కాలంతో పాటు...
సొంత బ్లాగ్‌లో తన మనోభావాలను పంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే నటుడు అమితాబ్ బచ్చన్ కొత్త ఏడాదిలో కూడా ఆ ధోరణిని కొనసాగించారు. ముంబయ్‌లోని ‘జల్సా’ నివాసంలో పిల్లల హడావిడి, హంగామా ఏమీ లేకుండా నిశ్శబ్దంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు-72 ఏళ్ళ బిగ్ బి. కాలగతిలో వచ్చిన మార్పుల్ని ప్రస్తావిస్తూ, ‘‘గతంలో ఉత్తరాల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్ళం.
జనవరి 1 కల్లా మిత్రులకు చేరడం కోసం చాలా ముందుగా ఉత్తరాలు రాయాల్సి వచ్చేది. టెలిఫోన్ వచ్చాక స్వయంగా మాటలతో శుభాభినందనలు చెప్పుకుంటూ వచ్చాం. ఆ తరువాత మొబైల్ ఫోన్లు వచ్చాక రోడ్డు మీద ఉన్నవాళ్ళతోనూ మాట్లాడగలిగాం. తాజాగా, ‘ఫేస్‌టైమ్’, ‘స్కైప్’ లాంటి వాటి పుణ్యమా అని ఒకరినొకరం చూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.
మరి, రాబోయే రోజుల్లో ఇంకేం వస్తుందో?’’ అని ఆయన ఆలోచనాత్మకంగా ప్రస్తావించారు. నటుడిగా మొదలై హీరోగా ఎదిగి, ఏ.బి.సి.ఎల్. అధినేతగా మారి, ఇప్పుడు క్యారెక్టర్ నటుడిగా, టీవీ హోస్ట్‌గా అవతరించి, కాలంతో పాటు మారుతూ వచ్చి, ఆధునిక బ్లాగ్ రాతల బాట పట్టిన అమితాబ్ ఆ వచ్చే కొత్త కమ్యూనికేషన్ విధానాన్ని కూడా ఒడిసిపట్టుకుంటారని వేరే చెప్పాలా!