breaking news
the public
-
హేవళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-
ప్రజలకు పోలీసులు చేరువకావాలి
అనంతపురం క్రైం : ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ, వారికి చేరువ అయినప్పుడే పోలీసుల విధులకు సార్థకత లభిస్తుందని జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు టూటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చంద్రబాబునాయుడు కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆశా ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలలో సుమారు వెయ్యిమందికి వైద్య చికిత్సలు నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రీషిన్ తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు వైద్య సేవలు అందించారు. సుగర్ తదితర రక్తపరీక్షలు జరిపారు. గుండె జబ్బుల నిర్ధారణ కోసం ఈసీజీ చేపట్టారు. వీటితో పాటు స్కానింగ్ అవసరమైన వారికి స్థానిక ఆశా ఆస్పత్రిలో ఉచితంగా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ నిత్యం బందోబస్తులు, రోజువారీ విధులతో తలమునకలయ్యే తమ సిబ్బందికి ప్రజాసేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలోనూ పోలీసులు స్వచ్ఛభారత్, ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవించడం కోసం పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఏ కష్టమొచ్చినా పోలీసుల వద్దకు వెళ్తే తక్షణమే పరిష్కారం లభిస్తుందన్నారు. కాలనీల్లో ఎక్కడైనా మట్కా, పేకాట, భూకబ్జాలు తదితర అరాచకాలు ఉంటే వెంటనే తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టూటౌన్ సీఐ శుభకుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆశా ఆస్పత్రి ఎండీ డాక్టర్ సోమయాజులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఏ సమయంలో ఫోన్ చేసినా తక్షణమే స్పందిస్తున్నారన్నారు. అనంతపురం ఎస్పీ జే. మల్లికార్జునవర్మ, ఇతర సీఐలు శుభకుమార్, ఆంజనేయులు, ఎంఆర్ కృష్ణమోహన్, శివనారాయణస్వామి, గోరంట్ల మాధవ్, శ్రీనివాసులు, ఎస్ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, జగదీష్, రుద్రంపేట సర్పంచు కాలేనాయక్, ఎంపీటీసీలు వెంకటలక్ష్మీ, కృష్ణవేణి, ఆశా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, మున్నీసా పాల్గొన్నారు. -
ప్రజలతో కలిసి పనిచేయాలి
పాలమూరు : పోలీసులు ప్రజలతో కలిసి పనిచేయాలని.. శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యమని జిల్లా నూతన ఎస్పీ శివప్రసాద్ అన్నారు. గురువారం ఆయన బదిలీ అయిన ఎస్పీ నాగేంద్రకుమార్ నుంచి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇతర వర్గాలతో సమానంగానే సామాన్య, పేదవర్గాల వారికి పోలీసు సేవలు అందుతాయన్నారు. శాఖాపరంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేస్తున్నారని, అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది ప్రజాసేవలో పోలీసులను భాగస్వామ్యులను చేస్తానని పేర్కొన్నారు. పోలీసులకు ఏవైనా ఇబ్బందులుంటే తక్షణం తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు పెండింగ్ లేకుండా జాగ్రత్త వహిస్తామని, పోలీస్ శాఖలోని అన్ని స్థా యిల అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసిపోయి పనిచేయాలని, సామాజిక సే వా దృక్పథంతో ఈ వృత్తిలో కొనసాగాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ, సీఐ, ఆ పై అధికారుల స్థాయిలో న్యాయం జరగకుంటే బాధితులు నేరుగా తన వద్దకు వచ్చి సమస్యలు చెప్పాలన్నారు. వృత్తిపరంగా జిల్లా ఎస్పీ స్థాయిలో ఉన్నప్పటికీ అటు సామాన్య ప్రజలు, పోలీసు శాఖలోని కింది స్థాయి సిబ్బందికి సైతం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. గతంలో మాదిరిగానే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతిసోమవారం గ్రీవెన్స్ సెల్‌ను కొనసాగిస్తామన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు శాఖాపరంగా అన్ని స్థాయిల్లోని సిబ్బంది కలుపుకొని పనిచేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ల పరిధిలో కేసుల నమోదు, వాటి పరిష్కారం సకాలంలో జరిగే విధంగా దృష్టి పెడతామన్నారు. -
కీలక ఘట్టం.. ముందే సిద్ధం
గణేశ్ నిమజ్జనానికి ముందస్తు కసరత్తు జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన నిమజ్జనం సందర్భంగా వాహనాలు సాఫీగా ముందుకు కదిలేందుకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన పనులకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రహదారుల మరమ్మతులతో పాటు శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించింది. రాత్రి వేళ ఇబ్బందులు ఎదురవకుండా అవసరమైనన్ని వీధి దీపాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిమజ్జన యాత్ర ప్రారంభమయ్యే బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనుంది. వివిధ మార్గాల నుంచి ట్యాంక్‌బండ్ వరకు, నిమజ్జన కార్యక్రమాలు జరిగే సరూర్ నగర్ చెరువు, సఫిల్‌గూడ చెరువు తదితర ప్రాంతాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. దాదాపు 228 కి.మీ.ల మేర ఈ ఏర్పాట్లు చేయనున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు, రహదారులు కుంగిపోయినా వెంటనే మరమ్మతులు చేసేందుకు తగిన మందీమార్బలం, యంత్ర సామాగ్రిని అందుబాటులో ఉంచనున్నారు. ఈ పనులకు రూ.11.49 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ఇవీ వివరాలు ... నిమజ్జన మార్గం: 227.85 కి.మీ.లు ఏర్పాట్లు చేసే జీహెచ్ఎంసీ విభాగాలు: శానిటేషన్, ఇంజినీరింగ్, విద్యుత్, జీవవైవిధ్య విభాగం. ప్రతి 3-4 కి.మీ.లకు ఒక గణేశ యాక్షన్ టీమ్(జీఏటీ) ఏర్పాటు. ఒక్కో జీఏటీలో ఒక శానిటరీ సూపర్వైజర్, ముగ్గురు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 21 మంది కార్మికులు ఉంటారు. ఈ టీమ్‌లు రెండు షిఫ్టులుగా పనిచేస్తాయి. మొత్తం జీఏటీలు: 122 శానిటరీ సూపర్వైజర్లు/శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు: 488 మంది మొత్తం కార్మికులు: 2826 పనులు ఇలా... దాదాపు 320 ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలను తొలగించాల్సి ఉంటుందని అంచనా. ఇందుకుగాను జీహెచ్ఎంసీలోని 18 సర్కిళ్లకు కనీసం ఒక్కో జేసీబీ, ఆరుటన్నుల వాహనాలు 4 వంతున అవసరం. జనసమ్మర్ధం అధికంగా ఉండే ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, చార్మినార్ తదితర ప్రదేశాల్లో 19 మొబైల్ టాయ్లెట్ల ఏర్పాటు. నిమజ్జన యాత్ర సాఫీగా సాగేందుకు రహదారుల మరమ్మతులు, పాట్‌హోల్స్ పూడ్చివేత, కెర్బ్ పెయింటింగ్‌లు, లేన్ మార్కింగ్‌లు. ఎంపిక చేసిన 103 మార్గాల్లో ఈ పనుల కోసం రూ. 10.31 కోట్లు కేటాయించారు. పనులు చేయాల్సిన ప్రధాన మార్గాలు: బాలాపూర్-ట్యాంక్‌బండ్, ఎస్సార్‌నగర్, పంజగుట్ట, అమీర్‌పేట, తిరుమలగిరి, రాణిగంజ్, వారాసిగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, క్లాక్‌టవర్, ప్యారడైజ్, ప్రధాన రహదారిని కలిపే అంతర్గత రహదారుల్లోనూ పనులు చేయాల్సి ఉంది. అత్యవసరంగా రోడ్ల మరమ్మతులు చేసేందుకు.. వర్షం వచ్చి దెబ్బతిన్నా వెంటనే పూర్తి చేసేందుకు వెట్‌మిక్స్, పాట్‌హోల్ రిపేర్మెషిన్, షెల్మాక్లు కలిగిన వాహనాలతో ప్రత్యేక ఏర్పాట్లు. ఎప్పటికప్పుడు పనుల నిర్వహణకు ఒక్కో ఇంజినీరింగ్ డివిజన్‌కు 24 బృందాల నియామకం. ప్రతి బృందంలో ఏఈ, ఇతర సిబ్బంది, కార్మికులు ఉంటారు. రెండు షిఫ్టుల్లో పనులు చేస్తారు. విద్యుత్ ఏర్పాట్లు నిమజ్జన మార్గం పొడవునా విద్యుత్ దీపాలు వెలిగేలా చూస్తారు. అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు. విద్యుత్ స్తంభాలకు రంగులు వేయడం వంటిపనులు చేస్తారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ఒక్కో షిఫ్టులో ఒక సూపర్వైజర్, ఇద్దరు ఎలక్ట్రీషియన్లను అందుబాటులో ఉంచుతున్నారు. యాత్ర మార్గంలో చెట్టుకొమ్మల నరికివేతకు సర్కిల్ కు ఒక జీవవైవిధ్య విభాగ టీమ్‌ను నియమిస్తారు. రెండుషిఫ్టులుగా ఈటీమ్లు పనిచేస్తాయి. సున్నిత ప్రాంతాల్లో అత్యవసరంగా పని చేసేందుకు 18 ప్రత్యేక బృందాలను నియమించారు. అవసరమైన సామగ్రితో ఈ టీమ్‌లు 24 గంటలూ సిద్ధంగా ఉంటాయి. పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి బేసిన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిషనర్, జీహెచ్ఎంసీ, రవాణా శాఖల నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గకుండా ఓ అధికారి, డెరైక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ నుంచి జాయింట్ డెరైక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.