breaking news
Sonde Veeraiah
-
టీఆర్ఎస్ ప్రభుత్వంపై వందరోజుల దండయాత్ర
భద్రాచలం : జిల్లాల ఆవిర్భావం రోజైన మంగళవారం ఆదివాసీలకు బ్లాక్ డే అని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య అన్నారు. ఆదివాసీ ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన పాదయాత్ర మంగళవారం భద్రాచలం చేరుకుంది. అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల ప్రాంతాలను ముక్కలు చేసిందన్నారు. 5వ షెడ్యూల్ పరిధిలో గల ప్రాంతాలపై గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయని, కానీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందన్నారు. ఆదివాసీలను విచ్ఛిన్నంచేసే టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రకు నిరసనగా ఆదివాసీలంతా ’వంద రోజుల పాటు దండయాత్ర’ చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ వరకూ ఉన్న ఆదివాసీ ప్రాంతాలను కలుపుకొని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, వట్టం నారాయణ, రమణాల లక్ష్మయ్య, కల్పన, దాసరిశేఖర్, ముద్దా పిచ్చయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 2న పోలవరం వ్యతిరేక సభ
భద్రాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగే జూన్ 2వ తేదీన వీఆర్ పురంలో పోలవరం వ్యతిరేక సభ నిర్వహించనున్నట్టు గిరిజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సొందె వీరయ్య తెలిపారు. ఆయన శనివారం ఇక్కడ పరిషత్ సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివాసీలను జల సమాధి చేసే పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రజానీకమంతా సిద్ధం కావాలన్నారు. జాతీయ స్థాయిలో ఇందుకు మద్దతు కూడగట్టేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు. ఇందులో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో నాయకులు పాయం సత్యనారాయణ, ముర్రం వీరభద్రం, సోడె చలపతి, పూనెం సాయి, కన్నారావు, లీలాప్రసాద్, నాగరాజు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలి
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని తెలంగాణ నుంచి విడదీయవద్దని కోరుతూ గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఎల్ఐసీ రోడ్, తాత గుడి సెంటర్, యూబీ రోడ్ మీదుగా సబ్ కలెక్టరేట్ వరకు బుధవారం ర్యాలీ సాగింది. అక్కడ ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భద్రాచలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలిపే కుట్రను ఈ ప్రాంత ప్రజానీకమంతా తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ ప్రాంతంతోనే ఇక్కడి ప్రజలకు సంబంధాలు ఉన్నాయని, ఆదివాసీ విద్యార్థులకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కలిపారని అన్నారు. మళ్లీ దీనిని ఆంధ్రాలో కలిపితే ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. ‘భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో కలపాలనుకుంటే... తూర్పు గోదావరి జిల్లాలో భాగం చేయాలి. ఆ జిల్లా కేంద్రమైన కాకినాడ.. ఇక్కడికి (భద్రాచలానికి) 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలోగల జిల్లా కేంద్రానికి ఇక్కడి ప్రజలు ఎలా వెళతారు..? తప్పనిసరై వెళ్లి రావాలంటే రోజులు పడుతుంది’ అని చెప్పారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచేలా ఇక్కడి ఆదివాసీలంతా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. సీమాంధ్ర పాలకులు స్వార్థ బుద్ధితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి గిరిజన గ్రామాలను ముంచే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణవాదులంతా ఏకమై భద్రాచలాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. టీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు మాట్లాడుతూ.. భద్రాచలం పరిరక్షణకు ఆదివాసీలు చేస్తున్న పోరాటాలకు టీజేఏసీ పక్షాన పూర్తి మద్దతు ఉంటుం దని ప్రకటించారు. ఈ పోరాటాలలో తాము కూడా పాల్గొంటామన్నారు. అనంతరం, సబ్ కలెక్టరేట్ ఏఓ మంగీలాల్‌కు పరిషత్ నాయకులు వినతిపత్రమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తిప్పన సిద్దులు, న్యూడెమోక్రసీ నాయకుడు కెచ్చెల రంగారెడ్డి, న్యాయవాదుల జేఏసీ నాయకుడు తిరుమలరావు, టీఎన్జీఓ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, నాయకుడు ఎక్కిరాల శ్రీనివాస్‌రావు, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.