breaking news
Rajiv Gandhi National Fellowship
-
ఇంకెప్పుడో?
పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల నిరీక్షణ ఆర్‌జీఎన్‌ఎఫ్, ఎంఫిల్, ఇతర ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాకపోవడంతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. కేయూ క్యాంపస్ : పీహెచ్‌డీలో ప్రవేశాలకు మార్గదర్శకాల కోసం కొన్ని నెలల క్రితమే ప్రొఫెసర్లతో కూడిన ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి నివేదిక ను యూనివర్సిటీ అధికారులకు ఇచ్చింది. ఆ తర్వాత పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం వివిధ విభాగాల నుంచి ఎన్నిసీట్లు ఉన్నాయో అన్ని విభాగాల అధిపతుల నుంచి సమాచారం సేకరించారు. ఇక పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు పలు అభ్యంతరాలతో యూనివర్సిటీ అధికారులు మళ్లీ మరో కమిటీని ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించారు. అందులో ప్రధానంగా ఇప్పటికే రాజీవ్గాంధీనేషనల్ ఫెల్లోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్) కలిగిన అభ్యర్థులకు పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు కల్పించాలా వద్దా అనే విషయంలో ఆ కమిటీ వేశారు. కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ ఎం.సుబ్రహ్మణ్యశర్మ చైర్మన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా డాక్టర్ జి.బ్రహ్మేశ్వరితోపాటు మరో నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ నియమించారు. ఆ కమిటీ యూజీసీ నియమనిబంధనలు, ఇతర యూనివర్సిటీల్లో ఆర్‌జీఎన్‌ఎఫ్ అభ్యర్థులకు అడ్మిషన్ల కల్పిస్తున్న అంశాలను పరిశీలించి నివేదికను ఈ ఏడాది ఏప్రిల్ 28న యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఆర్జీఎన్ఎఫ్తోపాటు జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, డీఎస్టీ తదితర ఫెల్లోషిప్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఎంట్రె న్‌సతో సంబంధం లేకుండా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని ఆ కమిటీ నివేదించింది. ఫెల్లోషిప్ కలిగిన అభ్యర్థులకు త్రిసభ్య కమిటీతో ఇంటర్వ్యూలు నిర్వహించి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వివిధ ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థులకు పలు విభాగాల్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ప్రవేశాలు కల్పించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ విభాగంలో ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. ఆయా అభ్యర్థులు యూనివర్సిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రెగ్యులర్ వీసీ ఉన్నా.. పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశపరీక్ష ద్వారా కూడా పీహెచ్‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. నెలలు గడిచినా పీహెచ్డీ ప్రవేశాల పరీక్షకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇన్చార్జి వీసీల పాలనలో పీహెచ్‌డీల ప్రవేశాల నోటిఫికేషన్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు కేయూ రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ ఆర్.సాయన్న బాధ్యతలను స్వీకరించారు. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా పలుసార్లు వీసీకి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. తగ్గనున్న సీట్లు.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి పలు విభాగాల్లో సీట్లు తగ్గే అవకాశాలున్నారుు.మరికొన్నింట్లో పెరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే. ఆర్‌జీఎన్‌ఎఫ్ తదితర ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థుల ప్రవేశాలు పూర్తయ్యాక మళ్లీ వేకెన్సీలు సేకరిస్తారని సమాచారం. దీంతో పీహెచ్డీ నోటిఫికేషన్ ఇంకా జాప్యం కానుందని భావిస్తున్నారు. పీహెచ్డీ సీట్ల వేకెన్సీలు ఇవే.. కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ సీట్ల ఖాళీల వివరాలు ఇలా ఉన్నారుు. బాటనీ 18, బయోకెమిస్ట్రీ 7, కెమిస్ట్రీ 13, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 38, కంప్యూటర్ సైన్స 4, ఎకనామిక్స్ 13, ఇంగ్లిష్ 18, ఎడ్యుకేషన్ 8, జియాలజీ 1, హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 4, మ్యాథమెటిక్స్ 8, మైక్రోబయాలజీ 9 ,ఫిజిక్స్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 6, పొలిటికల్ సైన్స 12, ఫార్మసీ 16, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం 3, సోషియాలజీ 15, తెలుగు 11, జువాలజీ 18, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం 11, మెకానికల్ ఇంజనీరింగ్ 23, కంప్యూటర్ సైన్సలో 9, ఎలక్టిక్రల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్స 5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్సలో 4 సీట్లు ఉన్నారుు. వివిధ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశాల పూర్తయ్యాక ఆయా విభాగాల్లో మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఆయా విభాగాల్లో సీట్లు తగ్గిపోనున్నాయి. కొన్నింట్లో అసలే ఖాళీలు ఉంటాయో లేదో అనేది కూడా అనుమానమే. ప్రవేశ పరీక్షలతోనే జాప్యం.. పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఒకప్పుడు రెండు ఆర్టికల్స్ ఉంటే పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇచ్చేవారు. ప్రతి ఆరునెలలకోసారి పీహెచ్‌డీలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేవారు. ప్రవేశ పరీక్షలు వచ్చాక అనేక కారణాలతో సంవత్సరాల తరబడి జాప్యం అవుతోంది. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాల బాధ్యులు ఆందోళనలు చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలంగా వివిధ విభాగాల్లో సీనియర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందడం వలన కూడా పీహెచ్‌డి వివిధ విభాగాల్లో సీట్లు తగ్గిపోతున్నాయి.జాప్యం కావడంతో ఇంకా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. -
మౌనంగానే ఎదిగాడు
‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది...’ అనే పాటలోని వాక్యాన్ని అక్షరాలా నిజం చేశాడు ఆ యువకుడు. అతడు పుట్టిన మూడేళ్లకే తల్లి కన్నుమూసింది. వేలు పట్టి నడిపిస్తాడనుకున్న నాన్న ఐదో ఏటే దూరమయ్యాడు. ఆసరాగా ఉంటారనుకున్న అన్నలూ మద్యానికి బానిసలై కాలం చేశారు.. ఓ బాలుడికి కళ్లముందే ‘నా’ అనుకున్న వాళ్లందరూ దూరమయ్యారు. బంధువులు చేరదీయలేదు.. తినడానికి తిండి లేదు.. ఒంటిమీద సరైన దుస్తులూ లేవు.. పనిచేసి సంపాదించే వయసూ కాదు.. పట్టించుకునే దిక్కులేదు. అలాంటి స్థితి నుంచి ఆ కుర్రాడు కష్టాలకు ఎదురీదాడు. దారి తెలియని వయసులోనే తనకు తానే మార్గనిర్దేశం చేసుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదివే స్థాయికి ఎదిగాడు. కాలం చేసిన గాయాలను తట్టుకుని నిలిచిన ఆ యువకుడి పేరు వెంకటేశ్ చౌహాన్. ఇటీవల రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. బుధవారం జరగనున్న హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా అందుకోనున్న వెంకటేశ్‌పై ప్రత్యేక కథనం... నల్గొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో 1989లో వెంకటేశ్ చౌహాన్ జన్మించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన అన్నలను కోల్పోయాడు. దీంతో కాలమే వెంకటేశ్‌ను చేరదీసింది. సమాజమే బతుకు పాఠాలు నేర్పింది. ఐదో తరగతి వరకు కూచిపూడి తండా, రామాపురంలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఇంటర్ వరకు కోదాడలో విద్యాభ్యాసం సాగింది. 8వ తరగతిలో ఉండగా చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆకలితో ఉన్న వెంకటేశ్ కోదాడ సమీపంలో ఉన్న అరుణాచలం ట్రాన్స్‌పోర్టు వద్ద నిల్చొని ఓ లారీని ఆపాడు. నన్ను పనిలోకి తీసుకోండన్నా, ఆకలిగా ఉందంటూ అడగడంతో వారు కాదనలేక పోయారు. క్లీనర్ నుంచి పీహెచ్డీ వరకు.. వెంకటేశ్ రాత్రంతా లారీ క్లీనర్‌గా పనిచేస్తూ, ఉదయం పాఠశాలకు వెళ్లే వాడు. 9వ తరగతిలో కోదాడలోని ఓ హోటల్లో పాత్రలను కడిగే పనికి కుదిరాడు. అలా సంవత్సరం నెట్టుకొచ్చాడు. 10వ తరగతి నుండి ఇంటర్ దాకా ఎస్టీడీ బూత్ బాయ్‌గా, పండ్లు అమ్మే వ్యక్తిగా పనిచేస్తూ వచ్చాడు. మిత్రుల సహకారంతో డిగ్రీ కోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు సంపాదించాడు. ఉదయం తరగతులు వినటం రాత్రి అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం చేసేవాడు. ఇలా పనులు చేయగా వచ్చిన డబ్బుతోనే జీవన ప్రయాణం సాగించేవాడు. అయితే ఏనాడు చదువును అశ్రద్ద చేయలేదు. ప్రతినిత్యం బతుకు పోరాటంలో ఎదుర్కొంటున్న సమస్యల ముందు చదువు ఎప్పుడూ కష్టమనిపించలేదు. చిన్ననాటి నుంచీ ప్రథమ శ్రేణిలోనే ఉత్తర్ణుడవుతూ వచ్చాడు. ప్రొఫెసర్ సహకారంతో.. ఓ సెమినార్లో ఉపన్యాసం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సూర్య ధనుంజయ్‌ని కలిసి తన పరిస్థితిని వివరించాడు. చలించిన ఆ ప్రొఫెసర్ దుస్తులు, పుస్తకాలు ఇచ్చి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సిద్దం చేశారు. దాంతో వెనుతిరగకుండా 2010లో హెచ్‌సీయూ ఎంఏ తెలుగులో సీటు సాధించి కృతజ్ఞత చాటుకున్నాడు. పీజీ పూర్తికాగానే రీసెర్చ్ ఫెలోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్)కు ఎంపికై, ఎంఫిల్ అదే యూనివర్సిటీలో పూర్తి చేశాడు. హెచ్‌సీయూ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో ‘మత్తడి కవిత సంకలనం’పై పరిశోధన పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో పీహెచ్డీ ద్వితీయ సంవత్సర విద్యార్థిగా కొనసాగుతున్నాడు. నేడు పట్టా ప్రదానం ‘మత్తడి కవిత సంకలనం’పై చేసిన పరిశోధనకుగాను వెంకటేశ్‌కు సెంట్రల్ యూనివర్సిటీ పట్టాను అందించనుంది. ఇన్నాళ్లుగా తాను పడ్డ కష్టాలను పట్టా అందుకుని మరిచిపోతానని వెంకటేశ్ చెబుతున్నాడు. అనాథనని బాధ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే.. కష్టాలు కూడా తలవంచి విజయాన్ని అందిస్తుందని వెంకటేశ్ నిరూపించాడు. చదువులోనే కాక ఉత్తమ మిమిక్రీ కళాకారుడిగా, గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. భవిష్యత్తులో అనాథాశ్రమం స్థాపించి తనలాంటి వారికి సాయపడాలన్నదే తన లక్ష్యమని వెంకటేశ్ చెమర్చిన కళ్లతో తన గతాన్ని.. మనోగతాన్ని చెప్పుకొచ్చాడు.