breaking news
Ongoal
-
అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?
వారిద్దరూ ఒకే గ్రామస్తులు. ఒకే వీధిలో నివాసం ఉండేవారు.. బాల్యం నుంచి ఇరుగుపొరుగు ఇళ్లలో కలసి మెలసి పెరిగారు. ఇద్దరూ చదువులో చురుకైన వారు.. విద్యాధికులు.. ఆ పరిణతితోనే ఒకరినొకరు ఇష్టపడినప్పటికీ పెద్దల అంగీ కారంతోనే పెళ్లి చేసుకున్నారు. నవదంపతులిద్దరూ విదేశాల్లో ఉన్నత ఉద్యాగాల్లో స్థిరపడ్డారు. చీకూచింతా లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న జీవితంలో వారిని మరో శుభవార్త పలకరించింది. భార్య గర్భం దాల్చింది. పురుడు కోసం స్వదేశంలోని పుట్టింటికి వచ్చింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చూస్తూ చూస్తూనే పది నెలలు గడచి పోయాయి. బోసినవ్వుల పసిపాపను చూసి వెళ్దామని విదేశాల్లో ఉన్న తండ్రి ఇటీవలే గ్రామానికి వచ్చాడు. భార్యాబిడ్డలతో కొద్దిరోజులు గడిపి మొన్ననే విదేశాలకు తిరుగు పయనమయ్యాడు. ఇంతలో ఏమైందో భర్త వెళ్లిన మర్నాడే భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. లోకం తెలియని పసిబిడ్డను వదలి పరలోకాలకు పయనమైంది. ఈ వార్త తెలిసిన భర్త గుండెలు బాదుకుంటూ వెంటనే విదేశాల నుంచి తిరుగుపయనమయ్యాడు. వస్తూ వస్తూ ఏమనుకున్నాడో ఇంటికి చేరేలోపే రైలు కిందపడి ప్రాణాలొదిలాడు. రెండు రోజల వ్యవధిలోనే ఏడాది నిండని ఆడపిల్లను అనా«థను చేసి తల్లిదండ్రులిద్దరూ వెళ్లిపోయారు. కన్న తండ్రి మరణం గురించి తెలియకపోయినా స్తన్యమిచ్చే తల్లి కూడా లేక ఆకలితో అలమటిస్తూ ఆ పసికందు వెక్కివెక్కి ఏడుస్తున్న తీరు చూపరులకు కలచివేస్తోంది.. అమాయకంగా చూస్తున్న బిడ్డ కళ్లు అమ్మా.. నాన్నా.. నేను చేసిన నేరమేంటి అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి. ఈ వరుస ఘటనలు మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో పెను విషాదం నింపాయి. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న దంతులు స్వల్ప వివాదాలతో ఆత్మహత్యకు పాల్పడటంతో వారి పది నెలల బిడ్డ అనాధగా మారింది. ఈ ఘటన మండలంలోని జొన్నతాళి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. బాధిత కుటుంబాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జొన్నతాళి గ్రామానికి చెందిన మెట్టల గంగయ్య(32) అదే గ్రామానికి చెందిన రమాదేవి(27) బాల్యం నుంచి ఒకే వీధిలో నివాసం ఉండేవారు. ఇద్దరూ ఎమ్మెస్సీ పూర్తి చేశారు.. యూనివర్సిటిలో ఎమ్మెస్సీ చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల ఇష్టాలతో మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సౌదీలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. సంవత్సరం కిందట రమాదేవి గర్భవతి కావటంతో పురుడు కోసం స్వగ్రామం జొన్నతాళి వచ్చింది. ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆపాపకు జానకి అని పేరు నామకరణం చేశారు. ప్రస్తుతం ఆ పాప వయసు పది నెలలు. ఈ క్రమంలో గంగయ్యకు లండన్‌లో ఉన్నత ఉద్యోగం రావడంతో సౌదీ నుంచి లండన్‌కు మారాడు. లండన్‌లో పీహెచ్డీ పట్టా ఉంటే ఉపాధి అవకాశాలు మేరుగ్గా ఉంటాయని, పీహెచ్డీ చేయాల్సిందిగా గంగయ్య తరచూ ఫోనులో భార్యకు చెబుతూ ఉండేవాడు. వచ్చే సంవత్సరం చేస్తానని ఆమె భర్తతో చెప్పినట్లు బంధువుల సమాచారం. ఈ నెలలో స్వగ్రామం వచ్చిన గంగయ్యకు భార్యతో ఇదే విషయమై స్వల్ప వివాదం జరిగింది. గత బుధవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన గంగయ్య హైదారాబాద్‌లో గురువారం రాత్రి విమానం ఎక్కి లండన్ విమానం ఎక్కాడు. ఇంతలో ఏం జరిగిందో ఆ తర్వాత కొద్దిసేపటికే ఇక్కడ రమాదేవి స్వగృహంలో ఉరివేసుకొని మరణించింది. ఈ విషయాన్ని లండన్ వెళ్తున్న గంగయ్యకు సమాచారం ఇచ్చారు. రమాదేవి తల్లి కోటిరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి శనివారం మధ్యాహ్నం మార్టూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అప్పటికే శోకసంద్రంలో ముగినిపోయిన ఆ కుటుంబానికి మరో గుండెలు పగిలే వార్త తెలిసింది. లండన్ నుంచి తిరిగి వచ్చే క్రమంలో గంగయ్య శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. ఈ ఘటనతో గ్రామంలో మరింత విషాదం అలుముకుంది. అన్నెం పుణ్యం ఎరుగని వయసులో తల్లిదండ్రులను దూరం చేసుకున్న జానకిని చూసిన వారికి నోటమాట రావటం లేదు. ఈ బిడ్డ భవిష్యత్ ఏమిటిరా భగవంతుడా అంటూ జానకి అమ్మమ్మ కోటిరత్నం హృదయవిదారకంగా రోదించటం చూపరులను కంటతడి పెట్టిచింది. గంగయ్య మృతదేహం తీసుకురావటం కోసం బంధువులు శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ వెళ్లారు. -
ఈ రోడ్డుకు నేనే మేస్త్రిని..
ఒంగోలు సబర్బన్ : అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా వ్యవహరించారు. ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ కూడలిలో ఆ పార్టీ నాయకులు రోడ్డు బ్లాక్ చేసి మరీ ప్రచార సభ ఏర్పాటు చేశారు. భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటోలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కారు. రోడ్డుపై స్టేజీ కట్టడమే కాకుండా కుర్చీలు వేసి, పాట కచేరీలతో వాహనచోదకులకు, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించారు. ట్రాఫిక్‌ను పోలీసులు దగ్గరుండి మరీ వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తూ స్వామి భక్తిని చాటుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ట్రంకు రోడ్డులో వేదిక నిర్వహణకు, మైక్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు పోలీసు అధికారులు చెప్పారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులే దగ్గరుండి మరీ కొనసాగేవిధంగా సహకరించారు. -
సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
సాక్షి, ఒంగోలు అర్బన్ : సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంచుతూ వెంటనే జీఓను వెంటనే విడుదల చేయాలని ఏపి స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి రావూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జీఓ 151 వచ్చినా 2014 నుంచి వేతనాలు, అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. గ్రాడ్యుయుటీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సహకార సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ధర్నాకు పెంట్యాల హనుమంతరావు, నాయకులు కె. లక్ష్మీనారాయణ, షేక్ మౌళాలి, శ్రీకాంత్, ఈశ్వర్, రామాంజనేయరెడ్డి, రత్నకుమారి, పాల్గొన్నారు. -
రక్తచరిత్ర
♦ కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య హత్యారాజకీయాలు ♦ అద్దంకిలో దశాబ్ద కాలం తరువాత పురివిప్పిన పాతకక్షలు ♦ ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా విబేధాలు ♦ గొట్టిపాటి అధికార పార్టీలో చేరగానే పెచ్చరిల్లిన పాత కక్షలు ♦ వేమవరం ఘటనలో ఉలిక్కిపడిన అద్దంకి ♦ ప్రతీకార దాడులకు దారితీసే అవకాశం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాంలను ఒకటి చేసి లబ్ది పొందాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం వికటించింది. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో హత్యారాజకీయాలకు తెరలేపింది. తాజాగా రెండు ప్రాణాలను బలితీసుకుంది. చంద్రాబాబు వైఖరివల్లే ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయని, టీడీపీ కార్యకర్తలను హత్య చేసేందుకే ఎమ్మెల్యే గొట్టిపాటికి లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉందని సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలు మరిన్ని ప్రతీకార దాడులకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అద్దంకి నియోజకవర్గంలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. దశాబ్దకాలం క్రితం కరణం బలరాం, గొట్టిపాటి కుటుంబాల మధ్య వర్గ విబేధాల నేపథ్యంలో పలు హత్యలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత చిన్నచిన్న ఘర్షణలు మినహా హత్యలు జరిగిన సందర్భాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి ఏడాది క్రితం అధికార పార్టీలో చేరడంతో మళ్లీ ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు తెరలేచింది. శుక్రవారం రాత్రి బల్లికురవ మండలం వేమవరంలో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కరణం వర్గీయులు గోరంట్ల అంజయ్య, ఎగినాటి రామకోటేశ్వరరావు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్యాకాండ జరిగినట్లు స్పష్టమౌతోంది. పాత కక్షల నేపధ్యంలోనే ఈ దారుణ హత్యాకాండ చోటు చేసుకుంది. కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడైన గోరంట్ల అంజయ్యను హతమార్చడమే లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. 1989లో ఇదే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు హత్య చేసినట్లు సమాచారం. ఆ నాటి దాడిలో అంజయ్య కత్తిపొట్లకు గురయ్యాడు. 20 రోజుల పాటు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అప్పట్లో తప్పించుకున్న అంజయ్యను హతమార్చాలన్న లక్ష్యంతోనే మరోమారు దాడికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. కరణం వర్గీయులు పెళ్ళికి వెళ్ళి వస్తారన్న విషయం తెలుసుకొని గ్రామ పొలిమేరలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద హతమార్చేందుకు రెక్కి సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు కరణం వర్గీయులను పెళ్లి వరకు వెంబడించి వారు తిరుగు ప్రయాణమయ్యే సమయాన్ని ఎప్పటికప్పుడు గొట్టిపాటి వర్గీయులకు చేరవేసినట్లు తెలుస్తోంది. గొట్టిపాటి అధికార పార్టీలో చేరడంతో ... ఏడాది క్రితం ఎమ్మెల్యే గొట్టిపాటి అధికార టీడీపీలో చేరడంతో అద్దంకిలో మల్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. కరణం వ్యతిరేకించినా పట్టించుకోక ముఖ్యమంత్రి చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అధికారం కోసం ఇరువర్గాలు పోటీ పడడంతో విబేధాలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. తామూ అధికార పార్టీలో ఉన్నామన్న భరోసాతో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గంతో ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న దశాబ్దాల వైరం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇందులో బాగంగానే శుక్రవారం రాత్రి బల్లికురవ మండలం వేమవరంలో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దళితుల భూములను కబ్జాచేసి గ్రానైట్ క్వారీ ఆక్రమించాడని దీనిని అడ్డుకోవడంతోనే గొట్టిపాటి తనవర్గీయులతో దాడి చేయించి తన వర్గీయుల హత్యకు కారణమయ్యాడని కరణం బలరాం విమర్శించారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను హత్య చేసేందుకు గొట్టిపాటికి లైసన్స్ ఇచ్చినట్లే ఉందని కరణం తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. గొట్టిపాటి డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాడని అదిచేసుకోని వెళ్లాలే తప్ప టీడీపీ కార్యకర్తలను హత్య చేయడమేమిటని కరణం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి గ్రామంలో జరిగిన గొడవల నేపథ్యంలో జరిగిన హత్యలేతప్ప వాటితో తనకు సంబంధం లేదని గొట్టిపాటి పేర్కొంటున్నారు. ఏదేమైనా కరణం వర్గీయులను గొట్టిపాటి వర్గీయులు హత్య చేశారన్నది యదార్ధం. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో జరిగిన ఈఘటన మళ్లీ హత్యారాజకీయాలకు బీజం వేశాయి.ఇవి ఇంతటితో ఆగక ప్రతీకార హత్యలకు దారితీసే అవకాశం ఉందన్నది పరిశీలకుల అంచనా. శుక్రవారం నుంచే నియోజకవర్గం మొత్తంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గం అంతటా పెద్ద ఎత్తున పోలీసు పికెట్స్ ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల మధ్య వర్గ విబేదాలు.. గొట్టిపాటి పెదనాన్న, మాజీమంత్రి హనుమంతరావు కాలం నుంచే కరణం కుటుంబంతో విబేధాలు మొదలయ్యాయు. తొలుత ఇరు కుటుంబాల మధ్య సఖ్యత ఉన్నా ఆ తరువాత విబేధాలు పొడచూపాయి. 1985 ప్రాంతంలో కరణం మార్టూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా విభేదించిన హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా కరణం పై పోటీచేశారు. అక్కడి నుంచి విబేధాలు మొదలయ్యాయి. ఇవి పతాకస్థాయికి చేరడంతో 1993 ప్రాంతంలో హనుమంతరావు కుమారుడు కిషోర్ మరికొందరు హత్యకు గురయ్యారు. ఇందుకు కరణమే కారణమని గొట్టిపాటి కుటుంబం చెబుతోంది. ఇరు వర్గాల మధ్య గొడవలు పెరిగాయి. ఆ తరువాత 1994లో ఇరువురూ మరోమారు పోటీ చేశారు. కరణంపై గెలిచిన హనుమంతరావు మంత్రి అయ్యారు. 1999లో కరణం ఒంగోలు పార్లమెంట్ కు పోటీచేసి విజయం సాధించారు. 2004 లో అద్దంకి నుంచి కరణం ఎమ్మెల్యేగా గెలవగా 2009 లో కరణం బలరాం, గొట్టిపాటిలు, 2014లో గొట్టిపాటి, కరణం వెంకటేశ్‌లు పోటీపడ్డారు. దీంతో మరోమారు గొట్టిపాటి, కరణం కుటుంబాలు ప్రత్యక్ష పోరుకు దిగాయి. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. రాజకీయ విబేధాలు కటుంబ కక్షలకు దారితీశాయి. అయితే ఇరు వర్గాలమధ్య ఎంత వైరమున్నా దశాబ్దకాలంగా స్వల్ప ఘర్షణలు తప్ప అద్దంకి రాజకీయాల్లో హత్యలు లేవు. కరణం టీడీపీలో కొనసాగగా గొట్టిపాటి కాంగ్రెస్ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తీవ్ర పరిణామాలు తప్పవు.. అక్రమ సంపాదన కోసం టీడీపీలో చేరిన వాడివి ఆ పని మాత్రమే చూసుకోవాలి. ఎంత తింటావో అంత తిను. దానికి పార్టీయే లైసెన్స్ ఇచ్చినప్పుడు ఎవరూ కాదనరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు ఇబ్బంది పెట్టావ్. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలనే చంపిస్తున్నావు. తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకుని రవి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీ మనుగడ అసాధ్యం. హత్యోదంతంపై ఉదాశీనంగా వ్యవహరిస్తే కార్యకర్తలను పార్టీ అ«ధిష్టానమే చంపుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది. – ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి ఏనాడూ హత్యలను ప్రోత్సహించలేదు నా రాజకీయ జీవితంలో హత్యలను ఏనాడూ ప్రాత్సహించలేదు. గ్రామాల్లో ఏవో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని తెలుసు గానీ.. ఇలా హత్యలకు దారితీసేంత కక్షలున్నాయని మాత్రం తెలియదు. నిజాలు తెలుసుకోకుండా తనపై బలరాం నిందలు మోపడం సరికాదు. సీఎంను కలిసి నిజాలు వెల్లడిస్తా. – ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్