breaking news
rajashekara raju
-
చెరగని చిరస్మృతి అంబేడ్కర్
శాస్త్రీయ దృక్పథం జాతి జీవనంలో భాగం కావాలని కోరుకున్న మాన్యుడు బి.ఆర్. అంబేడ్కర్. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే అపభ్రంశపు వ్యాఖ్యలను ఆయన పుట్టిన గడ్డపైనే చేసే సీఎంలను చూస్తున్నాం. పాలకులు ఆయన సమస్త స్వప్నాలకూ నేడు తూట్లు పొడుస్తున్నారు. కులాల పునాదులను తుదకంటా కదల్చాలని ఒక మహనీయుడు చెప్పిన నేలపై అవే కులాలు వెయ్యి అడుగుల లోతు పునాదిపై దృఢంగా పాతుకునిపోతున్నాయి. సమానత్వాన్ని జాతి జనులు పాడుకునే గీతంగా పరిమళింపజేసే రాజ్య వ్యవస్థను ఆయన కోరుకుంటే, అసమానతలకు ఆజ్యం పోసి నరనరానా కుల స్వభావాన్ని, కులాహంకారాన్ని, కులపీడనను జాతి గుండెల్లో ప్రతిష్టింపజేసే పనిలో పాలకులు మునిగి పోతున్నారు. పౌరుల గౌరవాన్ని పెంచే పాలనను ఆయన కలగంటే పౌరుల సమస్త హక్కులనూ రకరకాల ముసుగులతో తొక్కివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సకల జీవన రంగాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొం దించాలని ఆయన ఆశిస్తే, ఆ భావననే రాజ్యాంగంలోంచి తొలగించే సాహసానికి నేటి పాలకులు పూనుకుంటున్నారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అనే అపభ్రంశపు వ్యాఖ్యలు చేసే ముఖ్యమంత్రులను మనం చూస్తున్నాం. పరిణామవాదమా గాడిదగుడ్డా అంటూ ఎకసెక్కాలు చేసే కేంద్ర మంత్రిపుంగవులను చూస్తున్నాం. ఇలా ఒకటేమిటి? అంబేడ్కర్ ఆశయాలను భూస్థాపితం చేసే ప్రయత్నాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇన్ని చేస్తూ కూడా అంబేడ్కర్ మావాడంటే మావాడంటూ పాలకులు ఆయన విగ్రహాలను కౌగిలించుకుంటూ, పంచుకుంటూ బతికేస్తున్న కాలాన్ని మనం చూస్తున్నాం. మోదీ నుంచి చంద్రబాబు దాకా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను తమవాడిగా నిలబెడుతూ ఆయన అసలు అభిమతానికి తూట్లుపొడుస్తూ అంబేడ్కర్ భజన చేయడంలో పోటీ పడుతున్నారా అనిపిస్తోంది. శాస్త్రీయ దృక్పధాన్ని సకల జీవన రంగాల్లోనూ పెంపొందించాలని ప్రగాఢంగా కాక్షించి, ఆ భావనను భారత రాజ్యాంగంలో పొందుపర్చిన మాన్యుడు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి నేడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు శాస్త్రీయ చింతనపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా, శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించాలనే డిమాండుతో ఏర్పడిన ’గ్లోబల్ మార్చ్ ఫర్ సైన్స్’ డే కూడా ఇదే రోజు రావడం కాకతాళీయమే కావచ్చు. ఏడు దశాబ్దాల క్రితం అంబేడ్కర్ జాతి చైతన్యంలో భాగం కావాలని ఆశించిన శాస్త్రీయ చింతన నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది శాస్త్రజ్ఞుల సామూహిక వాణిగా రూపొందుతుండగా, పాలకులు మాత్రం పరిణామవాద వ్యతిరేక సిద్ధాంతాలకు, ఆధ్యాత్మక భావజాలానికి ప్రాధాన్యతనిస్తూ సమాజంలో శాస్త్రీయ దృక్పథానికి మంగళం పలుకుతున్నారు. అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతాం అంటూ ప్రధాని నరేంద్రమోదీ నాలుగేళ్లుగా ప్రతి సందర్భంలోనూ చాటిచెబుతున్నారు. అదే సమయంలో ఇప్పటి విమానం కంటే ముందే భారత దేశంలో పుష్పక విమానం ఉండేదని, వినాయకుడికి ఏనుగుతల పెట్టడం ద్వారా ఆనాడే ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయని మన వేదాలు చెబుతున్నాయంటూ సైన్స్ మహాసభల్లోనే ఆయన మాట్లాడి, వందలాది శాస్త్రజ్ఞుల సమక్షంలోనే శాస్త్రీయ దృక్పధాన్ని అపహాస్యం చేశారు. సాక్షాత్తూ ప్రధాని ఆలోచనలే ఇలా ఉంటే తామేం తక్కువ తినలేదన్నట్లుగా కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్.. చార్లెస్ డార్విన్ సూత్రీకరించిన పరిణామవాదాన్నే అశాస్త్రీయం అనేశారు. ఒక కోతి మనిషిగా మారడాన్ని ఎవరూ చూడలేదంటూ ఎద్దేవా చేశారు. ఇక కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ మరో ఎత్తుకు వెళ్లి ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కంటే ఉత్తమమైన సిద్ధాంతం వేదాల్లోని ఉన్నట్లుగా స్టీఫెన్ హాకింగ్ వంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్త పేర్కొన్నారంటూ వివాదానికి తెరలేపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు తమ వ్యక్తిగత విశ్వాసాలను, నమ్మకాలను పాలనలో భాగం చేస్తూ శాస్త్ర చింతన, శాస్త్హీయ దృక్పథానికే దూరం జరుగుతున్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలకు అడుగడుగునా తూట్లు పొడుస్తూ, ధిక్కరిస్తూ ఫిరాయింపుల సంస్కృతిని బలపర్చడంలో తెలుగు పాలకులు పోటీ పడ్డారు. అటు తెలంగాణ, ఇటు ఏపీలో డజన్ల సంఖ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపచేశారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఫిరాయింపచేయడం ద్వారా చంద్రబాబు ఆయారాం గయారాం సంస్కృతిని కొత్తపుంతలు తొక్కించారు. వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. పైగా, ఎవరయినా దళితులుగా పుట్టాలనుకుంటారా అంటూ ఏపీ సీఎం దేశంలో దళితుల పుట్టుకను, ఉనికినే ప్రశ్నార్థకం చేసి అవమానించేశారు. అన్నిటికీ మించి ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ తదితర పార్టీలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకే రాకుండా పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయడం రాజ్యాంగ స్ఫూర్తి ఉల్లంఘనకు పరాకాష్ట. ఈ నేపథ్యంలో అంబేద్కర్ నిజమైన వారసత్వం ఏమిటి అనే ప్రశ్న వేసుకోవాలి. మనుషులు మనుషులకే కానీ దేవుడి పాదాల నుంచి జన్మించలేదంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళల సాధికారత అవసరమంటూ విస్తారంగా రచనలు చేశారు. ప్రధానంగా హిందూ లేక ఇతర మత ఆధారిత జాతి భావనను అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథం అనే పదాన్ని చేర్చడంలో అవిరళ కృషి చేశారు. ప్రజాస్వామ్యం అనేది అంబేడ్కర్ ప్రతి భారతీయుడికి అందించిన వెలలేని కానుక. కానీ, హిందూ కోడ్ బిల్లును జనసంఘ్ తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగానే అంబేడ్కర్ తన పదవికి రాజీ నామా చేయాల్సి వచ్చిందన్న విషయం మరవరాదు. విజ్ఞానంతో సూర్యుళ్లనే మండించాలని అంబేడ్కర్ కాంక్షించారు. కానీ అజ్ఞానంతో, అశాస్రీయ భావాలతో వెలుగును, పురోగతిని ఆపాలని నేడు పాలకులు ప్రయత్నిస్తున్నారు. పైగా జీడీపీలో శాస్త్ర పరిశోధనా రంగానికి కేవలం 1 శాతం, ఉన్నత విద్యకు 3 శాతం మాత్రమే కేటాయించడం ద్వారా పాలకులు సైన్స్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. అధికార స్థానాల్లోని ప్రముఖులు, ప్రయోజన బృందాలూ అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నారని, శాస్త్ర పురోగతి విషయంలో భారత్ నిజమైన దోహదాన్ని మర్చిపోతూ మన ప్రాచీన గతం విషయంలో పరిహాసాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఐఐఎస్ఇఆర్ కొల్‌కతాకు చెందిన ప్రొఫెసర్ సౌమిత్రో బెనర్జీ వ్యాఖ్యానించడం గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా 600 నగరాల్లో భారత్‌లోని 16 ముఖ్య నగరాల్లో వేలాది మంది శాస్త్రజ్ఞులు నేడు శాస్త్ర పరిశోధనల ఆవశ్యకతను ఎత్తిచూపుతూ భారీ ప్రదర్శనలు చేయనున్నారు. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపర్చిన శాస్త్రీయ దృక్పథానికి ఇది నిజమైన నివాళి. పాలకుల అశాస్త్రీయ చింతనకు, తిరోగమన తత్వానికి భిన్నంగా ప్రజానీకం ప్రదర్శించే ఇలాంటి చైతన్యపూర్వక ప్రయత్నాలే అంబేడ్కర్ ఆశయాలకు నిజంగా జీవం పోస్తాయి. (నేడు బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, గ్లోబల్ సైన్స్ మార్చ్ సందర్భంగా) – కె. రాజశేఖర రాజు -
మృతాత్మలను ద్వేషించలేం..!
ఉగ్రవాదులను కనిపిస్తే చాలు నరికిపడేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ద్వేషాన్ని వారికి బహుమతిగా అందివ్వబోమని ప్రకటించడానికి ఎంత సాహసం కావాలి? తమకు తాముగా సృష్టించి వదిలిన భస్మాసురులను మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తున్న పాశ్చాత్య పాలకులకు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచం పట్ల ఎంత మమకారం ఉండాలి? ఉగ్రవాద దాడుల్లో ప్రేమాస్పదురాలైన జీవన సహచరిని అతడు శాశ్వతంగా కోల్పోయాడు. పన్నెండేళ్లపాటు నిస్వార్థంగా ప్రేమను పంచి పెట్టిన అమృతమయమైన ఒక సుకుమార, సున్ని త నిసర్గ సౌందర్యాన్ని అతడు ఉగ్రదాడిలో పోగొ ట్టుకున్నాడు. పారిస్‌లోని బటాక్లాన్ థియేటర్లో, నవంబర్ 17న ఐఎస్ఐఎస్ చేసిన మెరుపుదాడిలో ఒకేచోట 82 మంది తోటి ప్రేక్షకులతోపాటు ప్రాణాలు కోల్పోయిన ఆమెకు కాని, ఆమెను కోల్పోయిన ఆ భర్తకు, వారి నెలల ప్రాయపు చిన్నారి కుమారుడికి కాని ఏ రాజకీయాలూ తెలీవు. తమకు అందుబాటులో ఉన్న జీవితాన్ని కాసింత సంతోషంతో, కాసింత స్వేచ్ఛా స్వాతం త్య్రాలతో గడుపుదామనే చిన్న కోరిక తప్ప వారికి ఈ ప్రపంచంలో పెద్దగా ఆశలూలేవు. కానీ మృత్యువు వికటాట్టహాసం చేసిన ఆ కాళరాత్రి తన నెచ్చెలిని పోగొట్టుకున్న ఆ పౌరుడు జీవితకాల బాధను కూడా దిగమింగుకుని యావత్ ప్రపంచానికీ చిరుసందేశం పంపుతున్నాడు. తన భార్యను చంపిన వారికి తన ద్వేషాన్ని పొందే అవకాశం కూడా ఇవ్వబోనంటూ అతడు చరిత్ర కనీవినీ ఎరుగని తిరస్కార సందేశాన్ని ఉగ్రవాదులకు అందించాడు. ద్వేషంతో కాదు.. ప్రేమతో, వెరపు లేనితనంతో జీవిస్తామంటున్న ఈ సాధారణ పౌరుడు శ్వేతజాతీయుడు కాదు. ఒక పర్షియన్. బతుకు కోసం ఫ్రాన్స్‌ను మాతృదేశంగా చేసుకున్న పరదేశీయుడు. పేరు ఆంటోనె లేరిస్. ఆమె పేరు హెలెన్ ముయాల లేరిస్ (35 ఏళ్లు). ఇద్దరిదీ పన్నెండేళ్ల బంధం. వారికి పదిహేడు నెలల కుమా రుడు మెల్విల్. పారిస్ ఉగ్రదాడిలో సహచరిని కోల్పోయిన మూడు రోజులకు ‘మీరు నా ద్వేషాన్ని కూడా పొందలేరు’ (యు విల్ నాట్ హావ్ మై హేట్రెడ్) అంటూ ఫేస్బుక్లో ఫ్రెంచ్ భాషలో లేరిస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆన్లైన్ పాఠకుల హృదయాలను కదిలిస్తోంది. 129 మందిని బలిగొన్న ఉగ్రవాదు లను ఉద్దేశించి లేరిస్ రాసిన పోస్టును ఇంతవరకు లక్షా పాతికవేలమంది షేర్ చేశారు. అలాగని లేరిస్ ఉపన్యాసాలేవీ దంచలేదు. కేవలం నాలుగు చిన్ని పేరాల స్పందన మాత్రమే ప్రపంచంతో పంచుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంలో తానూ తన కుమారుడు మాత్రమే ఉండొచ్చు కానీ ప్రపం చంలోని అన్ని సైనిక బలగాలకంటే తాము ఇప్పు డు అతిశక్తిమంతులం అంటూ ఉగ్రదాడులను లెక్కచేయనితనంతో ఆ తండ్రి చేసిన పోస్ట్ ఇప్పు డు యావత్ ప్రపంచం ముందూ మన కాలపు ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది. ఉగ్రదాడుల పట్ల లేరిస్ వినిపించిన ఆ మానవ ధిక్కారాన్ని తన మాటల్లోనే విందాం. 'శుక్రవారం రాత్రి మీరు ఒక అసాధారణ మైన జీవితాన్ని (నా జీవిత ప్రేమమూర్తిని, నా కుమారుడి తల్లిని) బలిగొన్నారు. కానీ మీరు నా ద్వేషాన్ని పొందలేరు. మీరెవరో నాకు తెలీదు. నాకు తెలుసుకోవాలనీ లేదు. మీరు మృతాత్మలు.. అంతే. మీరు ఎవరి కోసం గుడ్డిగా మనుషులను చంపుతున్నారో ఆ దేవుడు మమ్మల్ని తన ప్రతి బింబంగా చేసుకున్నట్లయితే మాత్రం.. నా భార్య దేహంలోకి మీరు చొప్పించిన ప్రతి తూటా ఆయన హృదయంలో ఒక్కో గాయమై తీరుతుంది. అం దుకే, నా ద్వేషాన్ని కూడా మీకు నేను దక్కని వ్వను. సరిగ్గా మీరు ద్వేషాన్నే కోరుకుంటున్నారు. కాని ద్వేషం పట్ల ఆగ్రహంతో స్పందించడం అనేది బాధితులను అదే అజ్ఞానంలో పడవేయడంతో సమానం. ద్వేషమే మిమ్మల్ని అలా తయారు చేసింది. మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. నా దేశపౌరుల పట్ల నేను అవిశ్వాసం ప్రదర్శించాలని, నా భద్రత కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయాలని మీరు కోరుకుంటున్నారు. కాని అక్కడే మీరు ఓడిపోయారు. నేను ఆమెను ఇవ్వాళ ఉదయం చూశాను. చివరిసారిగా అంటే రాత్రింబవళ్లు నిరీక్షించిన తర్వాత ఆమెను ఇవ్వాళే చూశాను. శుక్రవారం రాత్రి ఆమె బయటకు వెళ్లినప్పుడు ఎప్పటిలాగే ఆమె సౌందర్యంతో మెరిసిపోయింది. 12 ఏళ్లుగా తన ప్రేమతో నన్ను దాసోహం చేసుకున్న అద్భుత సౌందర్యంతో ఆమె వెళ్లిపోయింది. నిజమే. ఆమెను కోల్పోయిన బాధలో నేను కుప్పగూలిపో వడం నిజమే. మీరు చిన్న విజయం సాధించారని నేను అంగీకరిస్తున్నా. కానీ గుండెను తొలిచివే స్తున్న ఈ బాధ తాత్కాలికమే. ప్రతిరోజూ, ప్రతి క్షణం ఆమె మాతో ఉంటుందని నాకు తెలుసు. మీరు ప్రవేశించలేని ప్రేమాన్విత స్వేచ్ఛా స్వర్గంలో మేం మళ్లీమళ్లీ కలుసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. నేనూ, నా కుమారుడు. కానీ ఒక విషయం మాత్రం చెప్పద ల్చుకున్నా. ప్రపంచంలోని సకల సైనిక బలగాల కంటే మేము శక్తిమంతులం. మీ మీద దృష్టి పెట్టేం త సమయం నాకు ఏమాత్రంలేదు. మా అబ్బాయి మెల్విల్‌ను నేను నిద్రలేపాల్సి ఉంటుంది. అతడి వయసు 17 నెలలు మాత్రమే. అతడు ఎప్పటిలాగే తన ఆహారం తీసుకుంటాడు. ఎప్పటిలాగే మేము కలిసి ఆడుకోవడానికి వెళతాం. ప్రతిక్షణం అణువ ణువునా చెక్కుచెదరని సంతోషాన్ని అనుభవిస్తూ.. ఈ చిన్నారి జీవితాంతం మిమ్మల్ని అవమాని స్తూనే, భయపెడుతూనే ఉంటాడు. ఎందుకంటే, అతడి ద్వేషాన్ని కూడా మీరు పొందలేరు' సేకరణ: కె.రాజశేఖరరాజు