breaking news
PC Sarkar Jayanti
-
అబ్రకదబ్ర.. చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం
చేతిలో నుంచి విభూతి, నోటిలో నుంచి శివలింగం తీయడం వంటివి చూసి దైవాంశ శక్తులున్న వారే ఇలా చేయగలరని గుడ్డిగా నమ్మడం, చేతబడి, చిల్లంగి వంటివి ఉన్నాయన్న మూఢ నమ్మకాలతో దారుణంగా మోసపోతున్న ప్రజల్లో ఇంద్ర జాలకులు చైతన్య కల్పిస్తున్నారు. మానవతా దృక్పథంతో ఓ అడుగు ముందుకేసి అవన్నీ ఊహాజనితమేనంటూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు పద్మశ్రీ పీసీ సర్కార్ (సీనియర్) జయంతి ఫిబ్రవరి 23న ఏటా ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే కోవిడ్ ప్రభావంతో ఎక్కడా సరైన ప్రోగ్రామ్‌లు లేక ఇంద్రజాలంపైనే ఆధారపడి జీవిస్తున్న కళాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఇంద్రజాలకుల అభిప్రాయాలిలా ఉన్నాయి. – విజయనగరం సమాజంలో మార్పుకోసం కృషి గత 48 ఏళ్లుగా ఇంద్రజాల రంగంలో రాణిస్తూ, జాతీయస్ధాయిలో జిల్లా పేరును నిలబెట్టేందుకు కృషిచేస్తున్నాను. సమాజంలో మార్పుకోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాను. సుమారు పదివేలకు పైగా ప్రదర్శనలు దేశమంతా ఇవ్వగలిగాను. కళ ఎప్పుడూ మరుగున పడిపోదు. కళాకారుల కళపైనే ఆధారపడి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి. పూర్వం విద్య గోప్యంగా ఉండేది. ప్రస్తుతం యూ ట్యూబ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత బహిర్గతమైంది. అందులోనూ కేవలం 40 శాతం నిజం ఉంటుంది. పూర్వం థియేటర్ షోలు, స్టాండర్డ్ ఫ్లాట్‌ఫామ్‌లు ఉండేవి. ప్రస్తుతం బర్త్‌డే, మ్యారేజ్‌డే షోలు మాత్రమే ఉంటున్నాయి. చిన్నపాటి స్థలంలో అద్బుతాలు సృష్టించే అవకాశం తక్కువగా ఉంటుంది. – సీహెచ్. శ్యామ్, సీనియర్ మెజీషీయన్ ఆసక్తే ప్రేరణ కల్పించింది చిన్న నాటి నుంచి ఇంద్రజాలమంటే ఎంతో ఆసక్తి. అదే ఆసక్తి నాలో ప్రేరణ కల్పించి, నేర్చుకునేలా చేసింది. గ్రామగ్రామాన అవకాశం వచ్చినప్పుడల్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు కృషిచేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్లో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్నప్పటికీ ఎక్కడ అవకాశం వచ్చినా ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నాను. – పవన్ ఆశిష్, మెజీషీయన్ ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చా చేతబడి, చిల్లంగి పూర్తిగా మోసం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించేందుకు మేజిక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ఏ ప్రాంతానికి వెళ్లినా మూఢనమ్మకాలను పారద్రోలడానికి కృషిచేస్తున్నాను. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇస్తే మంచి కార్యక్రమాలను చేయడానికి సిద్ధం. – ఎస్కె.సలీమ్, ఇంద్రజాలికుడు మేజిక్ సిస్టర్స్‌గా ప్రతిభ మేజిక్ సిస్టర్స్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు అందుకున్నాం. చిన్నప్పటినుంచి నాన్న చారి మా గురువు. 2006 నవంబరు 14న ఢిల్లీలో జాతీయస్థాయి అవార్డును ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకోవడం తృప్తినిచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామగ్రామాన పర్యటించి, ప్రజల్లో మూఢ నమ్మకాలు పారదోలడంపై అవగాహన కల్పిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి మేజిక్ సిస్టర్స్‌గా పేరుగాంచాం. – సుస్మిత, మౌనిక -
అబ్రకదబ్ర...!
‘‘అబ్రకదబ్ర.. మాయూ లేదు.. మంత్రం లేదు.. హాంఫట్..’’ అనగానే చేతిలో ఉన్న పాలపిట్ట పూలగుత్తిలా.. ఆ తర్వాత కోడిగుడ్డులా మారిపోతుంది.. ఇలాంటి ఇంద్రజాల విన్యాసాలెన్నో మనం చూస్తూనే ఉంటాం.. అబ్బురపడి హర్షధ్వానాలు చేసే ఉంటాం.. మాయాలేదు.. మంత్రం లేదంటూ ఆ ఇంద్రజాలికులు చేసే విన్యాసం గుట్టు విప్పినప్పుడు ఓ ఇంతేనా అని నిట్టూర్చే ఉంటాం. తమ మ్యాజిక్‌లతో ప్రజలను మెప్పిస్తూ మూఢనమ్మకాల గుట్టు విప్పుతూ ప్రజలను, సమాజాన్ని చైతన్య పరిచే ఇంద్రజాలికులు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు.. పశ్చిమబెగాల్కు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికులు పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జరిగే ప్రపంచ ఇంద్రజాల దినోత్సవంపై ప్రత్యేక కథనం.. - ఇంద్రియూలను మాయచేసే ఇంద్రజాలం - మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మెజీషియన్లు - నేడు ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సత్తుపల్లి టౌన్ : మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. మానవ ఇంద్రియాలను(చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక) పక్కదోవ పట్టించేదే ఇంద్రజాలం. వీధుల్లో పొట్టకూటికోసం చేసే పలు మాయలను గారడీలుగా చెప్పుకుంటాం.. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు ప్రజలను మభ్యపెట్టేందుకు సృష్టించే పలు రకాల వస్తువులను చూసి వారి మహిమగా భావిస్తారు.. ఈ విషయూలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వీటిని ఒక వేదికపై ప్రదర్శిస్తే ఇంద్రజాలం అంటారు. చేతబడులు, బాణామతి, దయ్యాలు, భూతాలు వంటివి ఉండవనే ఈ ఇంద్రజాల ప్రదర్శకులు వారి ప్రదర్శనల ద్వారా నిరూపిస్తారు. వీరు ప్రజలను చైతన్య పరుస్తూనే పలు ప్రభుత్వ పథకాలకు ప్రచారానికి పని చేస్తుంటారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా.. : ప్రేక్షకులను మైమరిపిస్తూ.. మాయాలేదు.. మంత్రం లేదంటూనే గాలిలోనే పూలు పూయించటం ఇంద్రజాలికులకే సొంతం. సాధ్యం కానివాటిని సుసాధ్యం చేస్తూ అబ్బుర పరిచేదే ఇంద్రజాల ప్రదర్శనలు. ఇవి నేటి యాంత్రిక జీవనంలో మనస్సుకు ఉత్తేజాన్ని.. ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఎన్నో ప్రాచీన కలలు మరుగున పడుతున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికి మూఢవిశ్వాసాలలో కొందరు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. గగుర్పొడిచే విన్యాసాలు : ఇంద్రజాలికులు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రేక్షకులు చూస్తుండగానే ఖాళీ చేతుల్లో నుంచి పావురాలు, గొడుగులు సృష్టించటం.. మనిషిమెడలో నుంచి కత్తి గుచ్చటం.. గాలిలోనే టేబుల్‌ను నిలబెట్టడం.. తలపై మంటవెలిగించి టీ తయారు చేయటం.. వంటి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ వాటి రహస్యాలను విప్పి చెపుతున్నారు. మనిషిని రెండు ముక్కలు చేయించటం.. ఖాళీ టోపీలో నుంచి కోడిపిల్లలను ఇలా రకరకాల ఇంద్రజాల ప్రదర్శనలతో మెప్పిస్తున్నారు. కానీ తమ శ్రమ, కష్టాలు, ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని ఇంద్రజాలికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఇతర ప్రచార కార్యక్రమాలలో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. చైతన్యం తెచ్చేదే ఇంద్రజాలం : ఇప్పటి వరకు 1500లకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చా. ఈ ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. మూఢ విశ్వాసాలను పారద్రోలేందుకు కృషి చేస్తున్నాం. నేటి యాంత్రిక జీవ నంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి, మానసిక ఉల్లాసానికి మా ప్రదర్శనలు దోహదపడుతున్నాయి. - జుజ్జూరి వెంకటేశ్వర్లు, మెజీషియన్, సత్తుపల్లి ప్రోత్సహించాలి : నేటి సాంకేతిక సమాజంలో విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు ఇంద్రజాలం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే ఇంద్రజాల 2విద్యను అందరు ప్రోత్సహించాలి. ఇంద్రజాలికులను ప్రభుత్వం గుర్తించాలి. - జె.సాయి, సత్తుపల్లి