నేడు కాంగ్రెస్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చలు వాడీ వేడీగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ , ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీని నిర్వహించనున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ అంశంలొ ప్రతిపక్షాన్ని కేంద్రం టార్గెట్ చేయటంతో పాటు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్ని ఇబ్బందులను గురి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీని నిర్వహించనుంది. జేఎన్ యూ, హైదరాబాద్ ,అలహాబాద్ యూనివర్సటీ ల్లో విద్యార్థులపై జరుగుతున్న దాడులను కూడా ర్యాలీలో నిరసించనున్నారు.
ఈ ర్యాలీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగించనున్నారు. ఇక పార్లమెంటులో జరిగే చర్చలో రాహుల్ గాంధీ అగస్టా స్కామ్ పై స్పందించనున్నారు. మరోవైపు కాంగ్రస్ అధినాయకత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాస్టర్ మైండ్ గా వ్యవహరిస్తున్నారని ఆపార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి లోకసభలో ఇచ్చిన సమాధానాన్ని చెత్త ప్రసంగంగా ఆయన ఆరోపించారు.