breaking news
SP complaint
-
త్రీటౌన్ పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు
అనంతపురం సెంట్రల్ : కుటుంబ వివాదంలో తన కుమారుడికి అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారంటూ అనంతపురం త్రీటౌన్ పోలీసులపై గుత్తికి చెందిన మాజీ సైనికుడు మస్తాన్‌వలి బుధవారం ఎస్పీ ఎస్.వి.రాజÔó ఖరబాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడు రహీమ్‌కు అనంతపురంలోని బళ్లారి బైపాస్‌వద్ద నివాసముంటున్న అహ్మదుల్లా కుమార్తెతో 2013లో వివాహమైందని తెలిపారు. తాము ఎటువంటి కట్నకానుకలూ స్వీకరించలేదని పేర్కొన్నారు. మనస్పర్థలతో కోడలు మూడు నెలలకే పుట్టింటికి వెళ్లిపోయిందని, ఇప్పుడు విడాకుల కోసం తన కుమారుడిపై ఒత్తిడి తెస్తున్నారని, రూ.25లక్షలు అడుగుతున్నారని వివరించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని, కోర్టు సూచనల మేరకు గతేడాది జూన్ నుంచి నెలకు రూ. 5వేలు చొప్పున కోడలికి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టులో వ్యవహారం నడుస్తున్నా త్రీటౌన్ పోలీసులు తన కుమారుడికి అన్యాయం జరిగేలా పంచాయితీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్‌ను వివరణ కోరగా.. తనను భర్త వేధిస్తున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు పంపుతున్నామన్నారు. ఇందులో ఎటువంటి వేధింపులూ లేవని స్పష్టం చేశారు. -
రక్షకుడే.. భక్షకుడై
- ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నిర్వాకం - కేసులో అనుమానితుడి నుంచి బలవంతంగా లక్షల రూపాయల వసూలు - తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు - కాళ్ల బేరానికి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్ - రాజీకి ఒప్పుకోని బాధితుడు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆ ఎస్ఐకు జీతం కంటే గీతంపైనే దృష్టి. అమాయకులను టార్గెట్ చేసి విచారణ పేరుతో ప్రైవేట్‌గా నిర్భందిస్తాడు. కేసుల్లో ఇరికిస్తానని భయపెట్టి రూ.లక్షలు గుంజేస్తాడు. కరుడు గట్టిన దొంగను మరిపిస్తున్నాడు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, అన్యాయం చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని నిర్బంధించి తనదైన శైలిలో చుక్కలు చూపించాడు. తట్టుకోలేక డిమాండ్ చేసిన రూ.5 లక్షలు ఆ వ్యక్తి ఎస్ఐకు ముట్టజెప్పాడు. అనంతరం బాధితుడు ఆ శాఖ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతో కథ అడ్డం తిరిగింది. సదరు ఎస్ఐ బాధితుడి వద్దకు వెళ్లి కాళ్ల బేరానికి దిగాడు. రాజీకి రాకపోవడంతో ఆ ఎస్ఐ చుక్కలు చూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని తిరుపతి ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఓ బ్లూకోల్ట్ కానిస్టేబుల్‌తో కలసి ఓ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నాడు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఓ ప్రైవేటు గదిలో మూడు రోజులపాటు బంధించాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తామని భయపెట్టాడు. భయపడి ఆ వ్యక్తి డబ్బు సమకూర్చి బయటపడ్డాడు. బాధితుడి బంగారు ఉంగరాన్ని కానిస్టేబుల్ తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ కుదవ అంగడిలో ఉంగరాన్ని పెట్టి నగదు తీసుకున్నట్లు సమాచారం. అనంతరం బాధితుడు అర్బన్ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై నిఘా వర్గాలతో ఎస్పీ విచారించగా సదరు ఎస్‌ఐదే తప్పని తేలడంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్ఐని పిలిపించారు. రాజీ కుదుర్చుకో.. లేదంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బెంబేలెత్తిన ఎస్ఐ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలసి డబ్బు తీసుకుని బాధితుని వద్దకు వెళ్లి రాజీ కావాలంటూ కాళ్లవేళ్ల పడ్డారు. వారు పెట్టిన బాధలు విడమరిచి చెబుతూ తనను అన్యాయంగా హింసించారని, రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆ ఎస్ఐ ఇప్పటికే రెండుమార్లు సంప్రదింపులు జరిపారు. అయినా బాధితుడు రాజీకి రాకపోవడంతో ఏమిచేయాలో తెలియక సదరు ఎస్ఐ కాలుకాలిన పిల్లిలా అధికారుల చుట్టూ తనను కాపాడండి అంటూ ప్రదక్షణలు చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు అందింది వాస్తవమే హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది వాస్తవమే. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించా. మాకు అందిన ఫిర్యాదులో బాధితుని నుంచి ఎస్ఐ డబ్బు తీసుకున్నట్లు లేదు. తప్పు చేస్తే ఎంతటివారినైనా క్షమించేది లేదు. చర్యలు తప్పకుండా తీసుకుంటాం. - గోపీనాథ్‌జెట్టి, అర్బన్ జిల్లా ఎస్పీ