breaking news
Ramakrishna Matam
-
Ramakrishna Math: రామకృష్ణ మఠంలో స్వర్ణోత్సవ సంబరాలు!
హైదరాబాద్: రామకృష్ణమఠం 50 వసంతాలు పూర్తిచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973లో రామ కృష్ణ మఠం స్థాపించారు. దోమల్‌గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. స్వర్ణోత్సవాల సందర్భంగా.. ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద.. మూర్తిత్రయం ఆదర్శాలతో ప్రపంచ వేదికలపై భారతీయతను చాటుతున్న మహోన్నత సేవా సంస్థ రామకృష్ణ మఠం. మానవసేవే.. మాధవ సేవగా ఇటు ఆధ్యాత్మిక సౌరభాలను, అటు సామాజిక సేవను నలుదిశలా వ్యాప్త చేస్తోంది. స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీశ్రీ చండీ హోమం, భజనలు, మ్యూజిక్ కన్సార్ట్, బహిరంగ సభ వంటి ఈ ఆధ్యాత్మిక సంబరాల్లో పాల్గొనాల్సిందిగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధ మయానంద పిలుపునిచ్చారు. ఇవి చదవండి: Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్ -
నా సోదర సోదరీమణులారా...
కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, నిత్యస్మరణీయుడిగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచి ఉన్న భారతీయ ఆధ్యాత్మిక యువకెరటం స్వామి వివేకానంద. ఈ పుణ్యపుడమి ఘనతను తాను గుర్తించడమేగాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను దశ దిశలా చాటిన స్వామి వివేకానంద చెప్పిన మాటలు గుండెలోతుల్లోకి చొచ్చుకొనిపోతాయి. లోకంలో కనిపించే చెడు, దురవస్థ అంతా అజ్ఞానప్రభావమే అని బలంగా విశ్వసించిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా... హైందవ ధర్మ, ఆర్ష సంప్రదాయ బావుటాలను దేశదేశాలలోనూ ఎగురవేసి, భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను నెలకొల్పి ఎందరో విద్యావంతులైన శిష్యులను మానవసేవకు అంకితమయ్యేలా చేసిన ఆ ధన్యమూర్తి జన్మించిన జనవరి 12ను యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా వివేకానందుడు చెప్పిన మంచి మాటలు కొన్ని...ప్రతి ఇంటిని మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపినా, మానవుడి శీలం మార్పు చెందే వరకు అతడి దుఃఖం ఉంటూనే ఉంటుంది. భగవత్సాక్షాత్కారం పొందనంతవరకు నీ మతం నిష్ప్రయోజనమే. ఎవరు మతం పేర కేవలం గ్రంథ పఠనం మాత్రమే చేస్తూ ఉంటారో, వారు చక్కెర బస్తాలను మోసే గాడిద వంటివారు. ఆ గాడిదకు చక్కెర రుచి ఇసుమంతైనా తెలియదు. దానాన్ని మించిన దొడ్డగుణం మరేదీ లేదు. ఇతరులకు ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాచేవాడు మనుష్యుల్లో మహోత్కృష్ట స్థానాన్ని అలంకరిస్తాడు. ఎందుకంటే నీ చెయ్యి ఎల్లప్పుడూ ఇవ్వడం కోసమే రూపొందించబడింది. సమస్త నీతికి, ఆధ్యాత్మికతకు, ఉత్కృష్టతకు జనని భారతదేశం. రుషులు నడచిన దేశమిది. నేటికీ ఇక్కడ దివ్యపురుషులున్నారు. ఆ పుణ్యపురుషుల నుండి దీపాన్ని బదులు తెచ్చుకుని, నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను సోదరా! ఈ విశాల ప్రపంచంలోని పట్టణాలలో, పల్లెల్లో, మైదానాలలో అడవులలో అన్వేషిస్తాను. అంతటి మహానుభావులను మరెక్కడైనా చూపగలరా? భగవదనుగ్రహాన్ని పొందాలంటే, మానవుడు వినిర్మల హృదయుడై ఉండాలి. ఆ నిర్మలత్వం శీలం వల్లనే సిద్ధిస్తుంది.ఆధ్యాత్మిక ధర్మం పుస్తకాలలో లేదు. సిద్ధాంతాల్లో లేదు. విధివాక్యాలలో లేదు. ఉపన్యాసాలలో అంతకన్నా లేదు. తర్కంలో అసలే లేదు. అది ఒక స్థితి. ఆ స్థితి ఒక్క సిద్ధులలోనే ఉంది. ఆ సిద్ధులు ఎవరో కాదు, మీరే! ఆ సిద్ధి పొందాలంటే, మీలో ప్రతివారూ రుషిౖయె, ఆధ్యాత్మిక సత్యాలను ప్రత్యక్షం చేసుకునే వరకు, మీకు ఆధ్యాత్మిక జీవనం ఆరంభం కానట్లే. అతీంద్రియ దశ మీకు కలిగేవరకు ఆధ్యాత్మిక జీవనమనేది వట్టి అర్థంలేని మాట. మీరు భగవంతుని తెలుసుకొన్నప్పుడు మీ ముఖ వర్ఛస్సు మారుతుంది. మీ కంఠస్వరం మారుతుంది. మీ ఆకారమంతా మారుతుంది. మీరు మానవజాతినే ఉద్ధరించేవారవుతారు. రుషికి ఎవరూ ఎదురు లేరు. ఎవరూ ఎదురు నిలవలేరు. రుషిత్వమంటే అదే మరి. అది మన జాతికి పరమావధి. మన ఉపనిషత్తులలోనూ, శాస్త్రాలలోనూ, పురాణాలలోనూ దాగిన మహాద్భుత సత్యాలను వెలికి లాగాలి. మఠాల నుండి వాటిని బయటకు తీయాలి. అరణ్యాల నుండి తరలించుకు రావాలి. ప్రత్యేక వర్గాల అధీనం నుండి వాటిని గుంజుకు రావాలి. అవి దేశమంతటా– ఆసేతు హిమాలయ పర్యంతం దావానలంగా వ్యాపించడానికి మనం పూనుకుంటే కార్యం సాధించామన్నమాటే. ఈ సత్యాలను మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. వాటిని ప్రజలకు మొట్టమొదట వివరించాలి. నేడు దీనికి మించిన సత్కర్మ మరొకటి లేదు. కర్మలలో దాన కర్మ ఒక్కటే గొప్పది. అన్ని దానాలలోనూ ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్ఠమైనది. భారతీయుడు నా సోదరుడు! భారతీయుడే నా ప్రాణం! భారతదేశపు దేవీదేవతలే నా ఆరాధ్యదైవాలు; భరతభూమి నా చిన్నప్పటి ఊయల, పడచుదనపు పూదోట, వార్థక్యపు వారణాసి అని గర్వంగా పలకండి. కష్టాలనే అభేద్యమైన అడ్డుగోడల్ని చీల్చుకొని ముందుకు సాగేది, సచ్ఛీలంతో శక్తిని సంతరించుకున్న సంకల్ప బలమే కానీ ధనం, పేరు ప్రతిష్ఠలు, పాండితీ ప్రకర్షలు కావు. ఓటమిలేని జీవితం ఉండదు. పరాజయం పలకరించని ప్రభువుండడు. జీవితానికి మెరుగులు దిద్దేది ఓటమే!తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడుసేవకుడిగా ఉండడం అలవరచుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. ఇరవై వేల టన్నుల వ్యర్థమైన మాటలకన్న ఇసుమంత ఆచరణ మిన్నలక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాసక్తుల్ని లక్ష్యసాధనలో సైతం చూపినప్పుడే విజయం వరిస్తుంది.నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనమవుతుంది. స్వామి వివేకానంద పలుకులన్నీ కలకండ పలుకులలా తియ్యగా ఉండకపోవచ్చు కానీ, మనలోని అనారోగ్యాన్ని నయం చేసి, ఆరోగ్యాన్ని చేకూర్చేది చేదు గుళికలేనని మరచిపోకూడదు. ఆయన మాటలు వెన్నలా మెత్తగా ఉండకపోవచ్చు కానీ, కొండరాళ్లను పిండి చేసేది ఇనుప పలుగేనని గుర్తుపెట్టుకుని, ఆ మాటల స్ఫూర్తిని మనసులో నింపుకుని ముందుకు సాగిపోవాలి. -
కదిలిన మనసులు
రంగారెడ్డి జిల్లా అడాల్‌పూర్‌కు నీటి ఫిల్టర్ ఇచ్చిన రామకృష్ణ మఠం ‘సాక్షి’ కథనానికి స్పందన యాలాల: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో గ్రామస్తులు పడుతున్న తాగునీటి కష్టాలకు హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం వారు స్పందించారు. రంగారెడ్డి జిల్లాలో కరువు పరిస్థితులపై శనివారం సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘ఇదేం కరువు-మాయమైన చెట్టు చెరువు’ కథ నంపై స్పందించారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అడాల్‌పూర్‌లో గ్రామస్తులు తాగునీటికి పడుతున్న కష్టాలను చూసి మఠం వారు చలించారు. వేసవి కాలం ముగిసే వరకు ఫిల్టర్ నీరు సరఫరాతోపాటు, కాగ్నా నదిలో రూ.5 లక్షలతో బావి ద్వారా నీరందించేందుకు తీసుకుంటామని చెప్పారు. రామకృష్ణ మఠం ప్రతినిధి స్వామి పూర్ణ బోధానంద మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. నీళ్ల విషయంలో ప్రతిఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి నీటిబొట్టును ఆదా చేసుకునేందుకు ఇంకు డు గుంతలు తవ్వాలన్నారు. అడాల్‌పూర్ గ్రామంతోపాటు మండలంలోని రేళ్లగడ్డతండాకు వాటర్ బాటిళ్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు.