breaking news
Sheikh Mahmood
-
నాద స్వరానికి ‘పద్మశ్రీ’ పరవశం
చిలకలూరిపేట: నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చిన ఘనత గుంటూరు జిల్లా చిలకలూరిపేట నాదస్వర విద్వాంసులకే దక్కుతుంది. దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు. వారి సుమధుర నాదం ఎన్నో దేవాలయాల్లో సుప్రభాత సేవలకు ఆధ్యాత్మిక శోభ సంతరింపజేస్తుంది. ప్రస్తుతం ఎనిమిదో తరానికి చెందిన నాదస్వర విద్వాంసులైన షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ దంపతులకు నాదస్వరమే సర్వస్వం. ఎనిమిది తరాలుగా.. ఏడో తరానికి చెందిన నాదబ్రహ్మ, నాదస్వర గానకళా ప్రపూర్ణ బిరుదాంకితులు షేక్ చినపీరు సాహెబ్ చిలకలూరిపేటలో నివసించిన ప్రాంతానికి చినపీరుసాహెబ్ వీధిగానే నామకరణం చేశారు. నాదస్వర విద్వాంసుడిగా పేరొందిన షేక్ చినపీరు సాహెబ్‌కు ముందు 1825 నుంచి వారి వంశీకులు షేక్ నబీసాహెబ్, షేక్ చిన నసర్దీ, పెద నసర్దీ సోదరులు, షేక్ పెద హుస్సేన్, చిన హుస్సేన్, దాదాసాహెబ్, గాలిబ్‌సాహెబ్ సోదరులు నాదస్వర విద్వాంసులుగా రాణించారు. చినపీరు సాహెబ్ వద్ద శిష్యరికం చేసిన షేక్ ఆదంసాహెబ్ సంగీత విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీగా వ్యవహరించగా, మరో శిష్యుడు కరువది షేక్ చినమౌలాసాహెబ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఎనిమిదో తరానికి చెందిన షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ దంపతులు వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. షేక్ చినపీరుసాహెబ్ మనవడే (కూతురి కుమారుడు) షేక్ మహబూబ్ సుభాని. ఆయన భార్య షేక్ కాలేషాబీ కూడా చినపీరుసాహెబ్‌కు వరుసకు మనవరాలే. సుభాని దంపతుల కుమారుడు షేక్ ఫిరోజ్‌బాబు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంసీఏ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా దాన్ని వదలివేసి నాదస్వర కచేరీల్లో తల్లిదండ్రులతో పాటు పాల్గొంటున్నాడు. బాల్యం నుంచి.. ఏడేళ్ల వయసులోనే సుభాని ఆయన తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. షేక్ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్ జాన్‌సాహెబ్ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వీరి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.చంద్రమౌళి వద్ద కొంతకాలం నాదస్వరం అభ్యసించారు. అనంతరం గానకళాప్రపూర్ణ, పద్మశ్రీ డాక్టర్ షేక్ చినమౌలానా సాహెబ్ వద్ద తంజావూర్ బాణిలో పదేళ్ల పాటు శిక్షణ పొందారు. దేశ విదేశాల్లో కచేరీలు.. సుభాని దంపతులు భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో వేలాది కచేరీలు ఇచ్చారు. 2005 మార్చి 5న రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు 2 గంటల పాటు కచేరీ చేశారు. అబుదాబి, బ్రెజిల్, కెనడా, దుబాయి, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేసియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో వీరు ప్రదర్శనలిచ్చారు. తిరుమలలో కూడా నాదస్వరం వినిపించారు. 2001 మార్చి 24 నుంచి శృంగేరి శ్రీశారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. 1994లో తమిళనాడు ప్రభుత్వం వీరికి కలైమామణి అవార్డును ప్రకటించింది. వీరికి 2000లో చెన్నై బాలాజీ టెలివిజన్ సంస్థ దేశ థమారై అవార్డు, 2002లో నాదస్వర కళానిధి అవార్డు, 2004లో అమెరికాలోని సౌత్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ కాలిఫోర్నియా అవార్డు, 2005లో డాక్టర్ తిరువెంగడు సుబ్రమణ్యపిళ్లై శతాబ్ది అవార్డు, 2008లో నాదస్వర చక్రవర్తి అవార్డు లభించాయి. 2009లో ఇంటిగ్రిటీ కల్చరల్ అకాడమీ (చెన్నై) అవార్డు లభించింది. 2009లో కెనడియన్ ఫైన్ ఆర్ట్స్ అవార్డు, 2015లో సంగీత మాసపత్రిక (చెన్నై) నాదబ్రహ్మం అవార్డును వీరు అందుకున్నారు. శ్రీలంకలో 2016లో నాదస్వర గానకళా వారధి అవార్డు, 2017లో ఏపీ ప్రభుత్వం హంసకళా రత్న అవార్డును అందజేసింది. 2010 అక్టోబర్ నుంచి ఆలిండియా రేడియోలో వీరు టాప్‌గ్రేడ్ నాదస్వర విద్వాంసుల ద్వయంగా కొనసాగుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది... పద్మశ్రీ పురస్కారం అందుకొనేందుకు ఈ నెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు హాజరుకావాలని లేఖ అందుకోవటం ఎంతో సంతోషం కలిగించింది. నాదస్వర విద్య కనీసం పాతికేళ్లు శ్రమపడితే కాని పట్టుబడదు. నిత్య సాధనతో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇన్నాళ్ల శ్రమకు తగిన ప్రతిఫలం పద్మశ్రీ పురస్కారంతో లభించినట్లయింది. గతంలో మా పూర్వీకుడైన కరువది షేక్ చినమౌలాసాహెబ్ పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన పక్కన స్థానం దక్కడం గర్వకారణంగా భావిస్తున్నాం. – షేక్ మహబూబ్ సుభాని, షేక్ కాలేషాబీ చిలకలూరిపేటలో నాదస్వరం ఆలపిస్తున్న సుభాని దంపతులతో కుమారుడు ఫిరోజ్‌బాబు (ఫైల్) -
పదేళ్లకు వీడిన హత్య మిస్టరీ
=చోరీ కేసులో నిందితుల విచారణలో వెలుగులోకి.. =నలుగురి అరెస్టు పహాడీషరీఫ్, న్యూస్‌లైన్: చోరీ కేసులో దొంగలను విచారిస్తుండగా సుమారు పదేళ్ల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడిన నిందితుల్లో నలుగురిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమాకు చెందిన షేక్ మహమూద్(40), మహ్మద్ ఖాజా (40), మహ్మద్ ఇక్బాల్(36), మహ్మద్ ఖలీల్(45) బండ్లగూడలోని ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరితో పాటు భార్య హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న గౌస్ (40), ఫలక్‌నుమాకే చెందిన హఫీజ్, అతని సోదరుడు కలిసి 2004లో కొన్ని చోరీ చేశారు. ఈ క్రమంలోనే జల్పల్లి గేట్ సమీపంలోని అన్వర్ పాలిస్టర్ ఇండస్ట్రీస్‌లో 2004లో ఫిబ్రవరిలో వీరు ఇనుప వస్తువులు చోరీలు చేశారు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ చోరీ చేసేందుకు అదే ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ మొదటి అంతస్తులో ఒక వ్యక్తి (28) కనిపించడంతో తమ చోరీ విషయం బయటపెడతాడని భయపడి అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం మొదటి అంతస్తు నుంచి కిందకు పడేశారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఏడుగురూ కలిసి రుమాలుతో గొంతు నులిమి చంపేశారు. 2004 ఫిబ్రవరి 27న ఆ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో మృతుడు.. ఆ పాలిస్టర్ కంపెనీలో ఉద్యోగి కాదని తేలింది. దీంతో అతను చోరీకి రాగా ఎవరో హత్య చేసి ఉంటారని భావించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడం ఈ కేసు మూలన పడింది. కాగా, అప్పట్లో నిందితులు చోరీ చేసిన అన్వర్ పాలిస్టర్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎంహెచ్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌గా మారింది. డొంక కదిలిందిలా.....! షేక్ మహమూద్, మహ్మద్ ఖాజాలపై ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లలో వివిధ నేరాలపై కేసులు ఉన్నాయి. కాగా, ఇటీవల పాతబస్తీలో జరిగిన చోరీల్లో నిందితులను గుర్తించేందుకై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్ రావు నేతృతంలోని బృందం పాతదొంగలను విచారించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే షేక్ మహమూద్, మహ్మద్ ఖాజాలను విచారించారు. ఈ సమయంలోనే 2004లో పాలిస్టర్ కంపెనీలో ఓ వ్యక్తిని హత్య చేసినట్టు బయటపెట్టారు. దీంతో పోలీసులు జైలులో ఉన్న గౌస్‌ను విచారించినా అదే విషయాన్ని వెల్లడించారు. నిందితులు చెప్పిన వివరాలు, హత్య జరిగినప్పటి వివరాలను పోలీసులు పరిశీలించగా వాస్తవమేనని తేలింది. దీంతో పోలీసులు షేక్ మహమూద్, మహ్మద్ ఖాజా, మహ్మద్ ఇక్బాల్, మహ్మద్ ఖలీల్‌ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి జైలులో ఉండగా...మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ జియాకు రివార్డ్‌ను అందజేస్తామని టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్‌రావు తెలిపారు. నేరాలు చేసే వారికి ఇదో గుణపాఠం: ఇన్స్పెక్టర్ తప్పు చేసి తప్పించుకొని తిరగవచ్చని భావించే వారికి ఈ ఘటన గుణపాఠంలాంటిదని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 2004లో హత్య చేసి ఇన్నాళ్ల పాటు నిందితులంతా తప్పించుకొని తిరిగారన్నారు.