ఆ నిందితుడు ఇప్పుడు కూలివాడిగా!
ముంబయి: అరుణ షాన్ బాగ్ పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు ఓ స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం ఓ కూలివాడిగా పనిచేస్తున్న అతడిని సదరు మీడియా ప్రశ్నించగా అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పలేకపోయాడని కూడా తెలిపింది. 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అరుణ షాన్ బాగ్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తుండగా అత్యాచారానికి గురైంది. విధి నిర్వహణలో ఉన్న ఆమెపై ఆస్పత్రి వార్డ్బాయ్ సోహన్ లాల్ వాల్మీకి అతి దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి, తీవ్రంగా గాయపరిచాడు. దాంతో షాక్ తిన్న అరుణా షాన్ బాగ్ కోమాలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉంది.
ఆస్పత్రిలో మందులను దొడ్డిదారిన అమ్ముకుంటున్న సోహన్ లాల్‌ను అరుణ ప్రశ్నించటంతో పాటు అధికారుల దృష్టికి తీసుకు వెళతానని హెచ్చిరించడంతో ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఆమె మెదడు పని చేయక పోవటంతో కోమాలోకి జారుకుంది. ఈ ఘటన అనంతరం ఆమె పూర్తి నిస్సత్తురాలై జీవచ్ఛవంలా మారి దాదాపు 40 ఏళ్లపాటు మంచానికే పరిమితమై ఇటీవల కన్నుమూసింది. దీంతో ఆమెపై దాడికి పాల్పడిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడా అని ఓ మరాఠా మీడియా తనిఖీలు చేయగా అతడు ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయంపై పోలీసులను ఆరా తీయగా నిజంగా అతడు ఉండివుంటే లీగల్ ఒపినీయన్ తెలుసుకుని అనంతరం తదుపరిచర్యలు తీసుకుంటామని చెప్పారు.