అధికారులపై దాడులు సహించం
మక్తల్ : విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరిగితే సహించబోమని టీజేఏసీ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం హెచ్చరించారు. ఇంజనీర్లపై జరిగిన దాడులకు నిరసనగా టీæజే ఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి 150 కార్లలో జిల్లాకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మక్తల్ భీమా ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్ వద్ద నిర్వహించిన సమావేశంలో వెంకటేశం మాట్లాడారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీరందించడానికి సీఈ ఖగేందర్తోపాటు మిగతా అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే తాగిన మైకంలో రాజకీయ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, బంగారు తెలంగాణ సాధనలో ఇంజనీర్ల పాత్ర కీలకంగా ఉందని, అలాంటి వారిపై దాడులు జరగడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ఊరికే పోనివ్వమని, రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర
ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో కొందరు పనికట్టుకొని దాడులకు పూనుకుంటున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇంజనీర్లపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇకనుంచి ఎలాంటి దాడులు చేసినా ఊరుకోబోమన్నారు. గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించని నాయకులు తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా ఉద్యమానికి దూరంగా ఉండి తెలంగాణ వచ్చాక ఉద్యోగులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యోగులకు తమ పూర్తి అండ ఉంటుందని భరోసానిచ్చారు.