breaking news
ramasubbamma
-
రామబాణమ్మ
రామబాణం రయ్యిన వెళుతుంది. గురి తప్పదు. లక్ష్యాన్ని ఛేదిస్తుంది. రామసుబ్బమ్మ కూడా అంతే. డెబ్బయ్ ఏళ్ల వయసులోనూ ఆమె పరుగులు తీస్తూనే ఉన్నారు. పతకాలు సాధిస్తూనే ఉన్నారు. అందుకే ఆమె రామబాణమ్మ. ఆమె స్వప్నమే ఆమెను బాణంలా సంధిస్తోంది. ‘గొప్పగా ఆలోచించాలి, పెద్ద కల కనాలి.. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి’ అని అబ్దుల్ కలామ్ చెప్పాడని ఆమె చదవలేదు. కానీ ఆమె పెద్ద కల కంటోంది. డెబ్బై ఏళ్ల వయసులో ఆ కలను నిజం చేసుకోవడానికి సిద్ధమైంది! తాను పుట్టిన ఊరి పేరు విదేశాల రికార్డుల్లో నమోదు కావాలని కలకంటోంది మానికల రామసుబ్బమ్మ. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన రామసుబ్బమ్మ వెటరన్ క్రీడాకారిణిగా ఇప్పటికి ఇరవై పతకాలు సాధించింది. రాబోయే ఆగస్టులో శ్రీలంకలో జరిగే వెటరన్ అథ్లెట్ మీట్ పరుగు పందెంలో విజయం సాధించాలనేది ఇప్పుడామె లక్ష్యం. ఇంతవరకు సాధించిన విజయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు రామసుబ్బమ్మ. కావలి పట్టణం నార్త్ జనతాపేటలో పుట్టిన మానికల రామసుబ్బమ్మది నిరుపేద కుటుంబం. తండ్రి తోటమాలి, తల్లి ఇళ్లలో పనులు చేసేవారు. రామసుబ్బమ్మ ఆరవ తరగతి వరకు విశ్వోదయ గర్ల్స్ హైస్కూల్లో చదివింది. తల్లి అనారోగ్యం కారణంగా పనులకు వెళ్లలేకపోవడంతో రామసుబ్బమ్మ పుస్తకాలను కట్టిపెట్టి, తల్లి చేస్తున్న ఇళ్లలో పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఆ మలుపుతో ఆమె జీవితం గానుగెద్దులా అయిపోయిందనే చెప్పాలి. అయితే జీవితాన్ని అదే చట్రంలో తిరగనివ్వకుండా తన నైపుణ్యంతో కొత్త పట్టాలను ఎక్కించుకున్నారు రామసుబ్బమ్మ. భర్త మాలకొండయ్య జవహర్‌భారతి కాలేజ్ మెస్‌లో వంట చేసేవారు. రామసుబ్బమ్మ జనతాపేటలోని టీచర్ల ఇళ్లలో పనులు చేసేవారు. మురుకులు, చెక్కల వంటి తినుబండారాలు చేసి అమ్మేవారు. ఆ సంపాదనతోనే కూతురు జయలక్ష్మిని, కొడుకు మహేశ్‌ని.. ఇద్దర్నీ ఎంఎ. ఎంఈడీ చదివించారు. ‘గోల్డెన్’ స్టూడెంట్! విశ్వోదయ గర్ల్స్ స్కూల్‌కి 2005లో స్వర్ణోత్సవాలు జరిగాయి. ఆ స్వర్ణోత్సవాలు స్కూల్కనే అనుకున్నారు అప్పటికందరూ. అవి రామసుబ్బమ్మ జీవితాన్ని మలుపు తిప్పుతాయని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. చివరికి ఆమె కూడా. స్వర్ణోత్సవాల ఏర్పాట్ల గురించి టీచర్లు మాట్లాడుకోవడం విని, తాను కూడా ఆ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్‌నని, అందులో జరిగే ఆటలపోటీల్లో తాను పాల్గొనవచ్చా అని అడిగారు. అలా మొదలైన రామసుబ్బమ్మ పరుగు పన్నెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలతో నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు మాత్రమే పరిమితమైన ఆమె తొలిసారిగా విదేశాల్లో పోటీలకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అథ్లెట్‌గా తన కెరీర్ ఎలా ప్రారంభమైందీ, ఎలా కొనసాగుతోందీ వివరంగా చెప్పారు రామసుబ్బమ్మ. ‘‘విశ్వోదయ స్వర్ణోత్సవాలు జరుగుతున్నప్పుడు పరుగుపందెంలో పాల్గొని గెలిచాను. అప్పుడు కూడా పోటీలకు బయటకు వెళ్లాలనుకోలేదు. ఆ తర్వాత ఒకసారి నెల్లూరు నుంచి కావలికి రైల్లో వస్తున్నప్పుడు కోటేశ్వరమ్మ, రాజేశ్వరి అనే ఇద్దరు అథ్లెట్లు ఆటల పోటీల గురించి మాట్లాడుకుంటున్నారు. నన్ను పరిచయం చేసుకుని ఆ పోటీలకు నేనూ రావచ్చా అని అడిగాను. అప్పటి నుంచి ఆటల పోటీలకు వాళ్లు వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్లడం మొదలు పెట్టారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు బంగారు పతకాలు, విజయనగరం జిల్లా ఎస్‌కోటలో మూడు బంగారు పతకాలు, నాసిక్‌లో రజతాలు తెచ్చుకున్నాను. పుట్టినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పని చేయకుండా కూర్చున్న ఒళ్లు కాదు నాది. ఎంత పనినైనా అవలీలగా చేసేస్తాను. అలాంటిది నాకు పరుగెత్తడం ఒక లెక్క కానే కాదు. నాసిక్‌లో బంగారు పతకంతో వస్తానని మా జనతాపేట వాళ్లంతా అనుకున్నారు. పోటీలకు వెళ్లడానికి వాళ్లలో కొందరు నాకు డబ్బు సాయం కూడా చేశారు. అయితే నాకు భాష రాకపోవడంతో నిర్వాహకులు చెప్పిన సూచనలు అర్థం చేసుకోలేకపోయాను. పక్క వాళ్లు పరుగు ప్రారంభించడం చూసి నేను పరుగందుకున్నాను. అప్పటికే కొంత ఆలస్యం అయిపోయింది. స్వర్ణం జారిపోయింది. రజతంతో వచ్చాను. కావలికి వచ్చిన తర్వాత నన్ను పంపించిన వాళ్లందరూ ‘అయ్యో’ అన్నారు. నేను అధైర్యపడకుండా ఉండడానికి ‘రజతం అయినా తక్కువా! భాష తెలియని చోటుకెళ్లి సాధించావ’న్నారు. కానీ నాకు మాత్రం కొరత ఉండిపోయింది. మళ్లీ అదే నాసిక్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్’ నాలుగు కేటగిరీల్లో బంగారు పతకాలు తెచ్చుకున్న తర్వాత ఆ కొరత తీరింది. ఊరు సన్మానించింది రెండేళ్ల క్రిందట థాయ్‌లాండ్‌లో పోటీలకు వెళ్లడానికి అవకాశం వచ్చింది. నాకు ఎవరో ఒకరు సర్దేవాళ్లేమో, కానీ నాతోపాటు పోటీలకు వచ్చే వాళ్లకు డబ్బు సర్దుబాటు కాక మానుకున్నారు. దాంతో నేనూ వెళ్లలేదు. ఈసారి శ్రీలంక వెళ్తున్నాం. బంగారు పతకాలతో తిరిగొస్తాననే నమ్మకం నాకుంది. గత డిసెంబర్లో మా కావలి పట్టణంలో పెద్దవాళ్లు కొంతమంది కలిసి నాకు సన్మానం చేసి, ‘కావలిరత్న’ అనే బిరుదునిచ్చారు. ఓపికున్నంత కాలం పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించారు. నేను పరుగెత్తగలిగినన్ని రోజులు ఈ పరుగు ఆపను. ఓపిక తగ్గిన తర్వాత జావెలిన్ త్రో కి వెళ్తాను. జావెలిన్ త్రో ప్రాక్టీస్ త్వరలోనే మొదలు పెడతాను. పని చేస్తూనే ఉన్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఏ పనీ లేకుండా గడపలేదు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తర్వాత మా నాన్నతోపాటు నేను కూడా డీఆర్ గారి (విద్యాసంస్థల స్థాపకులు) తోటలో చెట్లకు నీళ్లు పోసేదాన్ని. మా అమ్మ అనారోగ్యం తర్వాత స్కూలు మానేసి పాచి పనులు చేయడం మొదలుపెట్టాను. స్కూలు టీచర్ల ఇళ్లలో పని చేయడంతో నాకు జ్ఞానం అబ్బింది. ‘డబ్బు శాశ్వతం కాదు, జ్ఞానమే శాశ్వతం, జ్ఞానం బతికిస్తుంది, చదువుని నిర్లక్ష్యం చేయకూడదు’ అని టీచర్లు వాళ్ల పిల్లలకు చెప్పడం విని ఇంటి కొచ్చి నా పిల్లలకు పదే పదే చెప్పేదాన్ని. చదువు లేకపోవడంతో బతకడానికి నేను రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను. మీరు చదువుకుంటే చూడాలని ఉందని చెప్పేదాన్ని. వాళ్లు కూడా అలాగే చదువుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా బతుకు నాదే పిల్లలిద్దరికీ మంచి జీతాలు వస్తున్నా నేను, మా ఆయన వాళ్ల సంపాదన మీద ఆధారపడలేదు. ఈ మధ్య వరకు మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో కస్తూరి, నందివర్ధనం, మల్లెపూలు, కనకాంబరాల పూల చెట్లు పెంచి, పూలు అమ్మేదాన్ని. ఇల్లు కట్టుకోవడానికి నేలంతా చదును చేసి మొక్కలు తీసేశాం. ఇప్పుడు కూడా నన్ను ఏదో ఒక పనికి పిలుస్తూనే ఉంటారు. ఆరోగ్యం బాగలేని పెద్ద వాళ్లను చూసుకోవడానికి పిలుస్తుంటారు. వాళ్లకు పసిబిడ్డకు చేసినట్లు అన్ని పనులూ చేస్తాను. పరుగెత్తలేని రోజు, పని చేయలేని రోజు నా జీవితంలో రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని ముగించారు రామసుబ్బమ్మ. అల్లుడినీ ప్రోత్సహించారు ఏ తల్లయినా, తండ్రయినా తమకు పుట్టిన పిల్లల భవిష్యత్తు మీద కలలు కంటారు. వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. కానీ రామసుబ్బమ్మ అల్లుడిని, కోడలిని కూడా చదివించింది. ఎం.ఎ, ఎంఈడీ చదివిన కూతుర్ని పదవ తరగతితో చదువాపేసి పనులు చేసుకుంటున్న కుర్రాడితో పెళ్లి చేసింది. ‘నీ భార్య ఇంత చదువుకుంది, నువ్వు కూడా చదువుకో’ అని అల్లుడు చెంచయ్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చేరే వరకు ఊరుకోలేదు. అతడు బి.ఎ, ఎం.ఎ పూర్తి చేసిన అతడిప్పుడు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ పిహెచ్డీ చేస్తున్నారు. అలాగే కోడలు మహేశ్వరి చేత పెళ్లయిన తర్వాత బీఈడీ చేయించారు. ఇప్పుడామె హిందీ టీచర్. మనిషికి జీవితాన్నిచ్చేది జ్ఞానమేననే ఆమె ఫిలాసఫీని పిల్లల ద్వారా నిరూపించుకున్నారామె. అలాగే ఆమెకి మిగిలి ఉన్న విదేశీ బంగారు పతకం కల కూడా నెరవేరాలని కోరుకుందాం. – వాకా మంజులారెడ్డి -
హంతకులెవరు?
– వీడని రిటైర్డ్ ఎంపీడీఓ రామసుబ్బమ్మ హత్య మిస్టరీ – ఎనిమిది నెలలైనా ముందుకు సాగని దర్యాప్తు అప్పట్లో తమ పరిధి కాదంటే తమది కాదని కేసు నమోదుకే తాత్సారం చేసిన పోలీసులు దర్యాప్తులోనూ స్తబ్దుగా ఉన్నారు. హతురాలి తరఫు నుంచి అడిగేవారు లేకపోవడంతో ఏమాత్రమూ కేసులో పురోగతి లేదు. కేసును మూసివేస్తారా.. లేక మిస్టరీని ఛేదించి హంతకులను పట్టుకుంటారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు ఏం జరిగిందంటే.. రామసుబ్బమ్మ యాడికి ఎంపీడీఓగా పని చేస్తూ 2014లో రిటైర్డ్ అయ్యారు. ఆమెకు భర్త లేరు. కూతురు శైలజ వివాహం కావడంతో మెట్టినింటికి వెళ్లిపోయింది. రామసుబ్బమ్మకు అనంతపురం నగర శివారులోని విద్యారణ్యనగర్‌లో సొంతిల్లు ఉంది. ఒక పోర్షన్లోæ ఆమె ఉంటుండగా, మరో పోర్షన్ అద్దె కిచ్చారు. 2016 మార్చి 24న రాత్రి నుంచి రామసుబ్బమ్మ ఇంట్లో టీవీ బాగా సౌండుతో ఆన్‌లో ఉంది. మరుసటి రోజు ఉదయం పక్కపోర్షన్లో ఉన్న వారు మోటార్ ఆన్ చేసేందుకని రామసుబ్బమ్మ ఉంటున్న పోర్షన్ వెనుకవైపునకు వెళ్లారు. మోటార్ ఆన్‌చేసి కిటికీలోనుంచి ఇంట్లోకి తొంగిచూడగా...రామసుబ్బమ్మ విగతజీవిగా పడి ఉంది. వెంటనే మృతురాలి బంధువులకు సమాచారం తెలియజశారు. వారు వచ్చి లోపలికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. రామసుబ్బమ్మ నోరు, ముక్కు భాగాల్లో తీవ్ర రక్తస్రావమైంది. ముందు రోజు (24వ తేదీ) సాయంత్రమే హత్య జరిగి ఉందని పోలీసులు నిర్ధారించారు. ఎవరి పని..? రిటైర్డు ఎంపీడీఓ రామసుబ్బమ్మది ఎవరికీ హాని చేసే మనస్తత్వం కాదు. ఇంటికి ఎవరు వచ్చినా... గేటులో నుంచి వారిని చూసి తెలిసినవారైతేనే తలుపు తీస్తుంది. లేదంటే లోపలి నుంచే మాట్లాడి పంపుతుందని స్థానికులు చెబుతున్నారు. మరి ఆ రోజు ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఈ హత్య తెలిసిన వారిపనేనా? లేక నిందితులెవరైనా చాకచక్యంగా లోపలికి ప్రవేశించారా? అన్నది తెలుసుకోలేకపోతున్నారు. మామూలుగా రెండు చైన్లు, చేతివేళ్లకు రెండు ఉంగరాలు, చెవులకు కమ్మలతో కనిపించేది. హత్య జరిగిన రోజు రామసుబ్బమ్మ మెడలో ఎలాంటి బంగారు నగలూ కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే నగల కోసమే ఈ ఘాతుకాని ఒడిగట్టి ఉండవచ్చునని పోలీసుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది. త్వరలోనే ఛేదిస్తాం ఇటీవలే నేను ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నా. ఇప్పటి వరకూ శాంతిభద్రతలను గాడిలో పెట్టడంపై దృష్టి సారించాం. రిటైర్డ్ ఎంపీడీఓ రామసుబ్బమ్మ హత్య కేసును సవాల్‌గా తీసుకుంటున్నాం. త్వరలోనే ఈ కేసులో నిందితులను పట్టుకుంటాం. ఆమె బంధువులు, చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలు సహకరించకపోవడం వలనే దర్యాప్తు ఆలస్యమవుతోంది. - శ్రీరామ్, ఎస్ఐ, నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్, అనంతపురం -
కడుపునొప్పితో మహిళ ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలో నీరుగంటివీధిలో రామసుబ్బమ్మ(47) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వన్‌టౌన్ ఎస్ఐ నాగమధు తెలిపిన వివరాల మేరకు... నీరుగంటివీధిలో శివ అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి భార్య రామసుబ్బమ్మ తరుచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. శనివారం ఆమె కడుప్పునొప్పి తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమధు చెప్పారు. వివాహిత .. అమరాపురం: మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన వివాహిత Ôశృతి (24) పురుగుల మందుతాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త శివకుమార్, ఏఎస్ఐ ఈరన్న తెలిపిన వివరాల మేరకు శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకుచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కర్ణాటక ప్రాంతం తుమకూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ ఈరన్న తెలిపా రు. అయితే ఆత్మహత్యకు గల కార ణాలు తెలియరాలేదు. భర్త శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.