోవడంతో పాటు తమ వినూత్న ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని అలరించనుండడం ఈసారి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అయిదు గంటల పైగా సాగే ఈ భారీ వేడుకలో ఎవరూ ఊహించని రీతిలో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు, ప్రదర్శనలు ఉన్నట్లు సమాచారం. ప్రతి అవార్డుల వేడుకలో ‘స్పూఫ్’లతో వినోదం పండించే ‘మా’ టీవీ ఈసారి కూడా అందుకు తగ్గట్లే గమ్మత్తై వ్యంగ్య వినోద ప్రదర్శనలతో సిద్ధమవుతోంది. దాదాపు 170 సినిమాలు విడుదలైన 2015వ సంవత్సరంలో ఎన్ని సినిమాలు, ఎవరెవరు నటీనటులు అవార్డులు సాధించారు? ప్రత్యేక న్యాయనిర్ణేతల సంఘం ఎవరిని విజేతలుగా ఎంపిక చేస్తుందో తెలియాలంటే, జూన్ 12వ తేదీ జరిగే సందడిని చూడాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement