breaking news
Ramagundam Project
-
వన భోజనాల్లో విషాదం
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలు ఉత్సాహంగా వన భోజనాలకు వెళ్లాయి. వనభోజనాలకు వెళ్లినవారు గ్రామ శివారులోని రామడుగు ప్రాజెక్టు్ట వద్ద ఆనందంగా గడిపారు. ఇంతలోనే అనుకోని విషాదం నెలకొంది. భోజనాల అనంతరం పక్కనే ఉన్న రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ నీటిలో సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు నీట మునిగి మృతి చెందారు. డిచ్పల్లి తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దులం గ్రామానికి చెందిన పలు కుటుంబాల వారు వన భోజనాలకు పక్కనే గల రామడుగు ప్రాజెక్టు వద్దకు తరలివెళ్లారు. భోజనాల అనంతరం గ్రామానికి చెందిన కల్లెడ నిఖిలేందర్‌రెడ్డి(21) మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొడదామని ప్రాజెక్టు కాలువ నీటిలోకి దిగాడు. కొద్ది సేపటికే నీళ్లలో మునిగి పోయాడు. ఆందోళనకు గురైన మిగిలిన యువకులు ఈ విషయాన్ని వారి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకుని నీటిలో గాలించగా మృతదేహం లభించలేదు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్సై సురేశ్‌కుమార్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. రామడుగు గ్రామానికి చెందిన గజఈతగాడు రమేశ్ అతని బృందం సభ్యులను పిలిపించారు. రమేశ్ బృందం కాలువ నీటిలో సుమారు రెండు గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కల్లెడ ప్రభాకర్‌రెడ్డి, విజయ దంపతులకు నిఖిలేందర్‌రెడ్డితో పాటు కూతురు ఉన్నారు. నిఖిలేందర్‌రెడ్డి ప్రస్తుతం సీఏ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం అందాలి
► ఉద్యమాలతోనే హక్కులు సాధ్యం ► కార్మికుల దీక్షలకు బీజేపీ మద్దతు ► కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం యాజమాన్యం ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి పి.సుగుణాకర్‌రావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల రిలేదీక్షలకు గురువారం సంఘీభావం ప్రకటించారు. కార్మిక సంఘాల నాయకులు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగి హక్కులు సాధించుకోవాలని సూచించారు. అన్ని పార్టీల నాయకులు జెండాలను పక్కన బెట్టి ఒకే అజెండాతో కార్మికుల పక్షాన నివాలని కోరారు. ఒకే కంపెనీలో చేస్తున్న కార్మికులకు అలవెన్సుల చెల్లింపులో తారతమ్యం తగదన్నారు. కనీసవేతనాలను చెల్లింపునకు కేంద్ర బండారు దత్తాత్రేయకు సమస్యను విన్నవించి పరిష్కరించేందుకు తనవంతు పాటుపడతానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు బీ–కేటగిరీ వేతనాలు చెల్లించాలని సూచించారు. కార్మిక సంఘాల నాయకులు ఏకపక్షంగా ఉండి సమస్యలను వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిష్కరించాలని కోరారు. యూనియన్ నాయకులు బాబర్‌సలీంపాషా, బడికెల రాజలింగం, కౌశిక హరి, మనోహర్‌రావు, చందర్, అహ్మద్‌బాబా, గాండ్ల ధర్మపురి, నాంసాని శంకర్, బుచ్చయ్య, రామాచారి, గీట్ల లక్ష్మారెడ్డి, వెంగల బాపు, బొద్దున రాజేశం, బాల్రాజ్కుమార్, నాయకులు పాల్గొన్నారు. దీక్షలకు తెలంగాణ జేఏసీ మద్దతు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల దీక్షలకు తెలంగాణ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గురువారం టీజేఏసీ నాయకులు జేవీ.రాజు, పొన్నం విజయ్, కానుగంటి శ్రీనివాస్, వేముల అశోక్ శిబిరాన్ని సందర్శంచారు. త్వరలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం రానున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ దీక్షలో ఉన్న కాంట్రాక్టు కార్మికులు మద్దతు తెలిపారు. ముగిసిన టూల్ డౌన్ సమ్మె.. కాంట్రాక్టు కార్మికులు రిలేదీక్షలకు మద్దతుగా ప్రాజెక్టులో చేస్తున్న టూల్‌డౌన్ సమ్మె ముగించి విధులకు హాజరయ్యారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కోరిన వారం రోజుల గడువుకు యూనియన్ నాయకులు అంగీకారం తెలిపారు.