ఆర్ఐ, వీఆర్వోపై టీడీపీ నేత వీరంగం
కంతేరు (ఇరగవరం) : కృష్ణా జిల్లా ముసునూరు మండల తహసిల్దార్పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటన మరిచిపోకముందే ఇరగవరం మండలం కంతేరులో అదే తరహా ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్రమంగా మట్టిని తవ్వుకుని విక్రయిస్తూ అడ్డొచ్చిన అధికారులనూ బెదిరిస్తున్నారు. అక్రమ తవ్వకాలను ఆపాలని కోరిన ఆర్ఐ, వీఆర్వోలపై మండలానికి చెందిన టీడీపీ నాయకుడు గల్లి వెంకటేశ్వరరావు వీరంగం చేశారు. తన అక్రమాలకు అడ్డొస్తే చంపేస్తానని బెదిరించారు. వివరాలు ఇలా ఉన్నారుు. కంతేరు నుంచి కాకిలేరు వెళ్లే రోడ్డు పక్కనే అక్రమంగా చెరువు తవ్వుతున్నారనే సమాచారంతో గ్రామ రెవెన్యూ అధికారి వి.సురేష్ ఘటనాస్థలానికి వెళ్లి తక్షణమే పనులు ఆపాలని కోరారు.
దీంతో అక్కడకు వచ్చిన ఎంపీటీసీ సభ్యులు గల్లి సీతమ్మ భర్త గల్లి వెంకటేశ్వరరావు వీఆర్వోను, అక్కడ ఉన్న విలేకరులను తీవ్ర దుర్భాషలాడారు. ఈ విషయూన్ని వీఆర్వో తహసిల్దార్ మమ్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయలక్ష్మిలకు తెలియజేశారు. పుష్కర విధుల్లో ఉన్న తహసిల్దార్ మమ్మి ఆర్ఐ జయలక్ష్మిని ఘటనా స్థలానికి పంపారు. ఆమె అక్కడికి చేరుకుని వెంటనే పనులు నిలిపివేయూలని, మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. దీంతో టీడీపీ నేత వెంకటేశ్వరరావు మరింత రెచ్చిపోయూరు. రెవెన్యూ అధికారులను తీవ్రపదజాలంతో (బూతులతో) దుర్భాషలాడుతూ తన పనులకు అడ్డు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అధికారులను ఉద్యోగాల నుంచి తీరుుంచేస్తానని బెదిరించారు. విలేకరులను రోడ్లపై తిరగనివ్వబోనని పరుష పదజాలంతో హెచ్చరించారు.