breaking news
Rajayyapeta
-
రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామస్తులకు బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడుచుగా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రాగానే ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ మండిపడ్డారు.బల్క్ డ్రగ్ పార్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజయ్యపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నికలకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హితవు ç³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మత్స్యకారులకు బాసటరాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్యకారులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మత్స్యకారులను కలిసి బాసటగా నిలిచారు.వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకారులు వివరించారు.మాజీ సీఎం వైఎస్ జగన్‌తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన వైఎస్ జగన్ దృష్టికి బల్క్ డ్రగ్ పార్కు సమస్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనేమత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసానిచ్చారు.‘‘ఏ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం’’ అని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై ఎదురుదాడి తగదన్నారు. రాజయ్యపేటలో 3 వేల మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నిరసించారు. రైతులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. అచ్యుతాపురం సెజ్‌లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశామని, రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతులను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.మత్స్యకారులకు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హోంమంత్రి అనిత యత్నిస్తున్నారని విమర్శించారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మత్స్యకారుల అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతుంటుందని చెప్పారు. -
త్వరలో రాజయ్యపేటకు వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది. బుధవారం వైఎస్సార్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్‌కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేం ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్‌తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా?. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి.... పరిశ్రమలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు?. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. అప్పుడు.. ఇప్పుడు.. మేం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు కానియ్యం’’ అని అన్నారు. త్వరలో జగన్ రాక.. ‘‘మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్‌ను కట్టనివ్వం’’ అంటూ పలువురు బొత్స వద్ద వాపోయారు.ఈ సందర్భంగా మత్స్యకారులున ఉద్దేశిస్తూ బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు. ఈ పోరాటంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను.. జగన్ అధికారంలోకి వచ్చాక తొలగిస్తారు. మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మీకు అండగా మేముంటాం. తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు. మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాం. త్వరలో రాజయ్యపేటకు జగన్ వస్తారు’’ అని బొత్స తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్‌పై..రాజయ్యపేట దీక్షాశిబిరానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే వాటిని దాటుకుని నేతలు అక్కడికి చేరుకున్నారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘‘రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు. కనీస మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది. గ్రామస్తులను ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఏమైనా సంఘ విద్రోహశక్తులా?’’ అని బొత్స నిలదీశారు.