breaking news
Palace Grounds
-
పెద్దల పెళ్లి ఉంది.. అటు వైపు వెళ్లద్దు
సాక్షి, బెంగళూరు: ‘నగరంలోని ప్యాలెస్ మైదానంలో రేపు సాయంత్రం పెద్దల పెళ్లి జరుగుతోంది. ప్యాలెస్ మైదానం వైపుగా వెళ్లకుండా వాహనదారులు ప్రయాణం మళ్లించుకోండి’ ఇది సాక్షాత్తు నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర చేసిన ట్వీట్. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు సూరజ్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహం నేపథ్యంలో ట్రాఫిక్ కమిషనర్ ఈ మేరకు నగర పౌరులకు ట్వీటర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. బెంగళూరు విమానాశ్రయాన్ని నేరుగా చేరుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గమని, దారి మళ్లించుకోవడం కుదరదని నెటిజన్లు గట్టిగా చెప్పారు. పెద్దల కోసం సామాన్యులు ఎందుకు దారి మళ్లించుకోవాలంటూ మరికొందరు ఘాటుగా ప్రశ్నించారు. నెటిజన్ల ట్వీట్లకు హితేంద్ర కూడా ఘాటుగానే బదులిచ్చారు. పెద్దల పెళ్లి ఉంది కాబట్టి చాలా మంది ప్రముఖులు వివాహానికి హాజరవుతారని, ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే ప్రమాదముందని, అందుకే ప్రజలకు తెలియజేద్దామని సూచించినట్లు తెలిపారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమేనని, నిబంధన కాదని వెల్లడించారు. నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో తాను ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు. -
అంగరంగ వైభవంగా.. గాలివారి పెళ్లి సందడి
-
చర్చలతోనే ‘కావేరి’ సమస్య పరిష్కారం
సాక్షి, బెంగళూరు: ‘కావేరి’ నదీ జలాల పంపిణీ విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పదేపదే వాగ్వాదాలకు దిగకుండా, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ సూచించారు. నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన ‘రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల సదస్సు’ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1924 నుంచి కావేరి జల వివాదం ఇరు రాష్ట్రాల నడుమ నలుగుతూనే ఉందని గుర్తు చేశారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైందని, అయినా మోక్షగుండం విశ్వేశ్వరయ్య కేఆర్ఎస్ డ్యాంను నిర్మించి రాష్ట్ర ప్రజలకు పెద్ద బహుమతిని అందజేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి కావేరి జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతి ఏడాది సమస్య తలెత్తుతూనే ఉందని వెల్లడించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మూడేళ్ల పాటు సరైన వర్షాలు లేక కరువు పరిస్థితులు ఎదురయ్యాయని, అయినా కావేరి విషయంలో గొడవలు కూడా నడిచాయని తెలిపారు. కావేరి జలాల పంపిణీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాలు ముందుగా కావేరి నీటిపై ఉన్న మమకారాన్ని వదిలి పెట్టాలని కోరారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. ఈ సందర్భంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన స్మరించుకున్నారు. విశ్వేశ్వరయ్య ముందు చూపు కారణంగానే మైసూరు బ్యాంక్, ఇనుము- ఉక్కు కర్మాగారం, శివన సముద్రం వ ద్ద జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని కొనియాడారు. వీటన్నింటి కారణంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.ఎన్.వెంకటాచలయ్య, రాష్ట్ర ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.