breaking news
siddeswaram
-
అందరి కల..నిర్లక్ష్యమేల!
కోవెలకుంట్ల: బ్రిటీష్ కాలం నుంచి ప్రతిపాదనలో ఉన్న సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి నోచుకోవడం లేదు. దీనిపై సర్కారు నిర్లక్ష్యం చూపుతుండడంతో రాయలసీమ రైతులు అన్యాయానికి గురవుతున్నారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రజలందరి కల. అయినా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో సీమ రైతులంతా ఏకతాటిపైకొచ్చి అలుగు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి రెండేళ్లు కావస్తున్నా అలుగు నిర్మాణం దిశగా రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీమ రైతులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 31న సిద్ధేశ్వరం అలుగు ప్రతిపాదిత ప్రాంతానికివాహన ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలుగు నేపథ్యం.. బ్రిటీష్‌కాలంలో సీమ ప్రజల తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం సిద్ధేశ్వరం ప్రాజెక్టును ప్రతిపాదించారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఈ ప్రతిపాదన మరుగున పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణా– పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించి..నిధులు సైతం కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కోస్తా ప్రజలకు అన్యాయం జరుగుతుందంటూ అప్పట్లో దీన్ని రద్దు చేయించారు. తదనంతర కాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినా రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాంతానికి నీరందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సిద్ధేశ్వరం అలుగు అనివార్యమైంది. 50–60 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం శ్రీశైలం రిజర్వాయర్ వెనుకవైపు కృష్ణానదిపై సిద్ధేశ్వరం ప్రాంతంలో అలుగు ఏర్పాటు చేస్తే 50–60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ ఏర్పాటుతో కనుమరుగైన అలుగు అంశాన్ని హంద్రీ–నీవా రిటైర్డ్ డీఈ సుబ్బరాయుడు నేతృత్వంలో 2004లో మళ్లీ తెరపైకి తెచ్చారు. సిద్ధేశ్వరం అలుగు ప్రాముఖ్యత, నీటి నిల్వ, నిర్మాణానికయ్యేఖర్చు తదితర వివరాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వైఎస్సార్... డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) అందజేయాలని తెలుగుగంగ అధికారులను ఆదేశించారు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా అలుగు నిర్మాణానికి నోచుకోలేదు. కృష్ణానది సిద్ధేశ్వరం ప్రాంతంలో రెండు కొండల మధ్య 550–600 అడుగుల వెడల్పుతో ప్రవహిస్తుంది. ఈ ప్రదేశంలో అలుగు ఏర్పాటు చేస్తే 50–60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అస్కారం ఉందని సాగునీటి రంగ నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే 2016 మే 31న రైతులు స్వచ్ఛందంగా తరలివెళ్లి సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లు కావస్తున్నా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం వీడకపోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పట్టిసీమపై శ్రద్ధ చూపిన సర్కార్ సిద్ధేశ్వరాన్ని మాత్రం పట్టించుకోలేదని రైతులు విమర్శిస్తున్నారు. సిద్ధేశ్వరం సాధనే లక్ష్యంగా రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నేతృత్వంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అలుగు ప్రతిపాదిత ప్రాంతానికి సుమారు ఐదు వేల వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధేశ్వరం సీమ ప్రజల అవసరం శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమకు నీరందని పరిస్థితుల్లో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అత్యవసరం. రూ.వెయ్యి కోట్ల నిధులతోనే ఇది పూర్తవుతుంది. 50–60 టీఎంసీల నీరు నిల్వ ఉండి సీమ ప్రజల అవసరాలు తీరతాయి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ నెల 31న తలపెట్టిన వాహన ర్యాలీలో సీమలోని అన్ని జిల్లాల రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి. – కామని వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీకో ఆర్డినేటర్, కోవెలకుంట్ల అలుగు ఏర్పాటుతో సీమ సస్యశ్యామలం కృష్ణానదిపై సిద్ధేశ్వరం ప్రాంతంలో అలుగు ఏర్పాటు చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. ప్రస్తుతం సీమలోని వివిధ ప్రాజెక్టులకు నీటి కోసం శ్రీశైలం రిజర్వాయర్‌పై నే ఆధారపడాల్సి వస్తోంది. అయితే.. వర్షాభావ పరిస్థితులతో ప్రతి ఏటా ఫిబ్రవరి నాటి కే జలాశయంలో నీటిమట్టం తగ్గిపోతోంది. పైగా 790 అడుగులకు నీటిమట్టం చేరేవరకూ దిగువ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశై లం జలాశయంలో సిల్ట్ పేరుకుపోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఈ పరిస్థితు ల్లో సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే 50 నుంచి 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. అలా గే శ్రీశైలం జలాశయంలోకి సిల్ట్ చేరకుండా అరికట్టవచ్చు. వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు సీమలోని ప్రాజెక్టులకు సిద్ధేశ్వరం నుంచి నీరందించే అవకాశం ఉంటుంది. – సుబ్బరాయుడు, రిటైర్డ్ ఇంజినీర్ -
సిద్దేశ్వరం అలుగు సాధన పోరుకు ఏడాది
– ప్రభుత్వాన్ని ఆలోచనలో పడవేసిన రైతు ఉద్యమం – ప్రజాగ్రహానికి జడిసే ఈ యేడాది శ్రీశైలంలో నీటి నిల్వ – చట్టబద్ద హక్కు కోసం రైతుల పోరాటం కొనసాగుతోంది ఆత్మకూరు రూరల్: సిద్దేశ్వరం అలుగు పోరాటానికి సరిగ్గా నేటితో యేడాది పూర్తైంది. సిద్దేశ్వరం అలుగు సాధన సమితి ఆధ్వర్యంలో గత యేడాది మే 31న రాయల సీమ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా కదలి వచ్చి సంగమేశ్వరం వద్ద సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రజా శంఖుస్థాపన చేశారు. ఈ ఉద్యమం జరగకుండా నివారించేందుకు పోలీసులు రైతు నాయకులను గృహనిర్భంధం చేశారు. కొన్ని చోట్ల రోడ్లను ప్రొక్లైనర్లతో తవ్వి గోతులు తీసి రైతుల వాహనాలను అడ్డుకున్నారు. అయినప్పటికి రైతులు ఏమాత్రం వెనుకంజ వేయకుండా తమ సంకల్పం నెరవేర్చుకుని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వగలిగారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రాయలసీమ రైతు ఆవేదనను అర్థం చేసుకుని సీమకు చెందాల్సిన సాగునీటికి చట్టబద్ధ హక్కు కల్పించి సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని రైతు లోకం కోరుకుంటోంది.