పిస్టోరియస్ చేసింది హత్యే..
గత తీర్పును మార్చిన సుప్రీం కోర్టు
15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం
బ్లూమ్‌ఫోంటేన్: దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసినట్టుగా ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చింది. అనాలోచిత చర్యగా భావించి గతంలో అతడికి స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. బాత్రూమ్లో తలుపు వెనకాల స్టీన్కాంప్ కానీ ఆగంతకుడు కానీ ఎవరున్నా తుపాకీతో కాల్చితే కచ్చితంగా మరణిస్తారని పిస్టోరియస్కు తెలుసని జడ్జి అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన తీర్పు దోషపూరితంగా ఉందని, అతడికి కఠిన శిక్ష వేయాల్సిందేనని స్పష్టం చేస్తూ కేసును ట్రయల్ కోర్టుకు తిప్పి పంపింది.
దీంతో ఈ అథ్లెట్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 2013 ఫిబ్రవరి 14న పొరపాటుగా బాత్రూమ్లో ఆ గంతకుడు దూరాడనుకుని కాలిస్తే తన ప్రియురాలు మరణించిందని అప్పట్లో ఆస్కార్ కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది శిక్షా కాలం పూర్తి చేసుకున్న తను అక్టోబర్‌లో పెరోల్‌పై విడుదలై గృహ నిర్భందంలో ఉండేందుకు కోర్టు అనుమతించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆస్కార్‌కు కఠిన శిక్ష పడలేదని గట్టిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసు ను సుప్రీం కోర్టు తిరిగి విచారించింది. తాజా తీర్పు తో స్టీవ్కాంప్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.