breaking news
Rs. 80 lakhs
-
ఎలక్షన్స్ కోసం రూ.80 లక్షలు ఖర్చు.. వందలసార్లు ఓడినా మళ్లీ బరిలోకి..
న్యూఢిల్లీ: ఎలక్షన్ అనగానే ఎవరైనా గెలవాలనే పోటీ చేస్తారు. కానీ ఓడిపోవడానికే పోటీ చేసే వ్యక్తి కూడా ఉన్నారంటే.. బహుశా ఇది వినటానికి కొంత వింతగా ఉంటుంది. అయినా ఇది నమ్మాల్సిన నిజం. ఇప్పటికి 238 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. ఒక్కసారికి కూడా గెలుపొందలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఆయనే.. ఎలక్షన్ కింగ్ 'కే పద్మరాజన్'. ఎలక్షన్ ఏదైనా పోటీ చేయడమే ప్రధానం అన్నట్లు పద్మరాజన్ నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఎన్నికల కోసం ఈయన రూ.80 లక్షలు డిపాజిట్ చేసి మొత్తం కోల్పోయారు. ఇప్పడూ కూడా తమిళనాడులోని ధర్మపురి లోక్‌సభ స్థానం నుంచి, కేరళలోని త్రిస్సూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 1988లో తమిళనాడులోని తన స్వస్థలమైన మెట్టూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించిన పద్మరాజన్.. మాజీ ప్రధానులు అటల్ బీహార్ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మాజీ ప్రధానమంత్రుల మీద సైతం పోటీ చేశారు. ఎన్నికలలో నిలబడిన ప్రతిసారీ నాకు ఓటు వేయవద్దని ప్రజలను చెబుతానని పద్మరాజన్ పేర్కొన్నారు. జయలలిత, ఎం కరుణానిధి, ఎకె ఆంటోనీ వంటి మాజీ ముఖ్యమంత్రుల నుంచి సినీ నటులు హేమ మాలిని, విజయకాంత్ వరకు.. పద్మరాజన్ అందరిమీదా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో అత్యధికసార్లు ఓడిపోయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించమే లక్ష్యం అని పద్మరాజన్ చెబుతున్నారు. అత్యధిక సార్లు ఎన్నికల్లో ఓటమిపాలైన వ్యక్తులలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాకా జోగిందర్‌సింగ్ కూడా ఒకరు. పద్మరాజన్ 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ జోగిందర్‌సింగ్ ఏకంగా 300 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈయన 1998లో కన్నుమూశారు. బహుశా ఈ రికార్డును బద్దలు కొట్టడానికి పద్మరాజన్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
అనంతపురం జిల్లాలో క్యాష్ కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక సమీపంలోని కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 80 లక్షల రూపాయిల నగదు పట్టబడింది. పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డబ్బుతో పాటు ఐదు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని నుంచి AP 21 AB1729 నెంబర్ వాహనంలో బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకెళ్లడానికి గల కారణాలు, వివరాల గురించి పోలీసులు కూలీ లాగుతున్నారు. కాగా తాము బంగారు వ్యాపారులమని అదుపులో ఉన్న వ్యక్తులు చెప్పినట్టు సమాచారం.