breaking news
Raivada Project
-
రైవాడ కోసం ప్రాణత్యాగానికి సిద్ధం
ప్రాజెక్టు నీటి సాధన కమిటీ హెచ్చరి క ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం కెనాల్‌కు గండ్లు కొట్టేందుకు రైతులు వెనుకాడబోరని స్పష్టీకరణ దేవరాపల్లి: రైవాడ నీటిని రైతులకు అంకితం చేస్తూ జీవో జారీ చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ అల్టిమేటం విధించింది. రైవాడ సాధన కమిటీ ఈ నెల 14 నుంచి చేపట్టిన పాదయాత్ర మంగళవారం మండలంలోని అచ్చియ్యపాలెం, కొండూరుపాలెం, ఎ. కొత్తపల్లి, కేఎం పాలెం మీదుగా సాగింది. సాధన కమిటీ ప్రతినిధులు ముషిడిపల్లి వద్ద బసచేశారు. ఇప్పటివరకు 62 కిలోమీటర్ల మేర కొనసాగింది. సాధన కమిటీ సభ్యుడు వేచలపు చినరామునాయుడు మాట్లాడుతూ కొన్నేళ్లు రైవాడ రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాల ఆటలు ఇకపై సాగనిచ్చేది లేదన్నారు. రైవాడను జలాశయాన్ని రైతులకు అంకితం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దిగిరాకుంటే కెనాల్‌కు గండ్లు కొట్టేందుకుకూడా రైతులు వెనుకాడరని హెచ్చరించారు. ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ నెల 18న జరగనున్న ముగింపు సభలో ఉద్యమం ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించి నిరసన తెలుపుతామని అన్నారు. సాధన కమిటీ సభ్యుడు లెక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతాంగానికి నష్టం కలిగించే జీవో నంబరు 160ను రద్దు చేయడమే కాకుండా, జీవీఎంసీ బకాయిపడ్డ రూ.112 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 50 వేల ఎకరాలకు సాగునీరందించేలా ప్రభుత్వం స్పందించాలని కోరారు. మద్దతు తెలిపిన అజయ్‌శర్మ రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ పాదయాత్రకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కమిటీ ప్రధాన కార్యదర్శి అజయ్‌శర్మ మద్దతు తెలిపారు. మంగళవారం ఆయన ఎ.కొత్తపల్లి సమీపంలో పాదయాత్ర బృందాన్ని ఆయన కలిశారు. ఇతర దేశాలనుంచి పరిశ్రమలు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమయ్యే నీరు, పట్టణవాసుల తాగునీటికి అవసరమైన ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. పట్టి సీమ మాదిరిగా పురుషోత్తపురం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే విశాఖ నగర ప్రజలకు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి సమస్య తీరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు డి.వెంకన్న, గండి నాయనబాబు, ఆదిరెడ్డి కన్నబాబు, ఎన్నంశెట్టి సత్యనారాయణ, చల్లా జగన్, పెద్ది నాయుడు, సీహెచ్ రాజు, నాగిరెడ్డి సత్యనారాయణ, శీరంరెడ్డి సింహాద్రప్పడు, గొంప మల్లునాయుడు, రాము, వి.నాయుడుబాబు పాల్గొన్నారు. -
రైవాడ రైతులదే..
దేవరాపల్లి: వ్యవసాయ అవసరాల కోసం నిర్మంచిన రైవాడ జలాశయాన్ని రైతులకు పునరంకితం చేసే వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆఖరి పోరాటం సాగిస్తున్నామని రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ సభ్యులు తెగేసి చెప్పారు. నీటిసాధన కమిటీ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. జీవిఎంసీకీ నీరు అందించే లింక్ కెనాల్ నుంచి సీతంపేట, నాగయ్యపేట గ్రామాల మీదుగా వేపాడ మండలం వావిలపాడు వరకు తొలిరోజు పాదయాత్ర సాగింది. వివిధ గ్రామాల రైతులుతో పాటు రైతు సంఘాల నాయుకులు, పార్టీలకు అతీతంగా పలువురు నాయుకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా లింక్ కెనాల్ వద్ద రైతులతో సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ, ప్రాముఖ్యాన్ని రైతులకు వివరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్. నర్సింగరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పేర్కొన్న విధంగా వ్యవసాయ ఆధారిత జలాశయమైన రైవాడ ప్రాజెక్టును రైతులకు అంకితం చేయకుంటే మరో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. చిత్తశుద్ధిలేని టీడీపీ ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాటానికి స్వచ్ఛందంగా తరలిరావాలని రైతులకు పిలుపునిచ్చారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు రైవాడ సమస్యపై అసెంబ్లీలో గళం విప్పి పోరాడాలని హితవు పలికారు. రైవాడ నీటి సాధన కమిటీ అధ్యక్షుడు వేచలపు చినరామునాయుడు మాట్లాడుతూ రైవాడను రైతులకు అంకితం చేసి, అదనపు ఆయుకట్టు ఆరువేల ఎకరాలతో పాటు కాలువకు ఆనుకొని ఉన్న గ్రామాలన్నింటికి సాగు నీరందించాలన్నారు. జీవీఎంసీకి పైపులైన్ ప్రతి పాదనను శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరు ఆగదని స్పష్టం చేశారు. లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ రైవాడ రైతులను కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, దీనిపై పోరాటానికి రైతులు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నీటిపారుదలశాఖ రిటైర్డ్ సీఈ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయితేనే విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, రైవాడ ప్రాజెక్టు నీటి సాధన కమిటీ సభ్యులు గండి నాయన బాబు, లెక్కల శ్రీనివాసరావు, ఆదిరెడ్డి కన్నబాబు, డి. వెంకన్న, సీహెచ్. రాజు, చల్లా జగన్, లెక్కల అవతారమూర్తి, జామి గోవింద, ఆర్. ముత్యాలనాయుడు, వేమాల కన్నబాబు పాల్గొన్నారు.