శ్రీకాకుళం కమిషనర్‌పై ఫిర్యాదు!
శ్రీకాకుళం:శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ బాపిరాజుపై జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు రాష్ట్ర అధికారులు, మున్సిపల్ మంత్రికి ఫిర్యాదు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కమిషనర్ ఎవరి ఫోన్లకు స్పందించరన్న అపవాదు ఏనాటి నుంచో ఉంది. దీంతో పాటు ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో స్వయంగా మున్సిపల్ మంత్రి ఇచ్చిన ఆదేశాలను సైతం కమిషనర్ పాటించలేదని వారు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక్కడి నుంచి బదిలీప వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమైన కమిషనర్ అప్పటి నుంచి ఎవరి మాటా వినకుండా కాలక్షేపం చేస్తున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలని కోరినట్టు తెలిసింది. ఎన్నికలు జరగనందున శ్రీకాకుళం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతోందని, అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలని ప్రజాప్రతినిధులు సూచించినా కమిషనర్ స్పందించక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ వాటి వివరాలను ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు సమర్పించినట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్ర అధికారులు, మున్సిపల్ మంత్రి కూడా ఘాటుగానే స్పందించి తక్షణం బదిలీ చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
త్వరలోనే ఎంహెచ్వో పోస్టు భర్తీ
ఇదిలా ఉండగా శ్రీకాకుళం మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయాలని ప్రజాప్రతినిధులు రాష్ట్ర అధికారులను కోరారు. త్వరలోనే ఈ పోస్టును భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారినే మళ్లీ తీసుకువచ్చేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు తరువాత కమిషనర్‌ను బదిలీ చేసి వేరొకరిని నియమించక పోయినా ఎంహెచ్వోనే ఇన్చార్జి కమిషనర్‌గా నియమింప జేసేలా కొందరు పావులు కదుపుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.