breaking news
Rice harvest machine
-
వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ
వరికోత యంత్రం అభివృద్ధి చిన్న, సన్నకారు రైతులకు మేలు అనకాపల్లి: అనకాపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చిన్న, సన్న కారు రైతులు వరి కోతకు ఉపయోగపడే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. మూడు నెలల ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా విద్యార్థులు విష్ణు, అజయ్‌బాబు, గౌతమ్‌కుమార్, లక్ష్మిచైతన్య, లలితబాయ్, లిఖిత, మాధురిలతో కూడిన బృందం ఈ యంత్రాన్ని అభివృద్ధి చేసి కళాశాల ప్రిన్సిపాల్ సరిత, ప్రధానశాస్త్రవేత్త జగన్నాథరావు, మరో శాస్త్రవేత్త శ్రీదేవిల మన్ననలు పొందారు. కొడవలితో కోస్తే గుండెజబ్బులు... గ్రామీణులు వరి కోతకు కొడవళ్లను ఉపయోగిస్తారు. బాగా వంగి కోతలు చేపట్టాలి. ఇలాంటప్పుడు సాధారణం కంటే 20 నుంచి 25శాతం అధికంగా గుండె కొట్టుకుంటుంది. ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యేవారు. కాలక్రమేణా వంగి కోయడానికి నవీన్, కృషి రకాల కొడవళ్లను వ్యవసాయనిపుణులు అభివృద్ధి చేశారు. అనంతరం రూ.లక్షల వ్యయంతో కూడిన భారీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న, సన్నకారు రైతులు వీటిని వినియోగించుకోలేని పరిస్థితి. ఈక్రమంలో శాస్త్రవేత్తలు కోతలకు బ్రెష్కట్టర్ను రూపొందించారు. వరిని కోసేటప్పుడు కంకులు కుంగిపోవడం, వైబ్రేషన్స్ ఎక్కువుగా రావడం, బరువు , బ్లేడు పెద్ద సైజులో ఉండడం వంటి సమస్యలను వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గుర్తించారు. బ్రెష్కట్టర్కు సైలన్సర్ను అమర్చడం ద్వారా శబ్దాన్ని తగ్గించగలిగారు. అదే విధంగా డిస్క్ డయామీటర్‌ను కూడా తగ్గించారు. వెనుకన తగిలించుకునేటపుడు బరువుని, వైబ్రేషన్ తగ్గించేందుకు స్పాంజ్‌లను అమర్చారు. కోతలప్పుడు కంకులు కుంగిపోకుండా ఉండేందుకు యంత్రాన్ని ఆధునీకరించారు. ఇవీ లాభాలు... మాములుగా వరిని రోజుకు ఒక రైతు 6 సెంట్ల స్థలంలో కోయగలడు. అదే బ్రెష్కట్టర్తో 30 నుంచి 40 సెంట్లలో కోత కోయవచ్చు. చేత్తో కోసేటప్పుడు వరి గింజ శాతం నష్టం 2.6 నుంచి 3 శాతం ఉండగా ఈ యంత్ర సహాయంతో కోసినపుడు గింజ నష్టం 1.35 తగ్గింది. గంటకు లీటరు పెట్రోల్‌తో ఈ యంత్రాన్ని వినియోగించి చిన్న, సన్న కారు రైతులు వరిని కోయవచ్చు. దీని ధర రూ.25 వేలు. విద్యార్థులు విజయనగరం జిల్లా వెంకటభైరిపురం, జిల్లాలోని ఆనందపురం, నర్సీపట్నంలో ఈ యంత్రాన్ని వినియోగించే విధానంపై పరీక్షించారు. చిన్న రైతులకు ఎంతోమేలు... వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు అభివృద్ధి చేసిన బ్రెష్ కట్టర్‌తో వరిని కోయవచ్చు. ముఖ్యంగా చిన్న, సన్నకారురైతులు ఈ యంత్రాన్ని ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడితో లాభపడవచ్చు. ముఖ్యంగా పెద్ద యంత్రం వినియోగం ఖర్చుతో కూడుకున్నది. విద్యార్థులు బ్రెష్కట్టర్లో ఉన్న సాంకేతిక లోపాలను గుర్తించి అభివృద్ధి చేశారు. పి.జగన్నాథరావు, ప్రధాన శాస్త్రవేత్త -
కారు ఢీకొని యువకుడి మృతి
-పండగ రోజు విషాదం ముత్తుకూరు: ముత్తుకూరురోడ్డులో రిలయన్స్ చీలురోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై మారుతీకృష్ణ కథనం మేరకు మండలంలోని పాటూరువారికండ్రిగకు చెందిన ఆలపాక రామకృష్ణ(26) వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వివాహమైన రామకృష్ణకు ఒక కొడుకు ఉండగా, భార్య గ ర్భవతి. విజయదశమి రోజున కాకుపల్లిలో వరికోత మిషన్‌కు పూజలు ముగించుకుని, మోటారుసైకిల్‌పై ఊరికి బయలుదేరాడు. కృష్ణపట్నం వైపు నుంచి తమిళనాడుకు చెందిన ఓ కారు నెల్లూరువైపు వేగంగా బయలుదేరింది. సరిగ్గా రిలయన్స్రోడ్డు వద్ద కారును మోటారు సైకిల్ ఢీకొంది. బైక్‌పై ఉన్న రామకృష్ణ ఎగిరి కారు అద్దాలను ఢీకొని, కింద పడ్డాడు. తలకు బలమైన గాయమవడంతో మృతి చెందాడు. చెంతనే ఉన్న పాటూరువారికండ్రిగ నుంచి మృతుడి భార్య, తల్లి, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పండగపూట జరిగిన ఈ ఘటనతో పీవీ కండ్రిగలో విషాదఛాయలు అలముకున్నాయి. కృష్ణపట్నం సీఐ గంగావెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జబ్బార్ ట్రావెల్స్ బస్సుకు రోడ్డుప్రమాదం
-
మళ్లీ జబ్బార్ ట్రావెల్స్ బస్సుకు రోడ్డుప్రమాదం
మహబూబ్ నగర్: జిల్లాలోని కొత్తపేట మండలం పాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున మళ్లీ జబ్బార్ ట్రావెల్స్ బస్సుకు రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద వరికోత యంత్రాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. తీవ్రగాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా మారడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. గతంలో ఇదే స్థలంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.