breaking news
Separatist militants
-
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
వేర్పాటు నేతల భద్రత ఉపసంహరణ
శ్రీనగర్/జమ్మూ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేర్పాటువాద నేతలకు కల్పించిన భద్రతతోపాటు ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే, జమ్మూకశ్మీర్ సమస్యపైగానీ, తమ భద్రతపైగానీ ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని హురియత్(వేర్పాటువాద పార్టీల ఐక్య వేదిక) పేర్కొనగా, వేర్పాటు వాద నేతలను అరెస్ట్ చేసి ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాగా, పుల్వామా ఘటన అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో జమ్మూలో శుక్రవారం విధించిన కర్ఫ్యూను సడలించేందుకు యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రభుత్వం వేర్పాటువాదులపై కఠినచర్యలు తీసుకుంటోంది. వేర్పాటువాద పార్టీల నేతలకు కల్పించిన వ్యక్తిగత రక్షణను ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్‌తోపాటు, అబ్దుల్ గనీ భట్, బిలాల్ లోన్, హషీమ్ ఖురేషి, ఫజల్ హక్ ఖురేషి, షబీర్ షా కలిపి మొత్తం ఆరుగురికి కేటాయించిన వ్యక్తిగత భద్రతా సిబ్బందితోపాటు వాహన సౌకర్యాలను సైతం ఆదివారం సాయంత్రం నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరికి ప్రభుత్వపరంగా అందే ఇతర వసతులను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీరు కాకుండా ఇంకా ఎవరైనా వేర్పాటు వాద నేతలకు ఇలాంటి వసతులు కల్పిస్తున్నట్లు గుర్తించినా వాటినీ తక్షణమే వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి భద్రతను కల్పించబోమని తెలిపింది. ఉమర్ తండ్రి మిర్వాయిజ్ ఫరూక్‌ను 1990లో, హురియత్ సీనియర్ నేత అబ్దుల్ గనీ లోన్‌ను 2002లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే, పాక్ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా జిలానీ, జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్‌కు ప్రభుత్వం ఎలాంటి భద్రతను కల్పించలేదు. పాక్ నుంచి నిధులు అందుకుంటూ, ఐఎస్ఐతో అంటకాగుతున్న వేర్పాటువాద నేతలకు కల్పిస్తున్న రక్షణపై సమీక్షించాల్సి ఉందంటూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శ్రీనగర్ పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తమకు సంబంధం లేదన్న హురియత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కశ్మీర్ సమస్యపైగానీ, ఇక్కడి వాస్తవ పరిస్థితులపై గానీ ఎటువంటి ప్రభావం చూపబోదని హురియత్ పేర్కొంది. ‘మాకు పోలీసు రక్షణ ఉన్నా లేకున్నా పరిస్థితిలో మార్పుండదు. భద్రత కల్పించాలంటూ మేమెన్నడూ కోరలేదు. కొందరు నేతలకు హాని ఉందంటూ అప్పట్లో ప్రభుత్వమే భద్రత కల్పించింది. ఇప్పుడు ఉపసంహరించుకుంది. ఆ నిర్ణయంతో మాకు సంబంధం లేదు’ అని హురియత్ పేర్కొంది. వారిని వేరే రాష్ట్రాల జైళ్లకు తరలించాలి వేర్పాటువాద నేతలకు కల్పించిన భద్రతను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూకశ్మీర్ బీజేపీ స్వాగతించింది. హురియత్ నేతలే కశ్మీరీల అసలైన శత్రువులని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మండిపడ్డారు. ఆ నేతలను అరెస్టు చేసి, జోథ్‌పూర్(రాజస్తాన్), తిహార్(ఢిల్లీ) జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు. జమ్మూలో మూడు రోజులుగా కర్ఫ్యూ పుల్వామా ఘటన అనంతరం శుక్రవారం జమ్మూ నగరంలో అల్లర్లు చెలరేగగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యంత్రాంగం విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. కర్ఫ్యూను సడలించేందుకు అధికారులు వివిధ పక్షాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
పోలీసులపై దాడి, ఆయుధాలతో పరారీ
అనంతనాగ్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి చేసి ఆయుధాలతో పరారయ్యారు. దల్విశ్ గ్రామంలో టీవీ టవర్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై గతరాత్రి దాడి చేసి, వారి వద్ద ఉన్న అయిదు తుపాకులను లాకెళ్లారు. మరోవైపు ముష్కర మూకల వరుస దాడుల నేపథ్యంలో ఆర్మీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.