breaking news
ravikumarnaik
-
కమలంలో ‘సాగర్’ లొల్లి.. ఎందుకంటే!
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ నాయక్ ఎంపిక కమలదళంలో అసంతృప్తికి దారితీసింది. అభ్యర్థి రేసులో ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం తమను పట్టించుకోకపోవడం జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి.. సతీమణి నివేదిత (గత ఎన్నికల్లో పోటీ చేశారు)తోపాటు పార్టీని నమ్ముకొని పనిచేసిన కడారి అంజయ్య యాదవ్‌కు ఆగ్రహం తెప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపట్ల మరికొందరు నేతలూ అసహనం వ్యక్తం చేస్తున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. రవిని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ అంజయ్య మంగళవారమే టీఆర్ఎస్లో చేరగా కంకణాల దంపతులు మౌనంగా ఉన్నా పార్టీ పెద్దలకు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తెల్లారేసరికి టీఆర్ఎస్లోకి.. రవినాయక్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి ఖరారు చేయగా తెల్లారేసరికే నియోజకవర్గంలో పార్టీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన కంకణాల శ్రీధర్‌రెడ్డి దంపతులు అటు పార్టీ కేడర్‌కు, ఇటు పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అంజయ్య యాదవ్ అయితే ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని ఎర్రవెల్లిలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. తనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌కు మద్దతిస్తానని అంజయ్య గతంలోనే చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఎలాగూ టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు అధికారికంగా ఆయన టీఆర్ఎస్లో చేరి కార్పొరేషన్ చైర్మన్ హామీ దక్కించుకున్నారనే చర్చ కమలదళంలో జరుగుతోంది. అంజయ్యకు టికెట్ ఇస్తే యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్లు అదనంగా వచ్చేవని, పార్టీ మంచి జోష్‌లో ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు కూడా తోడయితే ఆయన గట్టిపోటీ ఇచ్చేవారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు నిరాకరణ... కంకణాల శ్రీధర్‌రెడ్డి దంపతులకు సైతం టీఆర్ఎస్ గాలం వేసినట్లు సమాచారం. గులాబీ దళంలోకి రావాలని శ్రీధర్‌రెడ్డి, నివేదితలకు ఆహ్వానం అందిందని, అయితే వారు సున్నితంగా తిరస్కరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాము మొదటి నుంచీ సంఘ్ కార్యకర్తలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని, టికెట్ ఇవ్వనందున అలక సాధారణమేనని, పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉపఎన్నికలో రవికుమార్ పోటీలో ఉన్నా రెండున్నరేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో తమకు పార్టీ అవకాశం ఇస్తుందనే భరోసా కూడా వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కంకణాల దంపతులతో మాట్లాడేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలను కూడా బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. -
ఆస్తి కోసమే తోడల్లుడిని హతమార్చారు
– నలుగురు నిందితుల అరెస్ట్ – సాంకేతిక ఆధారాలతో కేసును చేధించిన పోలీసులు నల్లమాడ (పుట్టపర్తి) : ఆస్తి కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే విషయం మరోసారి రుజువైంది. నల్లమాడ మండలం గోపేపల్లి పొలిమేరల్లోని ప్రధాన రహదారిపై గత నెల 29న ఓ వ్యక్తి మృతదేహం పడి ఉండగా పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు తెలిపారు. నల్లమాడ ఇన్చార్జ్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ గోపీతో కలసి నిందితులను మీడియా ముందు బుధవారం హాజరుపరిచారు. గుర్తు తెలియని మృతదేహం కదిరి మండలం బత్తలపల్లి తండాకు చెందిన రవికుమార్‌నాయక్(38)దిగా గుర్తించారు. తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానంతో విచారణ చేపట్టిన పోలీసులు హత్య కేసులో ప్రధాన నిందితుడు ముదిగుబ్బకు చెందిన ఇస్లావత్ తిరుపాల్ నాయక్, బాలరాజునాయక్, ఎస్.బాలాజీనాయక్, ఎన్.నాగేంద్రనాయక్‌ను అరెస్ట్ చేశారు. తిరుపాల్‌నాయక్, హత్యకు గురైన రవికుమార్‌నాయక్ తోడల్లుళ్లు. వీరిద్దరూ ఒకే ఇంటికి చెందిన అక్కా,చెల్లెళ్లను పెళ్లిళ్లు చేసుకున్నారు. వారి మామ ప్రభుత్వోద్యోగిగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. హిందూపురం, అనంతపురం, ధర్మవరం, కదిరిలో అతని పేరుతో స్థలాలున్నాయి. తోడల్లుడిని అడ్డు తొలగించుకుంటే అత్తవారి ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని తిరుపాల్‌నాయక్ ఆలోచించాడు. వెంటనే రవికుమార్‌నాయక్ హత్యకు పథకం రచించాడు. తనకు పరిచయమున్న రమేష్‌నాయక్‌కు ఫోన్ చేసి రవికుమార్‌నాయక్‌ను ముదిగుబ్బకు పిలిపించుకున్నాడు. గత నెల 29వ రాత్రి ముదిగుబ్బ సమీపంలోని ఓ డాబాలో రవికుమార్‌నాయక్‌కు బాగా మద్యం తాపించాడు. ఆ తరువాత రమేష్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. అనంతరం తిరుపాల్‌నాయక్ తన బంధువులు, స్నేహితులైన బాలరాజునాయక్, బాలాజీనాయక్, నాగేంద్రనాయక్‌తో కలసి రవికుమార్‌నాయక్‌ను కారు(నెంబర్. కేఏ 01ఎంహెచ్ 8240)లో ఎక్కించుకున్నారు. గోపేపల్లి పొలిమేర వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న రవికుమార్‌నాయక్‌ను కారులో నుంచి బయటకు నెట్టేసి అతని శరీరంపై కారును వెనుకా, ముందుకు పలు దపాలు తొక్కించారు. చనిపోయాడనుకుని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ప్రధాన నిందితుడు తిరుపాల్‌నాయక్ మృతుని భార్య,పిల్లలతో కలసి కదిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు ఎవరిపైనా అనుమానం లేదని, రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉండొచ్చని మృతుని కుటుంబ సభ్యులతో పోలీసులకు చెప్పించాడు. దీంతో పోలీసుల్లో అనుమానం మరింత బలపడింది. మృతదేహం వద్ద లభ్యమైన కారు మడ్‌గార్డ్ రేకు, కదిరి, ముదిగుబ్బలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా వారు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. మలకవేమల–ముదిగుబ్బ రహదారిలో కల్వర్టు వద్ద బుధవారం నిందితులను అరెస్ట్ చేసి కదిరి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్ఐ సహా సిబ్బంది రాధాకృష్ణగౌడ్, హర్షవర్దన్‌రాజు, నారాయణస్వామి, రాము, శంకర్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు. కాగా ప్రధాన నిందితుడు తిరుపాల్‌నాయక్ మొదటి భార్య ముదిగుబ్బ మేజర్ పంచాయితీ సర్పంచ్ అని తెలిసింది. ప్రస్తుతం వీరు అధికార పార్టీలో కొనసాగుతున్నారు. భార్య ఉండగానే తిరుపాల్‌నాయక్ రెండో వివాహం చేసుకున్నాడు.