breaking news
sangareddi
-
మొలకెత్తని లక్ష్యం.. హరీతహారం
హరితహారం లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఒక్కో నర్సరీలో పెంచిన మొక్కల్లో సగానికి సగం దెబ్బతిన్నాయి. రూ.లక్షలు వెచ్చించి నర్సరీలను నిర్వహిస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఇందులోనూ అధికారులు, నర్సరీల నిర్వాహకులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కూలీలను, వన సంరక్షక్లను అధికంగా నమోదు చేస్తూ వారి పేరిట డబ్బులు కాజేస్తున్నారు. ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. మొత్తంగా నర్సరీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో హరితహారానికి మొక్కలు అందే పరిస్థితి లేదు. సీఎం సొంత జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి నెలకొంది. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి నెట్వర్క్ ‘పారిశుద్ధ్య లోపంపై యుద్ధం ప్రకటిద్దాం.. హరితహారం కింద నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు నాటుదాం.. హెలికాప్టర్ నుంచి గజ్వేల్ పట్టణాన్ని చూస్తే వనంలోకి వచ్చామా? అన్నంతగా చెట్లు పెరగాలె. వార్మోడ్లో (యుద్ధ ప్రాతిపదికన) మొక్కలు నాటే కార్యక్రమం చేపడదాం..’ గతేడాది గజ్వేల్‌లో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్షలో సీఎం కేసీఆర్ జిల్లా ఉన్నతాధికారులకు చేసిన సూచన ఇది.. మే డే రోజున రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా సంక్షేమ పథకాల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. ‘1.50 లక్షల టేకు మొక్కలు నర్సరీల్లో పెంచే కార్యక్రమం ప్రగతిలో ఉంది’అని డ్వామా పీడీ రవీందర్ పేర్కొన్నారు. ‘2013-14 సంవత్సరంలో పెంచిన మొక్కలను చిన్న బ్యాగుల్లోంచి పెద్ద బ్యాగుల్లోకి మార్చాం.. ఈ 1.55 లక్షల మొక్కలు రోడ్డుకు ఇరువైపులా నాటడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి నివేదించారు. ఈ నివేదికపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మండిపడ్డారు. నర్సరీల్లో మొక్కల సంక్షరణ లేనేలేదంటూ అధికారులను కడిగి పాడేశారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి నెట్వర్క్: అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మొక్కల పెంపకానికి చకచకా ప్రతి పాదనలు సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 478 నర్సరీల్లో 352 లక్షల మొక్కలు పెంచాలనే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.13 కోట్లతో ‘మిషన్’ మొదలైంది. కాలం సాగిపోతోంది.. రోజులు గడిచిపోతున్నాయి.. ఒక వానాకాలం వెళ్లిపోయింది. ఏరువాక దగ్గర పడుతోంది. లక్ష్యం మాత్రం దూరమవుతోంది. ‘హరితహారం’ వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ‘సాక్షి’ నెట్వర్క్ మంగళవారం దాదాపు 60కిపైగా నర్సరీలను సందర్శించింది. అక్కడి రైతులు, కూలీలు, వనరక్షక్లతో మాట్లాడింది. 50 లక్షల మొక్కల సామర్థ్యం ఉన్న నర్సరీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.57 లక్షలు లేబర్ చార్జీలు, రూ.1.38 లక్షలు మెటీరియల్ ఖర్చులు మొత్తం కలిపి 2.95 లక్షలు వినియోగించింది. ఏ నర్సరీలోనూ మొక్కలు ఏపుగా పెరిగిన దాఖలాల్లేవు. వర్షాలు కురిసే జూన్, జూలై నాటికి లక్ష్యంలో కనీసం 30 శాతం మొక్క లు కూడా అందటం గగనమే. నర్సరీల నిర్వహణలో, అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. నర్సరీలలో ఒకే ఒక వ్యక్తి.. నీళ్లు పట్టడం నుంచి, నైట్ వాచ్‌మన్ వరకు అన్నీ తానే చేస్తున్నాడు. సిద్దిపేటలో అంతంతే.. సిద్దిపేట మండలం ఇర్కోడ్ వన నర్సరీలో మొక్కల లక్ష్యం 50 వేలు కాగా కేవలం 16 వేలు మాత్రమే బతికి ఉన్నాయి. మొక్కల పెంపకానికి ఇక్కడ రూ.3.16 లక్షలు ఖర్చు చేశారు. అన్ని పనులు ఒక్కరే చూస్తున్నారు. చిన్నకోడూరు మండలం మైలారం వన నర్సరీకి రూ.7.05 లక్షలు కేటాయించి, లక్ష మొక్కల లక్ష్యం నిర్దేశించగా 45 వేల మొక్కలే బతుకుతున్నాయి. నంగునూరు మండలం ముండ్రాయిలో లక్ష మొక్కలు పెంచాల్సి ఉండగా కేవలం 50 కూడా పెరగడం లేదు. లక్ష్యానికి దూరంగా మెదక్... చిన్నశంకరంపేట మండలం సూరారం నర్సరీలో లక్ష మొక్కలు పెంచాల్సి ఉండగా, అన్నీ నారు దశలోనే ఉన్నాయి. కూలీల పేర్లను మస్టర్లో నమోదు చేయకుండా సాధారణ పుస్తకంలో రాస్తున్నారు. మొక్కలకు నీళ్లందించే వాటర్ ట్యాంకు కూడా పూర్తిస్థాయి నిర్మాణానికి నోచుకోలేదు. రామాయంపేటలోని నర్సరీలో 50 వేల టేకు మొక్కలు నాటగా 30 వేల మొక్కలు ఎండిపోగా ఆదరాబాదరాగా కానుగ, ఖర్జూర మొక్కలు నాటించారు. దుబ్బాకలో నిర్వహణ లోపం... ఈ నియోజకవర్గంలో 64 వన నర్సరీలు ఉండగా ఇందులో ఈజీఎస్ ఆధ్వర్యంలో 31, సామాజిక అటవీ నర్సరీలు 31, రిజర్వ్ ఫారెస్టు కింద 2 నర్సరీల్లో 20 రకాల మొక్కలను ప్రభుత్వం పెంచుతోంది. చేగుంట మండలం పొలంపల్లిలో 50 వేల మొక్కలకు గాను వేయి మొక్కలు మాత్రమే బతికి ఉన్నా యి. దుబ్బాక మండలంలోని టేకు మొక్కలకు సరిగా నీరు పెట్టక ఎండిపోయాయి. మిగతా నర్సరీల్లో 20 శాతం మేరకే మొలకెత్తాయి. మిరుదొడ్డిలోని నర్సరీల్లో కూలీలకు ఐదు నెలలైనా డబ్బులు అందలేదు. ‘ఆందోళ’నకరమే.. అందోలు మండలం చింతకుంట, డాకూర్, అల్మాయిపేట, ఎర్రారం, బ్రాహ్మణపల్లి, అందోలు గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు 50 శాతానికిపైగా పెరగలేదు. జూన్ వరకు మొక్కలు సిద్ధమయ్యే పరిస్థితి లేదు. నర్సరీ ల్లో పనిచేస్తున్న కూలీలకు 20 రోజులుగా వేతనాలు రాలేదు. అందోలు మండలం అల్మాయిపేటలో మొక్కలు పెరగకపోవడంతో 20 వేల ఖర్జూర, కానుగ చెట్లను మళ్లీ పెంచేం దుకు చర్యలు తీసుకుంటుంది. నర్సాపూర్‌లో అవినీతిపాదులు నర్సాపూర్ మండలం మంతూర్‌లో డ్వామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో మొక్కలు పెంచేందుకు గాను బెంగళూరులో 50 వేల టేకు మొక్కలను రూ. 30 వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువచ్చే సరికి వాటిలో సుమారు ఇరవై వేల మొక్కలు చనిపోయాయి. నాణ్యత లేని మొక్కలు తేవడం, నిర్వహణ అధ్వానంగా ఉండడంతో పిచ్చి మొక్కలు, గడ్డి ఏపుగా పెరిగాయి. శివ్వంపేట మండలంలో 60 శాతం విత్తనం కుళ్లిపోయాయి. కొల్చారం మండలం దుంపలకుంటలో ప్రస్తుతం వెయ్యి మొక్కలు కూడా లేవు. ఈ నర్సరీకి రక్షణ కోసం ఇద్దరు వనసేవక్లను నియమించినట్టు రికార్డుల్లో రాసి ఒక్కరితోనే పని చేయించుకుంటున్నారు. మూడు నెలలు గా వనరక్షక్ పేరిట వేతనం కాజేస్తున్నారు. వెల్దుర్తి మండలం శెట్టిపల్లిలో పని చేస్తున్న కూలీల కన్నా రోజుకు పదిమంది కూలీలను అదనంగా రికార్డుల్లో నమోదు చేసి ఆ సొమ్మును కాజేసినట్టు తెలిసింది. హత్నూర మండలం నస్తిపూర్లో ఒక వనసేవక్ను నియమించి ఇద్దరు పని చేస్తున్నట్లు నమోదు చేసి మూడు నెలలుగా వేతనాన్ని కాజేసిన ట్లు తెలిసింది. జహీరాబాద్లోనూ అంతంతే.. జహీరాబాద్ మండలానికి 15 లక్షలకు పైగా మొక్కలు అవసరం అవుతాయి. ఇక్కడ కూలీలకు నెల రోజులుగా డబ్బులు చెల్లిం చడం లేదు. కోహీర్ మండలానికి 7.60 లక్షల మేర మొక్కలు అవసరం. ప్రస్తుతం 5.60 లక్షల మొక్కలు మాత్రమే పెంచుతున్నారు. గజ్వేల్నూ అదే పరిస్థితి... రాయవరంలో 24 వేల మొక్కలు మాత్రమే మొలిశాయి. మొలిసిన కొన్ని మొక్కలు ఎండకు ఎండుముఖం పట్టాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు సగం మాత్రమే హరితవనానికి అందే అవకాశం ఉంది. కూలీలకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. తిమ్మాపూర్‌లో రోజుకు ఆరుగురు పనిచేస్తుండగా మూడు నెలలుగా డబ్బులు చెల్లించడం లేదు. వర్గల్ మండలం పాములపర్తి, నర్సంపల్లి, మజీద్‌పల్లి, గిర్మాపూర్, మాలపల్లిలో 3 లక్షలు లక్ష ్యం కాగా 40 శాతం మొక్కలు ఎండిపోయాయి. తూప్రాన్‌లోని రావెల్లిలో 50వేల మొక్కల్లో సగం కూడా మొలవలేదు. నారాయణఖేడ్‌లో అప్పుడే ‘ఖతం’ నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్‌లో 40 శాతం మొక్కలు కూడా ఎదగలేదు. మనూరు మండలం మాయికోడ్‌లో మొక్కల పరిస్థితి దయనీయంగా మారింది. కల్హేర్ మండలం పోచాపూర్‌లో 20 వేల మొక్కలు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. -
రేపు సంగారెడ్డిలో జాబ్‌మేళా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల కోసం ఈ నెల 21న సంగారెడ్డిలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీప్రియ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించే జాబ్‌మేళాలో జేకే పెన్నార్ ఇండియా లిమిటెట్, వెల్జాన్ డెన్షన్, జీటీఎన్ ఇండస్ట్రీస్, రేన్‌బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ పరిశ్రమలలో అభ్యర్థుల భర్తీ కోసం జాబ్‌మేల నిర్వహిస్తున్నామన్నారు. జేకే పెన్నార్‌లో ఐటీఐ, ఆల్ ట్రేడ్లకు సంబంధించి 30 ఖాళీలు, ఎస్ఎస్సీ, డిగ్రీపై 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వెల్జాన్ డెన్షన్లో ఐటీఐ ఫిట్టర్ 15, మెషినిస్ట్ 10, టర్నర్ 10, గ్రాండర్ 3, ఎలక్ట్రీషియన్ 3, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 5, జీటీఎన్ ఇండ స్ట్రీస్‌లో ఏడో తరగతి నుంచి 10వ తరగతి అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు మిషన్ ఆపరేటర్లుగా 50 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. రేన్‌బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ ప్రజ్ఞాపూర్ కోసం ఐటీఐ, మోటర్ మెకానికల్, డీజిల్ మెకానికల్‌కు సంబంధించి 10 ఖాళీలు, ఎంఆర్ఎఫ్ సదాశివపేటలో ఎస్ఎస్సీ, ఇంటర్ ఫెయిల్ అయిన 150 మంది అభ్యర్థుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత సర్టిఫికెట్లతో సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించే జాబ్‌మేళాకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరాక్రాంతి పథకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు. వినూత్న ఫెర్టిలైజర్లో ఇంటర్మీడియట్ అర్హత కలిగి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా జిల్లాలో పనిచేసేందుకు 80 మంది అభ్యర్థులను భర్తీ చేసేం దుకు మేళా నిర్వహిస్తునామన్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో నర్స్ పోస్టుల కోసం జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారికి 100 ఖాళీల్లో భర్తీ చేయనున్నామన్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా తెలిపారు. వివరాలకు 08455 272234, 9652288882 కు సంప్రదించాలన్నారు.