breaking news
Public Works Department
-
చివరికి చెన్నై బలి!
♦ నగరంలో 40 శాతం చెంబరబాక్కం నీరే... ♦ ప్రజాపనులశాఖ బాధ్యతారాహిత్యమే కారణం! చెన్నై, సాక్షి ప్రతినిధి : నీటిని అదిమిపడితే ముంచుకొచ్చే ముప్పు.. ఒక్కసారిగా విడిచిపెడితే తలెత్తే విపత్తు.. ఈ రెండింటిపై అవగాహన లేకే చెన్నై చెరువైందా? దీనికి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు మాత్రం అవుననే అంటున్నారు. చెన్నై నగరం దాదాపు 40 శాతం మునకకు చెంబరబాక్కం చెరువే కారణమని, అధికారులు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలవల్లే ఈ దుస్థితి దాపురించిందని చెబుతున్నారు. వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.., ఓవైపు పైనుంచి నీరు పోటెత్తుతున్నా పట్టించుకోకుండా చెంబరబాక్కం చెరువులో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరేదాకా చూసి, ఆ తర్వాత అకస్మాత్తుగా నీటిని వదలడంతోనే ఈ విపత్తు తలెత్తిందని చెబుతున్నారు. అకస్మాత్తు నిర్ణయం.. అపార నష్టం చెన్నై ప్రజల దాహార్తిని తీర్చే చెంబరబాక్కం చెరువులో నీటి మట్టం ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో నవంబర్ 16వ తేదీ నుండి ఉపరితల నీటిని వదులుతున్నారు. ఇలా విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని క్రమేణా 10 వేల ఘనపుటడుగులకు పెంచారు. ఆ తర్వాత ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో ఔట్‌ఫ్లోను సైతం తగ్గించారు. దీంతో పైనుంచి వచ్చే ప్రవాహంతో చెరువు నిండుకుండలా మారింది. అదే సమయంలో ఒక్కసారిగా మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. 24 గంటల వ్యవధిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరడంతో మంగళ, బుధవారాల్లో నీటి విడుదలను అకస్మాత్తుగా పెంచేశారు. దీంతో చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అనుకోని ముప్పుతో అతలాకుతలం.. అకస్మాత్తుగా ఇళ్లలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో ప్రజలు భీతావహులయ్యారు. ప్రాణాలు ఉగ్గపట్టుకుని రక్షించేవారి కోసం ఎదురుచూశారు. బోట్లు, పడవల సాయంతో బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. విలువైన సామగ్రినిసైతం వదిలి ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులే ముంచేశారు.. చెన్నైలో జనావాసాల మధ్య నుండి ప్రవహించే అడయారు చెరువులో నీటి మట్టం ఎంత ఉందో అంచనావేయకుండా చెంబరబాక్కం చెరువును కాపాడుకుంటే చాలని ప్రజాపనుల శాఖ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయం నగరాన్ని నిలువునా ముంచేసిందని స్థానికులు దుయ్యబట్టారు. చెంబరబాక్కం నుండి ఉరకలు వేస్తూ ప్రవహించిన నీటికి.. వరదనీరు తోడవడంతో నగరంలోని సైదాపేట, తేనాంపేట, ఆలందూర్, కొట్టూరుపురం, అడయారు, కున్రత్తూరు తదితర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయని ఆరోపించారు. చెంబరబాక్కం చెరువును కాపాడుకోవడం కోసం నగరంలోని లక్షలాది ప్రజలను నిరాశ్రయులను చేశారని, వేలాది ఇళ్లను ముంచేశారని వాపోయారు. అధికారుల బాధ్యతారాహిత్యం: రిటైర్డు ఇంజనీరు చెంబరబాక్కం చెరువు నుండి నీటి విడుదలలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ప్రజాపనుల శాఖ రిటైర్డు ఇంజనీరు ఒకరు వ్యాఖ్యానించారు. చెంబరబాక్కం చెరువు నుండి భారీస్థాయిలో నీటిని విడుదల చేయాలని అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమే ఈ దారుణానికి కారణమన్నారు. చెంబరబాక్కం పరీవాహక ప్రాంతాలన్నీ నివాస గృహాలతో చాలా ఇరుకుగా ఉంటాయని, దీనిపై ప్రజాపనుల శాఖాధికారులు అవగాహనారాహిత్యంతో వ్యవహరించడం చె న్నైకి శాపంగా పరిణమించిందని అన్నారు. సహాయ కార్యక్రమాల్లో కొత్త పంథా న్యూఢిల్లీ: తమిళనాడు వరదబాధితులకు కనీస సహాయాన్ని అందించడం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) సోషల్ మీడియాను అనుసంధానంగా ఉపయోగించుకుంటోంది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వరద బాధితులను, సహాయం అవసరమైన వారిని గుర్తించే కొత్త ప్రయత్నాన్ని చేస్తోంది. దీని కోసం ఢిల్లీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ సంస్థ. అనునిత్యం ఫేస్బుక్లో, ట్విటర్లను గమనిస్తూ... సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన పోస్టుల విషయంలో స్పందించడమే ఈ విభాగం పని. వరదల్లో చిక్కుకున్న ప్రజల్లో కొంతమంది తమ పరిస్థితిని సోషల్నెట్వర్కింగ్ సైట్ల ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. తమిళనాడు వరద బాధితుల నుంచి ఎలాంటి పోస్టులు కనిపించినా వాటికి స్పందనగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి పోస్టులు వస్తున్నాయి. వారి సమాచారాన్ని తెలుసుకుని.. చెన్నైలో సహాయ కార్యక్రమాల విధుల్లో ఉన్న బృందాలకు ఆ సమాచారాన్ని అందిస్తోంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్హెచ్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ పేరుతో సోషల్నెట్వర్కింగ్ సైట్లలో హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు ప్రచురితం అవుతున్నాయి. సాయానికి సిద్ధం: అమెరికా వాషింగ్టన్: చెన్నై వరదల సహాయకార్యక్రమాల్లో భారత్‌కు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఇండియా నుంచి సహాయం కోసం ఎలాంటి విజ్ఞప్తి రానప్పటికీ.. మానవతా దృక్పథంతో ఎలాంటి సహాయ చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిఘటిస్తున్నామని, ఇప్పటికీ వరదల్లో చిక్కుకున్న ప్రజల పట్ల సానుభూతితో ఉన్నామని ఆయన అన్నారు. భారత ప్రభుత్వంతో అమెరికన్ గవర్నమెంటు సంప్రదింపులు జరుపుతోందని గురువారం ఆయన ప్రకటించారు. ఇలాంటి విపత్తును ఎదుర్కొన శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని, నమ్మకమైన మిత్రదేశం కాబట్టి ఇండియా విషయంలో తాము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్డులు, సర్టిఫికెట్లు.. సర్వం పోయాయి చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రతి ఒక్కదానికీగుర్తింపుకార్డు కోరే ఈ రోజుల్లో చెన్నై నగరంలోని ముంపు బాధితులు సర్వం కోల్పోయారు. ఖరీదైన జీవితానికి పేరైన సినీనటీనటులు, దర్శక నిర్మాతల ఇళ్లు సైతం ముంపునకు గురయ్యాయి. ఓటర్, ఆధార్, రేషన్, పాన్ కార్డులు నీట మునిగిపోయాయి. కొందరి ఇళ్లలో అవి మొత్తం కొట్టుకుపోయాయి. ఇప్పుడు నువ్వు ఎవరు? అంటే తాను తానేనని రుజువు చేసుకోవడానికి కావలసిన ‘గుర్తింపు’ కార్డేదీ లేని దయనీయ స్థితిలో చెన్నైవాసులు ఆందోళన చెందుతున్నారు. రేపన్నాక పరిహారం అందాలన్నా, కొత్త ఇళ్లు మంజూరవ్వాలన్నా ఆ కార్డులే ఆధారమైన నేపథ్యంలో వాటిని మళ్లీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్నది వారి ఆవేదన. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే మరీ ఘోరం. ఇన్నాళ్లూ కష్టపడి చదివి సంపాదించుకున్న చాలా మంది విద్యార్థుల సర్టిఫికెట్లు వరదలో గల్లంతైపోయాయి. వాటిని మళ్లీ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడాలో ఆ దేవుడికే ఎరుక! ఇది ఓ కోణమైతే.. మరోవైపు గత నెల 6వ తేదీ నుంచీ వర్షాల వల్ల పాఠశాలలకు, కాలేజీలకూ సెలవులివ్వడంతో సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో, వాటికి ఎలా ప్రిపేర్ కావాలో అన్న ఆందోళన మరికొందరు విద్యార్థులది. -
పీడబ్ల్యూడీ అధికారులపై కొరడా!
22 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సాక్షి, ముంబై : ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)లో కాంట్రాక్టర్లలో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసకుంది. క్వాలిటీ కంట్రోల్ బోర్డు (నాణ్యత నియంత్రణ మండలి)కి తప్పుడు పత్రాలు సమర్పించి ఉత్తర ముంబై ప్రజా పనులు శాఖ (పీడబ్ల్యూడీ)లో అక్రమాలకు పాల్పడిన 22 మంది ఇంజనీర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. కాగా, 19 మంది కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చి వారికి ప్రభుత్వ సంబంధిత పనులు అప్పగించరాదని సూచించారు. ఒకేసారి 22 మంది ఇంజనీర్లపై వేటు వేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇదీ జరిగింది... అంధేరీ వార్డు పరిధిలోని సంబంధిత ఇంజనీర్లు మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే పనులు నాణ్యంగా జరుగుతున్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సదరు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయించారు. కాగా, ఉత్తర ముంబై కార్యాలయంలో మంజూరు చేసిన బిల్లుల్లో అవకతవకలున్నాయని, వీటిని తిరిగి పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లోని కాగ్ కార్యాలయం అధికారులను ఆదేశించింది. దీంతో తనిఖీలు చేపట్టిన అధికార బృందానికి ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి. దాదాపు 22 మంది ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బిల్లులు మంజూరు చేయించారని వెల్లడైంది. ఈ తతంగంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు బయటపడింది. -
రంగంలోకి ఏసీబీ
సాక్షి, చెన్నై : ప్రజా పనుల శాఖలో అవినీతి భాగోతంపై ఏసీబీ దృష్టి కేంద్రీకరించింది. పలు బృందాలుగా ఏసీబీ అధికారులు ప్రజా పనుల శాఖకు సంబంధించిన డివిజన్ కార్యాలయాల్లో తనిఖీల్లో నిమగ్నమైనట్టు వెలుగు చూసింది. అధికారుల వద్ద విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ప్రజాపనుల శాఖలో అవినీతి తిమింగళాలు అం టూ గత నెల సచివాలయం ఆవరణలో వెలిసిన ఓ ఫ్లెక్సీ అధికార వర్గాల్లో కలకలం రేపింది. తొలి విడతగా హెచ్చరిక, మలి విడతగా అవినీతి అధికారులు బండా రం బయట పెడుతూ, వారి ఫొటోలు, పేర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు కావడం చర్చనీయాంశమైంది. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒప్పందదారులు, కాంట్రాక్టర్లు అధికారులపై తీవ్ర ఆరోపణల్ని సంధించారు. అయినా ఫలితం శూన్యం. శాఖాపరంగా ఎలాంటి చర్యలు లేవు. తాజాగా ఐదో సారిగా సీఎం పగ్గాలు చేపట్టిన జయలలిత ఆరోపణలపై దృష్టి పెట్టినట్టు సమాచా రం. ఏయే అధికారులపై ఆరోపణలు వచ్చాయో వారి భరతం పట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా అవినీతి నిగ్గు తేల్చేందుకు ఏసీబీని రంగంలోకి దించినట్టున్నారు. రంగంలోకి ఏసీబీ కాంట్రాక్టర్లు, ఒప్పంద దారులు తమ మీద బురద జల్లుతున్నారని, ఫ్లెక్సీల రూపంలో తమ పరువును బజారుకీడుస్తున్నారని పలువురు ఐఏఎస్ అధికారులు చెన్నై పోలీసు కమిషనర్‌కు శనివారం విన్నవించిన విష యం తెలిసిందే. అలా... అధికారులు తమ పరువు కాపాడుకునే రీతిలో పోలీసుల్ని ఆశ్రయిస్తే, ఇలా ఒప్పం దదారులు, కాంట్రాక్టర్లు ప్రకటించిన మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది అధికారులపై ఏసీబీ గురి పెట్టడం చర్చనీయాంశమైంది. ఆయా అధికారుల కార్యాలయాల్లో శనివారం నుంచి ఏసీబీ వర్గా లు తనిఖీలు సాగిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, ప్రజా పనుల శాఖకు సంబంధించిన డివిజన్ కార్యాలయాల్లో, ఇప్పటి వరకు ఇచ్చిన అనుమతులు, జరిగిన పనులు, తదితర వివరాల సేకరనలో ఏసీబీ నిమగ్నమైనట్టు తెలిసింది. ఆయా కార్యాలయాల నుంచి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు, సంబంధిత అధికారులతో విచారణ సాగిస్తున్నట్టుగా ప్రజా పనుల శాఖలో ప్రచారం బయలుదేరి ఉండడం గమనార్హం. -
మూడేళ్లలో ఎత్తినహొళె పూర్తి
ఐదు ప్యాకేజీల్లో టెండర్ల ఆహ్వానం.. నాలుగు జిల్లాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం పంచాయతీల పునర్విభజనకు కమిటీ నివేదిక అందిన తర్వాత కార్యాచరణ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ, తుమకూరు జిల్లాల ప్రజలకు తాగు నీరు అందించడానికి ఉద్దేశించిన ఎత్తినహొళె పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ తెలిపారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ పథకాన్ని తొలి దశలో చేపట్టడానికి ఐదు ప్యాకేజీల్లో టెండర్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడేళ్లలో పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పథకానికి ఎక్కడ శంకుస్థాపన చేయాలనే విషయమై ఇంకా నిర్ణయించ లేదన్నారు. టోల్ రాయితీ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలో జాతీయ రహదారిపై నిర్మించిన టోల్ వద్ద స్థానికులకు సుంకం చెల్లింపులో రాయితీలు కల్పిస్తామని ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప హామీ ఇచ్చారు. శాసన సభలో జీరో అవర్‌లో సభ్యుడు మునిశామప్ప అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆ టోల్‌ను నిర్మించామని చెప్పారు. హైవే అథారిటీ ఒప్పందం ప్రకారం టోల్ వసూలు చేస్తారని చెప్పారు. అయితే స్థానికులతో పాటు ఆ మార్గంలో నిత్యం సంచరించే వారికి రాయితీలు ఇస్తామని ఆయన వెల్లడించారు. పంచాయతీల పునర్విభజనకు వారంలోగా కమిటీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్విభజనకు సంబంధించి వారంలోగా కమిటీని నియమిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ శాసన సభకు తెలిపారు. శాసన సభలో శశికళ అన్నా సాహెబ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ర్టంలో పలు చోట్ల పునర్విభజన సమస్యలున్నాయని తెలిపారు. కొన్ని చోట్ల పంచాయతీ సభ్యుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందని, విస్తీర్ణం కూడా ఎక్కువేనని చెప్పారు. అలాంటి పంచాయతీలను విభజించాల్సి ఉందన్నారు. కమిటీ నివేదిక అందిన తర్వాత పునర్విభజన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కాగా ప్రతి పంచాయతీకి వివిధ పథకాల కింద ఏటా రూ.3 కోట్ల గ్రాంట్లు లభిస్తున్నాయని ఆయన వెల్లడించారు.