breaking news
Special wards
-
గాంధీ ఆస్పత్రిలో మనోజ్ పేరుతో వార్డు
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు ఇకపై ప్రత్యేక వార్డులో చికిత్సలు అందించనున్నట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ మనోజ్ పేరుతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. వైద్యులు, పోలీసులతో పాటు వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి, కరోనా వైరస్ వ్యాప్తి, వైద్య సేవలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. (పరిస్థితి ఆందోళనకరం: అమిత్ షాతో భేటీ) ఈ క్రమంలో వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం వైరస్ బారిన పడ్డారు. ఇలా ఇప్పటికే 16 మందికి వైరస్ సోకగా, వారిలో సకాలంలో వైద్యసేవలు అందక జర్నలిస్టు మనోజ్ మృతి చెందడం, జర్నలిస్టుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వైద్యులు, పోలీసులతో సమానంగా జర్నలిస్టులకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసింది. సచివాలయ బీట్‌ను చూసే జర్నలిస్టులకు ఇప్పటికే టెస్టులను ప్రారంభించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఈ ప్రత్యేక వార్డులో వైద్యసేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
రైల్వే ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాప్తిపై రైల్వే శాఖ అప్రమత్తమైంది. రైల్వే ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ప్రారంభించటంతో పాటు రైళ్లలో రసాయన జలాలతో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి ఆదేశాలు రావటంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతో ఐసోలేషన్ వార్డు ప్రారంభించారు. అలాగే జోన్ పరిధిలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో ఉన్న రైల్వే ఆస్పత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయబోతున్నారు. రైలు ప్రయాణాలతో జాగ్రత్త.. దేశవ్యాప్తంగా పది రోజుల కిందటి వరకు ఐదు పాజిటివ్ కేసులు మాత్రమే ఉండగా, సోమవారానికి ఆ సంఖ్య 43కు చేరుకుంది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారే ఈ వైరస్‌కు గురవుతున్నారు. వారు మన దేశానికి వచ్చేనాటికే వారి శరీరంలో ఆ వైరస్ చేరి ఉంటోంది. ఇక్కడికి వచ్చాక జ్వరం, జలుబు వచ్చి అప్పుడు ఆస్పత్రులకు వెళ్తే కోవిడ్ పాజిటివ్‌గా తేలుతోంది. ఆ లక్షణాలు పూర్తిగా బయటపడే లోపు వారు చాలాచోట్ల ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రైలు ప్రయాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన వారు రైళ్లలో ఉండే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌బోర్డు సిబ్బందితో రసాయనాల పిచికారీ.. రైళ్లలో ఆన్‌బోర్డు క్లీనింగ్ సిబ్బంది ఉంటారు. వారు రైలు ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదుల ఆధారంగా ఆ బోగీకి చేరుకుని శుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు వారి వద్ద వైరస్‌పై ప్రభావం చూపే రసాయనాలను అందుబాటులో ఉంచారు. నిర్ధారిత సమయాల ప్రకారం వారు సీట్లు, హోల్డింగ్ బార్స్, టాయిలెట్లు, తలుపులు, కిటికీల వద్ద వాటిని పిచికారీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రయాణికులు ఫిర్యాదు చేసినా వచ్చి ఆ చర్యలు చేపడుతున్నారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే వెంటనే వారిని రైల్వే ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తారు. దీనికి సంబంధించి ఆయా ఆస్పత్రుల్లోని వైద్యుల్లో కొందరిని ప్రత్యేకంగా ఆ వార్డులకు కేటాయించారు. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ఆస్పత్రుల్లో సాధారణ ప్రజలను కూడా చేర్చుకోవాలా వద్దా అన్న విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఇక అన్ని స్టేషన్లలో రసాయన జలాల పిచికారీ చేపట్టారు. ముఖ్యంగా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుధ్య చర్యలను కూడా పెంచారు. -
ఎంత క్షేమం?
ఏపీ, తెలంగాణలను వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ జిల్లాలో ఒక్క నిర్ధారణ కిట్టుంటే ఒట్టు {పభుత్వం నుంచి అందని వ్యాక్సిన్లు ఐసోలేటెడ్ వార్డు ఏర్పాటు ఏదీ? ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి కొందరు చనిపోగా వందలాదిమంది ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉన్నారు. దీంతో జిల్లా వాసుల్ని సైతం ఈ పరిణామాలు అప్రమత్తం చేస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం స్వైన్‌ఫ్లూను ఎదుర్కోవడానికి ఎలాంటి మందులు, ప్రత్యేక వార్డులు, కనీసం రోగ నిర్ధారణ పరికరాలు కూడా అందుబాటులోవు. తిరుమల/ చిత్తూరు(అర్బన్): రెండేళ్ల కిందట ప్రపంచాన్నే వణికించిన వ్యాధి స్వైన్‌ఫ్లూ. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ముఖానికి మాస్కులు వేసుకుని వెళ్లడం, చేతి రుమాలులో యూకలిప్టస్ తైలం వేసుకోవడం లాంటివిచేశారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే స్వైన్‌ఫ్లూ వస్తుందనే ప్రచారం ఉన్నా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ చ్చేవారిలో ఎవరికైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉంటే ఇతరులకు ఇది సుల భంగా వ్యాపిస్తుంది. పుణ్యక్షేత్రాల్లో టెన్షన్ జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో స్వైన్‌ఫ్లూ టెన్షన్ పట్టుకుంది. దేశవ్యాప్తంగా వేలాదిగా భక్తులు సందర్శించే తిరుమలతోపాటు శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాల్లో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 80 వేల పైబడి వచ్చే తిరుమలలో స్వైన్ ఫ్లూ విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో నాలుగోవంతు సంఖ్యలో భక్తులు వచ్చే శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభలే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు అలాంటి కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ ముందస్తు చర్యలు అవసరమని వారు హెచ్చరిస్తున్నారు. టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టేనా? ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా స్వైన్‌ఫ్లూ వ్యాధి మరో నెలన్నర రోజులపాటు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే క్షణాల్లోనే మరికొందరికి సోకే అవకాశం ఉంది. 2009లో ఏర్పడిన పరిస్థితులతో తిరుమలలోని అశ్విశి ఆస్పత్రిలో ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ వార్డు ఏర్పాటు చేశారు. ఎన్ 95 మాస్క్‌లు, అధునాతన మందులు సిద్ధం చేశారు. తాజా పరిస్థితులతో మరోసారి టీటీడీ అలాంటి ఏర్పాట్లే చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆమేరకు టీటీడీ వైద్య విభాగం కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాధి నిర్ధారణ ఎలా.. జిల్లాలో చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల, తిరుపతిలోని ఎస్వీ రుయా ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స అందచేయడానికి అన్ని సౌకర్యాలున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి కనీసం వ్యాధి సోకిందా, లేదా అని చెప్పడానికి నిర్ధారణ కిట్లు కూడా లేవు. వ్యాధిసోకిన వాళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్లు సైతం జిల్లాలో అందుబాటులో లేదు. ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే పక్క జిల్లాలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఆశ్రయించడం తప్ప ప్రజలకు మరోమార్గం లేదు. పేద ప్రజలు సర్కారు వైద్యశాలల్లో సేవలు అందక, ప్రైవేటు వైద్యం కొనలేక ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వ్యాధి సోకిన వాళ్లను ఐసోలేటెడ్ వార్డులో (పూర్తిగా సమశీతోష్ణ స్థితి ఉన్న గది) ఉంచాలి. స్వైన్‌ఫ్లూ వార్డును మిగిలిన వార్డులకు కాస్త దూరంగా ఉంచడంతో పాటు ఆరు పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఉంచాలి. ఇవేమి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపించడం లేదు. చిత్తూరులోని జిల్లా ప్రధాన వైద్యశాలలో జనరేటర్ వేసే ఓ వార్డుకు స్వైన్‌ఫ్లూ వార్డు అని పేపర్ అతికించి అధికారులు చేతులు దులుపుకున్నారు. వ్యాధి లక్షణాలు.. దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, విరేచనాలు, గొంతునొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. వ్యాప్తి ఇలా.. స్వైన్‌ప్లూ అనే వ్యాధి ఇన్ ప్లూయాంజా ఏ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపించి, ఊపిరితిత్తుల అంతర్భాగానికి సోకడం ద్వారా ప్రమాకరంగా మారి మృత్యువాత పడే అవకాశముంది. పక్షుల ఫారాలు, పందులకు దగ్గరగా పనిచేసే వారికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. నివారణ.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడేటప్పుడు నోటికి అడ్డుగా పెట్టుకోవడం, తరుచుగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండటం, పక్షుల ఫారాలు, పందులకు దగ్గరగా నివాసముండే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.