breaking news
Shailja ramayyar
-
ఇదెక్కడి నియామకం..?
♦ ఉత్తర్వులు లేకుండానే ఇన్చార్జి వీసీగా శైలజా రామయ్యర్ బాధ్యత స్వీకరణ ♦ జేఎన్ఏఎఫ్ఏయూలో మరోసారి గందరగోళం సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ)లో మరో వివా దానికి తెరలేచింది. ప్రస్తుత ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పద్మావతి స్థానంలో ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ ఇన్చార్జి వీసీ హోదాలో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంలో ఇన్చార్జి వీసీ పద్మావతి, స్పెషల్ సీఎస్ రాజీవ్ ఆర్.ఆచార్యకు మధ్య లేఖల యుద్ధం కొనసాగింది. పదవీకాలం ముగిసిన కవితా దర్యానీనే రిజిస్ట్రార్‌గా కొనగించాలని వీసీకి 2 సార్లు లేఖ రాయగా, మానిటరింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీనివాస్‌రెడ్డిని కొత్త ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగించాలని వీసీ పట్టుబట్టారు. ఈ ఘటనే తాజా పరిణామాలకు కారణమై ఉండవచ్చని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర్వులు లేకుండానే.. సాధారణంగా ఏదైనా విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వీసీ, ఇన్చార్జి వీసీలను నియమించేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ ఆమోదంతోనే ఆయా ఉత్తర్వులు వెలువడతాయి. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా జేఎన్ఏఎఫ్ఏయూలో ఇన్చార్జి వీసీ నియామకం జరగడం వివాదానికి దారి తీసింది. శుక్రవారం ఉదయం సిబ్బందికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే శైలజా రామయ్యర్ నేరుగా వచ్చి వీసీ సీటులో కూర్చున్నట్టు తెలిసింది. వీసీ నియామకానికి సంబంధించి విద్యా శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన లేఖనే ఉత్తర్వులుగా ఆమె పేర్కొన్నట్లు వర్సిటీ సిబ్బంది చెపుతున్నారు. అయితే స్పెషల్ సీఎస్ ఉత్తర్వులకు సంబంధించిన కాపీని ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టడం, వర్సిటీకి ప్రత్యేకంగా ప్రతిని పంపకపోవడం గమనార్హం. ప్రభుత్వం వర్సిటికీ రెగ్యులర్ వీసీని నియమించేంత వరకు ప్రస్తుతం ఇన్చార్జి వీసీగా ఉన్న పద్మావతినే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా, స్పెషల్ సీఎస్ కేవలం లేఖ ద్వారా ఆమెను తొలగించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని వర్సిటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. -
పరీక్షలు సొంతంగానే..
తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంకాంట్రాక్టు పద్ధతిన లీగల్ కన్సల్టెంట్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామకం అవసరమైన సిబ్బందిని ఉమ్మడి బోర్డు నుంచి తీసుకోవాలని ఆదేశం బోర్డు కార్యదర్శిగా శైలజా రామయ్యార్ ఏపీ ముందుకు రానందునే బోర్డు ఏర్పాటు విద్యార్థులు గందరగోళంలో పడకూడదనే ఈ నిర్ణయం: మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా సొంతంగా నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ వద్ద బుధవారం జరిగిన సమావేశం అనంతరం.. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలన్నింటినీ ఏకకాలంలో చేపట్టింది. బోర్డులో అవసరమైన అధికారులను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. పరీక్షలకు అవసరమైన సిబ్బందిని ఉమ్మడి బోర్డు నుంచి తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ వరుసగా నాలుగు ఉత్తర్వులను (జీవోలు 25, 26, 27, 28) గురువారం రాత్రి జారీ చేసింది. ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను (ఎఫ్ఏసీ) హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ శైలజారామయ్యార్‌కు అప్పగిస్తూ ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ మరో ఉత్తర్వు (జీవో నం. 1253) జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. ఇదీ బోర్డు స్వరూపం.. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఏర్పాటు ఉత్తర్వులు వెంటనే (4వ తేదీ నుంచే) అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971 నుంచి అన్వయించుకున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971 ప్రకారం తెలంగాణ విద్యా శాఖ మంత్రి బోర్డు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డు కార్యదర్శిగా (పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు) శైలజా రామయ్యార్‌ను నియమించారు. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఇంటర్ విద్య కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్, ఇంటర్ విద్య కమిషనర్, సాంకేతిక విద్య కమిషనర్, పాఠశాల విద్య కమిషనర్, మెడికల్ సర్వీసెస్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, తెలుగు అకాడమీ డెరైక్టర్లు, బోర్డు కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వ విద్యాలయాల వీసీలు నామినేటెడ్ సభ్యులుగా కొనసాగుతారు. వారితోపాటు ప్రభుత్వం నామినేట్ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు, ఇతర విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీల ప్రిన్సిపాల్లు ఆరుగురు, ఆదిలాబాద్‌లోని బొమ్‌కార్, హైదరాబాద్‌లోని భాగ్యనగర్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌లతోపాటు మరో నలుగురిని బోర్డు నామినేటెడ్ సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తుంది. మరో ముగ్గురికి మించకుండా విషయ నిపుణులు కో-ఆప్టెడ్ సభ్యులు ఉంటారు. ఈ ఉత్తర్వులు వారు నియమితులైన తేదీ నుంచి వర్తిస్తాయి. బోర్డు లీగల్ కన్సల్టెంట్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్యను, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా ముక్తధర్‌ను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఉమ్మడి బోర్డు నుంచి తీసుకోవాలని ఆదేశించింది. ఏపీ వెనక్కి తగ్గినందునే.. ఉమ్మడి పరీక్షల నిర్వహణపై తాము చేసిన ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని... పైగా బోర్డు చట్టంలో లేని వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో తామే ఇంటర్ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. చట్టం ప్రకారం ప్రస్తుత బోర్డుపై అధికారం తెలంగాణకే ఉన్నప్పటికీ ఇక గొడవలు వద్దని... విద్యార్థులు గందరగోళం పడకుండా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో తాము బోర్డును ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అయితే బోర్డు ఏర్పాటు చేయకముందు జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూల్లోని ఇంటర్ బోర్డుపై అధికారం తెలంగాణదేనని... ఏపీ ప్రభుత్వం దీనికి అంగీకరించి, తెలంగాణకు అప్పగిస్తే ఉమ్మడి పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామని పేర్కొన్నారు. లేదంటే తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసుకుంటామన్నారు. అనంతరం కొద్దిసేపటికే అధికారులతో మంత్రి మరోసారి చర్చించారు. తర్వాత కొన్ని గంటలకే తెలంగాణ ఇంటర్‌బోర్డును ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే తెలంగాణలో పరీక్షల నిర్వహణ కోసం చర్యలు చేపట్టిన నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల నిర్వహణ అంశం గందరగోళంలో పడింది. ఇక రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే పరీక్ష జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.