breaking news
Removal of homes
-
ఉండవల్లిపై ఉక్కుపాదం
రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల తొలగింపు అటవీ శాఖ తొలి దశ సర్వేలో 2,500 కుటుంబాల తరలింపునకు ప్రతిపాదనలు పొమ్మనకుండా పొగ పెడుతున్న వైనం సర్కారు కుయుక్తులతో జనం గగ్గోలు విజయవాడ బ్యూరో : భూసమీకరణను వ్యతిరేకించిన తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని అభివృద్ధి సాకుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఆ గ్రామం ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తొలినాళ్లలో టూరిజం హబ్‌గా ఉండవల్లి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. భూ సమీకరణను ఆ గ్రామం ప్రతిఘటించడంతో ప్రభుత్వం ఆ తరువాత ఆ గ్రామానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రవాణాకు మౌలిక వసతులు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ఉండవల్లిని ఎంపిక చేసింది. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందనేది స్థానికుల వాదన. టూరిజం ప్రాంతం అయితే అక్కడ భూముల ధరలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రవాణా, విద్యుత్ సబ్స్టేషన్లకు ఎంపిక చేస్తే ఆ ప్రాంతానికి పెద్దగా క్రేజ్ ఉండదు. దీంతో అక్కడ భూముల ధరలు పడిపోవడంతో పాటు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడి వలసలు పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రకటనకు ముందే కోట్లు పలికిన భూములు... రాజధాని ప్రకటన రాకముందు నుంచే ఉండవల్లి ప్రాంతంలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలికాయి. ఇప్పుడు మాత్రం రాజధాని నిర్మాణం చేపట్టకముందే ఉండవల్లిలోని నివాసాలపై ప్రభావం పడుతోంది. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా గతేడాది రోడ్ల విస్తరణ చేపట్టిన ప్రభుత్వం ఉండవల్లిలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించింది. విజయవాడ - ఉండవల్లి - తుళ్లూరు - అమరావతి రోడ్ల విస్తరణకు ఇప్పటికే చాలా మంది నివాసాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉండవల్లి వద్ద రోడ్డును మరింత విస్తరించడంతో ఇళ్లు, దుకాణాలు, చిన్నపాటి బడ్డీకొట్లను తొలగించారు. రాజధాని నిర్మాణం, అటవీ భూముల అవసరం సాకుతో 50 ఏళ్లకు పూర్వం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలను తరిమేసే ప్రయత్నాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలను పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఇబ్బందులు పెడితే భూములైనా ఇస్తారు, ఊరైనా వదిలిపోతారు అన్నట్టు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. అయినా రోడ్ల విస్తరణ తదితర కారణాలతో ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాజధాని పేరుతో పొలాలు గుంజుకున్న సర్కారు ఇప్పుడు ఇళ్లనూ కూల్చేసి ప్రజలను రోడ్డున పడేస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. అటవీ భూముల బూచి... అమరావతి రాజధాని కోసం సుమారు 50 వేల ఎకరాల అటవీ భూములను డీఫారెస్ట్ కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ రాయడంతో దాని ప్రభావం కూడా ఉండవల్లిపై పడనుంది. ఉండవల్లి సమీప ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ పాచిక పారకపోవడంతో ఇక్కడ అటవీ భూములను తీసుకోవడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అటవీ శాఖ అధికారులు ఉండవల్లితో పాటు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, ప్రకాష్‌నగర్, డోలాస్‌నగర్ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు అటవీ భూముల పరిధిలోకి వస్తాయని గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న సుమారు 30 వేల ఇళ్లలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లను అటవీ ప్రాంతం నుంచి కదిలించాల్సి ఉంటుందని సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఒక పర్యాయం సర్వే నిర్వహించిన అటవీ శాఖ అధికారులు ఉండవల్లి, ప్రకాష్ నగర్, డోలాస్‌నగర్, నులకపేట ప్రాంతాల్లోని అటవీ భూముల్లో 2,500 ఇళ్లు ఉన్నాయని నిర్ధారించారు. వాటితో పాటు మరో ఎనిమిది వేల ఇళ్లను కూడా వేర్వేరు కారణాలు చూపి ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కృష్ణా నదికి ఆనుకుని విజయవాడ-చెన్నై జాతీయ రహదారి చెంతనే ఉన్న ఉండవల్లి గ్రామం రైల్వేస్టేషన్‌కు కూడా కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేలా పథక రచన చేస్తోంది. -
నివాసాల తొలగింపులో ఉద్రిక్తత
- రామవరప్పాడు ఫ్లైఓవర్ బాధితుల నిరసన - న్యాయం చేయాలంటూ ఆందోళన రామవరప్పాడు : రామవరప్పాడు ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా మంగళవారం చేపట్టిన ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రింగ్‌లోని కట్ట నివాసితుల నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు బలగాల మధ్య జేసీబీలతో ఇళ్ల తొలగింపు చేపట్టారు. గతంలో సర్వే నిర్వహించిన అధికారులు అర్హుల పేర్లను గుర్తించి 131 మందికి గొల్లపూడి జెఎన్యూఆర్యూఎంలో ఇళ్లను కేటాయించారు. అయితే మిగిలి ఉన్న అర్హులకు ఇళ్లను కేటాయించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గృహలు కేటాయించని బాధితులు ఇళ్ల తొలగింపుతో ఇంటి పన్ను, ఆధార్, రేషన్ కార్డులు ఇతరత్రా ఆధారాలున్నా మాకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. అర్హుల జాబితాలో మా పేర్లు నమోదు కాలేదని అప్పటి నుంచి గ్రామంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ప్రయోజన ం లేకపోయిందని వీరు ఆరోపిస్తున్నారు. కాగా చిన్న దుకాణాలు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, అర్హుల పేర్లు నమోదు సమయంలో దుకాణదారుల పేర్లను నమోదు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన అర్హులకు ప్రత్యామ్నాయం చూపాలని లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు తేల్చి చెబుతున్నారు. న్యాయం చేయకుంటే దూకేస్తా అర్హత ఉన్న తనకు ఇల్లు కేటాయించలేదని, న్యాయం జరగకపోతే ఇక్కడినుంచి దూకేస్తానంటూ ఓ మహిళ విజయవాడ శివారు ప్రసాదంపాడు ఫోర్డ్ కార్ల షోరూం సమీపంలోని హోర్డింగ్ టవర్ ఎక్కి హడావుడి చేసింది. రామవరప్పాడుకు చెందిన పంచకర్ల విజయలక్ష్మి రింగ్ సమీపంలోని కట్టపై నివాసం ఉంటోంది. రామవరప్పాడు ఫ్లైవోవర్ నిర్మాణంలో భాగంగా అక్కడి నివాసాలను తొలగిస్తున్నారు. తన నివాసాన్ని తొలగిస్తారేమోనని ఆందోళనతో ఆమె సమీపంలోని టవర్ ఎక్కింది. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ దిగేది లేదంటూ పట్టుబట్టింది. రూరల్ మండల తహశీల్దార్ మదన్మోహన్, పటమట సీఐ దామోదర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పారు. ఈ విషయమై విచారణ నిర్వహించి న్యాయం చేస్తానని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో టవర్ దిగింది. అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇల్లు కేటాయించలేదని చెప్పారు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని విన్నవించింది.