breaking news
rain Conditions
-
అడుగంటుతున్న జలాశయాలు
- వరుణుడు ముఖం చాటేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి - రాష్ట్ర జలాశయాల్లో సగటు నీటిమట్టం 26 శాతం - కొంకణ్‌లో అధికంగా 48, మరాఠ్వాడాలో అత్యల్పంగా 7 శాతం - తీవ్ర నీటి ఎద్దడిలో పలు గ్రామాలు సాక్షి, ముంబై: గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఈ సారీ వరుణుడు ముఖం చాటేయడంతో ముంబైకు నీరందించే ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. రోజురోజుకూ జలాశయాల నీటి మట్టం కనిష్ట స్థాయిని మించి తగ్గిపోతున్నాయి. గతేడాది కంటే త్వరగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లోని సగటు నీటిమట్టం 26 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి 18 శాతం నీటి మట్టం ఉంది. ప్రస్తుతం కొంకణ్‌లో అత్యధికంగా 48 శాతం నీటి నిల్వలు ఉండగా, పుణేలోని జలాశయాల్లో 30 శాతం, నాగపూర్‌లో 27 శాతం, నాసిక్‌లో 21 శాతం నీటి నిల్వలున్నాయి. ఇక మరాఠ్వాడా పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ ఏడు శాతానికి నిల్వలు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి వర్షాలు సమయానికి వచ్చాయి. కానీ జూన్ మూడో వారం నుంచి పత్తాలేకుండా పోయాయి. అక్కడ అక్కడ చిరు జల్లులు కురిసినా మోస్తరు నుంచి భారీ వర్షాలు మాత్రం కురవడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా సాగు ప్రశ్నార్థకం కాగా, చాలా ప్రాంతాల్లో తాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. మరాఠ్వాడాలోని బీడ్, ఉస్మానాబాద్, లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉంది. వర్షాలు కురవకపోతే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్య మరింత తీవ్రం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైకి మూడు నెలలు సరిపడా...! ముంబైకి మూడు నెలలు సరిపడా నీటి నిల్వలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రుతుపవనాల రాకతో కురిసిన భారీ వర్షానికి ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీరు చేరుకుంది. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేసినా జులై నెలాఖరుకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తోంది. -
ప్రాణం తీసిన పత్తిసాగు
తీలేర్‌లో కౌలురైతు ఆత్మహత్య కుటుంబ సభ్యుల రోదనలు పెద్దచింతకుంట (ధన్వాడ) : వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే... ధన్వాడ మండలం పెద్దచింతకుంటకు చెందిన కుర్వ చిన్న మల్లేష్(38) కు ఐదెకరాల పొలం ఉంది. ఈయనకు భార్య పద్మమ్మతోపాటు కుమారుడు, ఇద్దరు కుతూళ్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం తీలేర్ శివారులో మరో 20ఎకరాలు కౌలుకు తీసుకు న్నాడు. అప్పటి నుంచిఎకరాకు *20 వేల చొప్పున పెట్టు బడులు పెట్టి పత్తి, ఆముదం సాగు చే యసాగాడు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల నుంచి ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పుల భారం *12 లక్షలకు పెరి గింది. వీటిని తీర్చడానికి ఏడాది కాలంగా తీలేర్ సింగిల్‌విండోలో రుణం కోసం తిరుగుతున్నాడు. అది ఇంతవరకు మంజూరు కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే అతను శనివారం ఉదయం బంధువుల వద్దకు వెళ్లొస్తానని కుంటుంబ సభ్యులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అదే రాత్రి బైక్‌పై కౌలుకు తీసుకున్న పొలానికి వెళ్లి విస్కీలో పురుగుమందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే కుంటుంబ సభ్యులతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ మధుసూదన్‌గౌడ్, వీఆర్ఓ రాఘవేందర్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.