breaking news
seshendra
-
నిదురించే తోటకు పాట వెళ్లి పోయింది
‘జీవితం ఒక ప్రయాణం చివరి మజిలీ మరణం’ అని రాసుకున్న ప్రఖ్యాత హిందీ, ఆంగ్ల కవయిత్రి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ (96) మరణంతో తెలుగు సాహిత్యానికీ, రాచరిక అభిలాషకీ ఉన్న అనుబంధం ముగిసి పోయింది. ధన్‌రాజ్‌గిర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా గుంటూరు శేషేంద్రశర్మ సహచరిగానే తెలియడం ఒక పరిమితి. పట్టుదల, కవితాభిలాష, సాహితీ జిజ్ఞాస మెండుగా ఉన్న ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ తెలుగువారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చారు. ఒక జ్ఞాపకంగా మిగిలారు.గాంధార దేశ రాకుమారి గురించి వినేవారం. కాని ఇందిరా ధన్‌రాజ్‌గిర్ రూపంలో చూడగలిగాం. అవును. ఇందిరాదేవి పూర్వీకులు నేటి అఫ్ఘానిస్తాన్ నుంచి పూణె మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. నిజాం తర్వాత అంతటి సంపన్నులుగా, దాతృత్వం కలవారుగా పేరు గడించిన రాజా జ్ఞాన్ గిరిరాజ్ బహదూర్, ప్రమీలా దేవిల పెద్ద కుమార్తె అయిన ఇందిరా దేవి చిన్నప్పటి నుంచి తన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత అభిలాషలను, కళా సౌందర్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. గొప్ప గొప్ప కవులు, కళాకారులతో పరిచయం కలిగి కళాభిరుచిని పరిపుష్టం చేసుకున్నారు. ఏ రాకుమారుణ్ణో వలచాల్సిన ఈ రాకుమార్తె కవిని వలచడం, ఆ కవి తెలుగువాడు కావడం విశేషం. గుంటూరు శేషేంద్ర శర్మ సాహచర్యంలో ఇందిరా ధన్‌రాజ్‌గిర్ తన జీవితాన్ని కవితాత్మకం చేసుకున్నారు.→ ఎస్టేటే విద్యాలయంఇందిరా దేవి జీవితం చివరి వరకూ సాగిన తాత తండ్రుల ప్యాలెస్ ‘జ్ఞాన్‌బాగ్ ఎస్టేట్’ లేదా ‘ధన్‌రాజ్‌గిర్ బాగ్’ నాంపల్లి దాపున 8 ఎకరాల్లో 30 వేల చదరపు అడుగుల్లో 19 విశాల గదులతో ఉంటుంది. అక్కడే ఆమె బాల్యం, వైవాహిక జీవితం, విశ్రాంత జీవితం కొనసాగింది. ఒక దశలో ప్యాలెస్‌ను విడిచి బంజారా హిల్స్‌కు మారి పోవాలని భావించినా మనసు మార్చుకుని అక్కడే ఉండి పోయారు. లాక్డౌన్ సమయంలో పని వాళ్లందరూ వెళ్లి పోగా ఒకరిద్దరు సహాయకులతో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అంతటి మమకారం ఆ ప్యాలెస్ అంటే ఆమెకు. ఇందిరాదేవి కొంతకాలం మెహబూబియా బాలికల పాఠశాలలో చదువుకున్నా ఈ జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్సే ఆమె విద్యాలయంగా మారింది. ఇంటి వద్ద ఆంగ్ల గవర్నెస్ ద్వారా చదువుకున్నారు. ఆ తర్వాత ప్రఖ్యాత కవి అల్లామా ఇక్బాల్ ప్రేరణతో తొమ్మిదో ఏటనే రచనలు చేయడం ప్రారంభించారు. ఆంగ్లం, హిందీ, ఉర్దూ, మరాఠా భాషలు ఆమెకు కొట్టిన పిండి. ఇంగ్లిష్‌లో గొప్ప పాండిత్యం ఉంది. ప్రఖ్యాత కవి, ప్రొగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్ సభ్యుడు మఖ్దూం మొహియుద్దీన్‌తో ఉన్న స్నేహం ఆమె ప్రగతివాద దృష్టిని ఇచ్చిందని చెబుతారు.→ సొంతగా టైప్ నేర్చుకుని...ఇందిర తనకు తానుగా టైప్ చేయడం నేర్చుకోవడమే కాదు ఉర్దూలో ద్విపదలు కం పోజ్ చేయడం మొదలెట్టారు. ఫొటోలు తీయడం హాబీగా మొదలై తర్వాతి కాలంలో గొప్ప నైపుణ్యంగా మారింది. 1964లో తన మొదటి కవితా సంపుటి ‘ది అ పోస్టల్’, 1965లో ‘రిటర్న్ ఎటర్నిటీ’ వరుసగా వెలువరించడంతో కవులు ఆమెతో పరిచయ భాగ్యం కలిగి ఉండటం గౌరవంగా భావించారు. జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌లో గుంటూరు శేషేంద్ర శర్మ, మఖ్దూం మొహియుద్దీన్, జ్వాలాముఖి తదితరులు ఆమెతో కవిత్వంపై చర్చించడానికి, చదవడానికి కలిసేవారు. శేషేంద్ర శర్మతో పరిచయం వివాహానికి దారితీసింది. ఆయనకు అప్పటికే మొదటి వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నా ఆమె పరిగణనలోకి తీసుకోలేదు.→ పూలు పూసే తోట‘నా మనసు పూలు పూసే తోట’ అని కవిత్వం రాయగలిగిన ఇందిరా దేవి వివాహం తర్వాత అంత ఎక్కువగా కవిత్వం రాయలేదు. ‘ఒక ఇంటిలో ఇద్దరు కవులు ఉండరాదు’ అని ఆమె అన్నట్టుగా చెబుతారు. అయితే ‘ఈ తోట’ను శేషేంద్ర కవిత్వం చేశారు. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని బహుశా తన జీవితంలో ఆమె రాకను సూచిస్తూ కవిత రాస్తే దానిని బాపు, రమణలు ‘ముత్యాల ముగ్గు’ కోసం గొప్ప పాటగా తెలుగువారికి కానుక చేశారు. ‘ముత్యాల ముగ్గు’ కోసం ఇందిరా దేవి తన ప్యాలస్‌ను షూటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ‘ముత్యాల ముగ్గు’లో అలా జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ చిరస్థాయిగా నిలిచి పోయింది.→ చివరి కోరికఅంబర్ పేట్ శ్మశాన వాటికలో శేషేంద్ర సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగి పోయాయి. అది ఆమె చివరి కోరిక. అట్టహాసం లేకుండా అంత్యక్రియలు జరిగి పోవాలనేది కూడా ఆమె ఆఖరి ఆలోచన. మొత్తానికి ఒక చరిత్ర ముగిసింది. కవిత్వంలో ఒక రాజకుమారి వీడ్కోలు తీసుకుంది.అనేక ఘనతలుఇందిరాదేవి ‘మెమోరీస్ ఆఫ్ ది డెక్కన్’ అనే కాఫీ టేబుల్ బుక్‌ను తయారు చేసి ఎనిమిదవ నిజాం యువరాజు ముకరం జాకు 2008లో అంకితమిచ్చారు. ఆమె రాసిన ఒక కాలం ఉర్దూ పత్రికలో 12 ఏళ్లు కొనసాగి 750 పేజీల పుస్తకంగా వచ్చింది. 1973 సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఆమె పేరును నామినేట్ చేయడాన్ని నేటికీ విశేషంగా చెప్పుకుంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆమె పేరుతో ఒక హాల్‌ను కళా సాహిత్యాలకు అంకితం చేసింది. -
రారండోయ్
అమ్జద్ కవితా సంపుటి తొలకరి చినుకులు, కథా సంపుటి పూలచాదర్ ఆవిష్కరణ సభ అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్తలు: కె.శివారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి. నిర్వహణ: కవిసంగమం, పాలపిట్ట బుక్స్.డాక్టర్ నందిని సిధారెడ్డి ‘నూరు పూలు’ ముందుమాటల ఆవిష్కరణ సభ అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఆవిష్కర్త: కె.శివారెడ్డి. గ్రంథ సంపాదకులు: డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం శేషేంద్ర శర్మ 92వ జయంతి సభ అక్టోబర్ 20న సా. 6 గంటలకు త్యాగరాయ గానసభలో జరగనుంది. కీలకోపన్యాసం: శ్రీరామకవచం సాగర్. నిర్వహణ: గుండ్లకమ్మ రచయితల సంఘం. అక్టోబర్ 20న ఉదయం 9:30కు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని విద్యానికేతన్ పాఠశాలలో జరిగే రాజాం రచయితల వేదిక సమావేశంలో సాహిత్యోద్యానంలో పద్య పరిమళాలు అంశంపై చెళ్లపిళ్ల సన్యాసిరావు ప్రసంగిస్తారు. ముఖ్య అతిథి: ముయిద ఆనందరావు. పిల్లల్లో తెలుగు మీద గౌరవం, ఆసక్తి పెంచడం కోసం దాసుభాషితం.కామ్ ‘సి.పి.బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ 2019’ నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల పదో తరగతి విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాలలు ఇందులో పాల్గొనవచ్చు. పిల్లలు ఉమ్మడిగా రూ.40 వేలు, ఉపాధ్యాయులు రూ.10 వేలు గెలవొచ్చు. రెండు రాష్ట్రాలకూ కలిపి బహుమతుల మొత్తం లక్ష రూపాయలు. ప్రదానం హైదరా బాద్‌లో డిసెంబర్ రెండవ వారంలో జరుగు తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు ఞ్టౌ్ఛ్ఛ2019 అని 9952029498 వాట్సాప్ నంబరుకు సందేశం పంపాలి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అమరావతి సాహితీ మిత్రులు, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. బహుమతులు వరుసగా 5 వేలు, 3 వేలు, 2 వేలు. నవంబర్ 20లోగా ‘రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణనగర్, 5వ లైన్, తూర్పు గోరంట్ల, గుంటూరు–522034’ చిరునామాకు చేరాలి. -
నవ దార్శనిక మహాకవి శేషేంద్ర
శేషేంద్ర దార్శనిక దృష్టిని మరొక కోణం నుండి కూడా చూడాల్సి ఉంది. ఎట్టి త్యాగాలు చేసి సంపాదించిన ఎంతటి మహత్తర శుభపరిణామమైనా శాశ్వతంగా నిలువదు. అది ఎలాగో క్రమక్రమంగా క్షీణిస్తుంది. మళ్ళీ త్యాగాలు చేసి మరొక సత్పరిణామాన్ని సాధించుకోవలసిందే. నిర్మల హృదయ లతాంతమే నిఖిల కళాలతల పరమ ప్రయోజనం. కవితా కళ పరమ ప్రయోజనం నిర్మల హృదయాన్ని ఘటించటం. నిర్మల హృదయమంటే ప్రధానంగా సహానుభూతి హృదయం, సమతా వాంఛా హృదయం, పరపీడకులకు ప్రగాఢ క్రోధ హృదయం. ఏ కాలపు సత్కవిలోనైనా ఈ మూడు ప్రధాన విషయాలు గోచరిస్తయ్. కిరాతుడు క్రౌంచపక్షిని వధించినప్పుడు అది చూచిన వాల్మీకిలో క్రౌంచపక్షి యెడల సహానుభూతీ, కిరాతుని యెడల క్రోధమూ పెల్లుబికి శ్లోకరూపం ధరించాయ్. పక్షివధను చూచి తల్లడిల్లే సత్కవి కవితలో ప్రవహింపక ఏం చేస్తాడు! అధర్మాన్నెదిరించటానికి, బహుజన హిత బహుజన సుఖాలు ఘటించటానికి విభన్న యుగాలలో విభిన్న మార్గాలు అనుసరణీయాలైతయ్. అప్పటి భౌతిక విజ్ఞాన మనో విజ్ఞాన పరిధుల అవగాహన ననుసరించి అప్పటి మార్గం ఏర్పడుతుంది. యుగావశ్యక మార్గాన్ని ఎత్తిచూపే మహాకవి ‘దార్శనిక మహాకవి’ ఔతాడు. నేటి పీడిత ప్రపంచ మానవులకు తరణోపాయం ‘మార్క్సిజమ్’ (మార్క్సీయ దర్శనశాస్త్రం) అనేది గణనీయ సంఖ్యాక మేధావులు అంగీకరించిన విషయం. తెలుగు కవితలో మార్క్సిస్ట్ దృక్పథాన్ని ప్రధానంగా ప్రవేశపెట్టిన మొదటివాడు మహాకవి శ్రీశ్రీ. ‘కనబడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, హోమజ్వాలల భుగభుగలు ఎర్రబావుటా నిగనిగలు’ అని శ్రీశ్రీ వ్రాశాడు. ‘సల సల క్రాగే చమురా? కాదిది, ఉష్ణరక్త కాసారం!’ అన్నట్లుగా రక్తాన్ని ఉరకలెత్తించే గేయవేగంతో కవిత సాగించాడు. శ్రీశ్రీ తరువాత మార్క్సిస్ట్ దృక్పథంతో ఎందరో కవిత్వం వ్రాశారు. వీరిలో ‘శేషేంద్ర’ (గుంటూరు శేషేంద్రశర్మ) హిమధరోన్నతుడు. మహాకవి శేషేంద్ర అత్యంత కవితామయంగా, ప్రతిభావంతంగా, ధ్వనియుతంగా మార్క్సిస్ట్ దృక్పథంతో వ్రాశాడు. ‘కులగోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూరక్రియా పీడిత జ్వలిత ప్రాణిచమూసమూహ మొకటే సత్యంబు, ఉహాభుజా ర్గళముల్ విప్పిన విశ్వమూర్తియయి శంఖారవముం జేయుడో దళితశ్రామిక జీవులారా! భువనద్వారంబు ఖేదిల్లగన్’ ‘ప్రపంచ కార్మికులారా! ఏకం కండి!’ అనేదాన్ని ఇంత కవితామయం చేసిన రచన మరొకటి లేదు. ‘నా గీతి నిశ్శబ్దాల కుట్ర అశ్రువుల తిరుగుబాటు అవమానితుల భాషాసమితి, ఒకనాడు నా ఛాతిలో ఉన్న కోళ్ళన్నీ అరుస్తాయి, విప్తవాలన్నీ ఉదయిస్తాయి–’ ‘మరణించే లోపుగా తన మాట చెప్పలేని నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవి’ కవి పీడిత జన పక్షపాతి అనీ, విప్తవ సూర్యోదయానికి ఉదయసంధ్యా పూర్వదశ అనీ అంటున్నాడు శేషేంద్ర. ‘ఎన్నాళ్ళో పెంచి పోగుచేసిన వాళ్ళు ఎండల తలపాగాలతో వెళ్ళి పోతుంటే మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి ధాన్యపు రాసులు’ పీడననూ దోపిడినీ వర్ణిస్తున్నాడు శేషేంద్ర. ‘... వ్యథితానేక మనుష్య బాష్పజలముల్ వారాశిౖయె పొంగుచో నుదయించున్ సముదగ్ర విప్తవము తానుచ్చైశ్రవంబో యనన్’ క్షీరాబ్ధి మథనవేళ ‘ఉచ్చైశ్రవం’ అనే అశ్వం ఉద్భవించినట్లు పీడితజన దుఃఖాశ్రు సముద్రం నుండి విప్లవం ఉదయిస్తుంది. ‘రైతు నాగలి మోస్తున్నాడు/ క్రైస్తు శిలువ మోసినట్లు’ అతని వృత్తియే అతనికి శిక్ష (దండన) ఐనంతగా దేశంలో రైతుకు అన్యాయం ఘటిల్లుతోంది. ‘అతడి పోరు పాడిన పాటలు / ప్రవహించే నదులు ఆగి ఆలకించేవి / చావులేని వాడ్ని చంపే మూర్ఖులకు తెలీదు/ ఏ మృత్తిక పువ్వును మనిషికి కానుకగా ఇస్తుందో/ అది వాడి నిర్మాణంలో ఉందని’. గద్దర్‌పై హత్యాయత్నం జ్ఞప్తికి రావటం లేదా? శేషేంద్ర మార్క్సిజమ్ ఎడల గొప్ప గౌరవం కలవాడు. మార్క్స్‌కు ఈ శతాబ్దమంతా రుణపడి ఉన్నదంటాడు. కమ్యూనిజం తనలో పలికే ఏక్తారా అంటాడు. ‘ఇచట చరాచరమ్ములుదయింపకమున్ను, విదూర తారకల్ విచికిలకాంతులన్ గగనవీధుల దోచకమున్ను విశ్వ సం కుచిత నిశీథిలో తిమిరకోణములో గల ఆది తేజమీ రుచిర తనూలతల్ దొడిగె లోకపురోపరిణామ ధోరణిన్’ అన్నప్పుడు శేషేంద్రలో ఆధ్యాత్మికతా వాసన గోచరించింది. ‘దీనిని మార్క్సిజమ్‌తో సమన్వయించటం ఎలా?’ అనే సంశయం కలిగింది. పెన్నా శివరామకృష్ణ 1985 ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ చేసినప్పుడు శేషేంద్ర చెప్పిన ఒక జవాబుతో ఈ విషయంపై కాంతి ప్రసరించింది. ‘మార్క్సు తొలుత ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతం రష్యా విప్లవం నాటికి మార్పు పొందింది. ఆ తర్వాత చైనా విప్లవంతో మరింత మార్పు పొందింది. విశేషతః చైనాలో మావ్–సే–తుంగ్ కమ్యూనిజాన్ని చైనీకరించాలి అనే గట్టి నినాదం స్వీకరించాడు. అలాగే మన దేశచరిత్రకు, మన సంస్కృతికి, మన ప్రజల పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్క్సిజాన్ని సవరించాలి’. డయలెక్టికల్ మెటీరియలిజం, సైంటిఫిక్ సోషలిజం అనే రెండు పాదాల మీద మార్క్సిజమ్ నిలబడుతుంది. మొదటిది మెటీరియలిజం అనే జడపరిణామ సిద్ధాంతం. రెండవది మానవ సమాజం ప్యూడలిజం, కేపిటలిజం, కమ్యూనిజం అనే దశల్లోకి అంచెలవారీగా పరిణమిస్తూ చేరుతుంది అనే భావం. మన దేశానికి అనుగుణంగా సూచించిన మార్పు ఏమిటంటే– కమ్యూనిస్టు సమాజ స్థాపన కోసం ఏ చర్యాబద్ధ కార్యక్రమాన్నయితే చేపట్టాలో దాన్నిమాత్రం స్వీకరించి, మెటీరియలిజంను నిర్బంధ అంశం చెయ్యకుండా వ్యక్తి ఇష్టాధీనంగా విడిచెయ్యాలి. అంటే– కమ్యూనిస్టు సమాజ స్థాపనకు కావలసిన చర్యాబద్ధ కార్యక్రమమే నిర్బంధము. భారతదేశంలో మార్క్సిజమ్ బహుళ జనామోదం పొందటానికి ఈ మార్పు అవసరమూ, సముచితమూ అనిపిస్తోంది. ఈ విషయంలో మార్క్సిస్ట్ మేధావులలో శేషేంద్ర ఏకాకి కాడు. రావిశాస్త్రి విరసం సభ్యత్వానికి రాజీనామా చేయటానికి – అతని విశ్వాసాలు కొన్ని డయలెక్టికల్ మెటీరియలిజంకు విరుద్ధం కావటం కూడా ఒక కారణమని మిత్రుల వలన విన్నాను. ఐనా రావిశాస్త్రి ‘సైంటిఫిక్ సోషలిజం’కు నిబద్ధుడు, విఖ్యాత ప్రజారచయిత. (రావిశాస్త్రి ఈ సందర్భంలో తన భావానికి దార్శనిక వివరణ నివ్వలేదు.) శేషేంద్ర దార్శనిక దృష్టిని మరొక కోణం నుండి కూడా చూడాల్సి ఉంది. ఎట్టి త్యాగాలు చేసి సంపాదించిన ఎంతటి మహత్తర శుభపరిణామమైనా శాశ్వతంగా నిలువదు. అది ఎలాగో క్రమక్రమంగా క్షీణిస్తుంది. మళ్ళీ త్యాగాలు చేసి మరొక సత్పరిణామాన్ని సా«ధించు కోవలసిందే. ‘స్వర్ణంలాంటి రక్తంతో కూడా స్వప్నాలు శాశ్వత వాస్తవాలుగా మారలేదు మూర్ఖులే గ్రహించలేరు పరిణామం కూడా పరిణామగ్రస్తం అని’ ఇక్కడ ‘వాస్తవాలుగా’ అనక, ‘శాశ్వత వాస్తవాలుగా’ అనటం గమనించదగింది. ‘జీవితమనే పద్మపత్రం మీద ఉన్న చంచలమైన జలబిందువు జ్ఞానం. అది శాశ్వతం కాదు, పరిణామగ్రస్తం. భూగోళం మీద అంకురించిన మానవ జన్మలో సహజంగా ఉన్న దోషాలూ, సృష్టి సిద్ధమైన హద్దులూ ఉన్నాయి. అవి మానవాతీతమైనవి. మానవుడు ఆర్జించే జ్ఞానం మీద వాటి శాసనం ఉంటుంది. కనుకనే యుగయుగాన పూర్వపూజిత సిద్ధాంతం అనంతరం పూజిత సిద్ధాంతం చేత త్రోసివేయ బడుతుంది. ఇలా ఒక యాతాయాత సిద్ధాంత పరంపరా వలయం మానవేతిహాసంలో నిరంతర భ్రమణం చేస్తూ ఉంటుంది. వాస్తవంగా ఈ జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తి మనిషికి కావాలి. జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చే గ్రంథమే మానవ తరుణోపాయ «ధర్మకమైన జ్యోతి’. ఈ మహత్తర దార్శనికతా భరితమైన కవిత కాబట్టే శేషేంద్రది మహత్తర కవిత. నవదార్శనిక మహాకవి శేషేంద్ర. (రేపు శేషేంద్ర 10వ వర్ధంతి సందర్భంగా త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు సాహిత్య సదస్సు జరగనుంది.) గింజల నరసింహారెడ్డి 9490260573


